విశాఖ ఎన్‌ఏడీలో జరిగిన వంటా వార్పులో పాల్గొన్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి
విశాఖసిటీ/మద్దిలపాలెం : నాలుగున్నరేళ్లుగా హోదా కోసం ఉద్యమిస్తున్నాం. ఇన్నాళ్లు ఏపీ ప్రజలను మోసం చేసి ఇప్పుడు యూటర్న్ తీసుకున్న చంద్రబాబు మరోసారి మభ్యపెట్టాలని చూస్తున్నారు. ప్రజలు ఈ మాయలో పడకుండా చూడాల్సిన బాధ్యత మనది. అందుకే ప్రజలతో మమేకమై ముందుకెళ్దాం. హోదా సాధనకు అవిశ్రాంతంగా కృషి చేద్దాం. ప్రత్యేక హోదా అవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేద్దాం. ఓవైపు పార్టీని మరింత బలోపేతం చేస్తూ, మరోవైపు ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా జగన్‌మోహన్‌రెడ్డి అడుగులో అడుగేద్దాం.జిల్లాలోని నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్యనాయకులకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి దిశానిర్దేశమిది.
నగర పార్టీ కార్యాలయంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలతో విజయసాయిరెడ్డి ఆదివా రం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హోదా అంశంతో పాటు పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 2వేల కిలోమీటర్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించాలని నిర్దేశించారు. 2 వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకునే 2 వారాల ముందే అన్ని నియోజకవర్గాల్లోనూ సమన్వయకర్తల ఆధ్వర్యంలో పాదయాత్రలు నిర్వహించాలని సూచించారు. విశాఖ నగర పరిధిలో 72 వార్డుల్లోనూ పాదయాత్ర చేద్దామన్నారు. తాను కూడా ఈ పాదయాత్రలో పాల్గొంటానని తెలిపారు.
నగర పరిధిలో సమన్వయకర్తలు ఆయా నియోజకవర్గాలకు మాత్రమే పరిమితం కాకుండా అన్ని నియోజకవర్గాల్లోనూ నిర్వహించే పాదయాత్రలో పాల్గొంటే ప్రజలందరితో మమేకం అయ్యేందుకు అవకాశముంటుందని సూచించారు. అన్ని వార్డుల ప్రజలను కలుసుకునేలా 12 రోజుల పాటు పాదయాత్ర నిర్వహిద్దామన్నారు. జిల్లాలోని మిగిలిన నియోజవర్గాల్లో మూడు రోజుల పాటు పాదయాత్రలు చేస్తే బావుంటుందని తెలిపారు. చివరి రోజున కలెక్టరేట్ వద్ద భారీ ఎత్తున సమావేశం నిర్వహించి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం, అవినీతి అక్రమాలపై కలెక్టర్‌కు మెమోరాండం ఇద్దామని తెలిపారు. పాదయాత్ర చేసిన సమయంలో ప్రతి గడపకు వెళ్లి హోదా పేరుతో రాష్ట్రాన్ని టీడీపీ, బీజేపీలు ఎలా నయవంచన చేసింది, నాలుగున్నరేళ్లుగా ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఉద్యమాలు నిర్వహించిందనే అంశాలను వారికి అర్థమయ్యే రీతిలో వివరించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తే మంచిందని అభిప్రాయపడ్డారు.
బూత్ లెవల్‌లో బలోపేతం చేయాలి
బూత్ లెవల్‌లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలని నియోజక సమన్వయకర్తలకు విజయసాయిరెడ్డి సూచించారు. నగరాన్ని పట్టి పీడిస్తున్న 20 సమస్యలను గుర్తించి 72 వార్డుల పరిధిలో వాటిపై 15 రోజులకో కార్యక్రమం నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నామని పార్టీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్ విజయసాయిరెడ్డికి వివరించారు. బూత్ కమిటీల నేపథ్యంలో తన నియోజకవర్గంలోని డిఫెన్స్ ఉద్యోగులున్న ప్రాంతాల్లో తలెత్తుతున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషించి, ఆ ప్రాంతాల్లో పార్టీ మరింత బలోపేతం అయ్యేలా చూడాలని సూచించారు. అన్ని కమ్యూనిటీలను కలుపుకొని బూత్ కమిటీలు ఏర్పాటు చెయ్యాలని విజయసాయిరెడ్డి తెలిపారు. కమిటీలను ఎంపిక చేసి మే ఒకటో తేదీలోపు నివేదికను అందించాలని ఆదేశించారు.
అదే విధంగా నగరంలో అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ఎక్కడ ప్రారంభం కావాలి, ఎలా ముగియాలనే రూట్ మ్యాప్‌పైనా చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్‌రాజు, విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం సమన్వయకర్త వరుదు కల్యాణి, నియోజకవర్గాల సమన్వయకర్తలు తిప్పల నాగిరెడ్డి, వంశీకృష్ణ శ్రీనివాస్‌యాదవ్, కోలా గురువులు, సత్తిరామకృష్ణారెడ్డి, సనపల చంద్రమౌళి, పసుపులేటి ఉషాకిరణ్, అన్నంరెడ్డి అదీ‹ప్‌రాజుతో పాటు రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి, నగర మహిళా అధ్యక్షురాలు గరికిన గౌరి, మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎండీ ఫరూక్, సీఈసీ సభ్యుడు కంపాహనోక్, రాష్ట్ర అదనపు కార్యదర్శులు పక్కి దివాకర్, జి.రవిరెడ్డి, విద్యార్థి, యువజన విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment