సిబ్బంది అలక్ష్యాన్ని సహించను
ప్రజలతో మిత్రుల్లా వ్యవహరిస్తాం
బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ చిరువోలు శ్రీకాంత్
సాక్షి, ప్రతినిధి, ఒంగోలు: ‘ప్రజలకు అందుబాటులో ఉంటాను. ఆఫీసు వేళల్లో ఎవరు వచ్చినా కలుస్తాను. అయితే పిటీషన్‌దారులు నా వరకూ వచ్చారంటే కింది స్థాయి సిబ్బంది పనిచేయడం లేదని అర్థం. కింది స్థాయిలో ఎస్‌ఐ, సీఐ, డీఎస్‌పీ వరకూ ఉన్నారు. వారిని కలిసి సమస్య పరిష్కారం కాకపోతే నా దగ్గరకు రావచ్చు. కింది స్థాయి సిబ్బంది అలక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు.’ అని కొత్త ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన చిరువోలు శ్రీకాంత్ తెలిపారు. బుధవారం ఆయన ప్రమోద్‌కుమార్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే జిల్లా పరిస్థితులపై బదిలీ అయిన ఎస్పీ ప్రమోద్‌కుమార్‌ను అడిగి తెలసుకున్నానని చెప్పారు.
సమస్యలపై సిబ్బందితో చర్చించి అవి పరిష్కారం అయ్యేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. జిల్లాపై అవగాహన వచ్చిన తర్వాత ఒక ప్రణాళికతో శాంతిభద్రతలను కాపాడేందుకు చర్యలు చేపడతానని ఎస్పీ తెలిపారు. ప్రజలకు పోలీసులు అండగా నిలబడాలని, సమస్యతో వచ్చిన వారికి మిత్రుల్లా వ్యవహరించేలా చూస్తానని చెప్పారు. జిల్లా పోలీసు అంటే మిత్రులనే అభిప్రాయం ప్రజల్లో కలిగేలా చేస్తానని హామీ ఇచ్చారు. శాంతిభద్రతల పరిరక్షణకు అందరి సహాయం అవసరమని, అన్ని వర్గాలు దీనికి సహకరించాలని కోరారు. పెరుగుతున్న గొలుసుకట్టు నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా గ్రామాల్లో ఒక పార్టీ వారిపై మరోపార్టీవారు దాడులు చేసుకోవడంపై ఆయన స్పందించారు. ప్రశాంతతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, చట్టం దృష్టిలో అందరూ ఒక్కటేనని, ఏ పార్టీ వారైనా దాడులకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఒంగోలులో జరిగిన రియల్టర్ హత్య వ్యవహారం తన దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై పత్రికల్లో భిన్న కథనాలు వచ్చాయని, వాటన్నింటినీ పరిశీలించి ఈ కేసును త్వరగా కొలిక్కి వచ్చేలా చేస్తానన్నారు.
ఒంగోలు నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారంపై దృష్టి పెడతానని చెప్పారు. సిబ్బంది ఎంతమంది ఉన్నారు. ట్రాఫిక్ మెరుగుకు చర్యలు ఏం తీసుకోవాలనే అంశాన్ని పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ శ్రీకాంత్‌ను కింది స్థాయి సిబ్బంది కలిసి బొకేలతో స్వాగతం పలికారు. అనంతరం సిబ్బందితో జిల్లా పరిస్థితిపై ఎస్పీ చర్చించారు. ఎస్పీ కార్యాలయంలో ఉన్న విభాగాలను పరిశీలించారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ఎస్పీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఎస్పీకి పోలీసు ఆఫీసర్స్ అసోసియేషన్ అభినందనలు
ఒంగోలు: ప్రకాశం జిల్లా పోలీసు శాఖ నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సీహెచ్ శ్రీకాంత్‌ను ఏపీ పోలీసు అధికారుల సంఘం ప్రకాశం జిల్లా శాఖ బుధవారం కలిసి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపింది. ఈ సందర్భంగా జిల్లాలోని 3259 మంది పోలీసు సిబ్బంది సంక్షేమాన్ని కాంక్షించాలని అసోసియేషన్ నాయకులు అభ్యర్థించారు. జిల్లా ఎస్పీని కలిసిన వారిలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నర్రా వెంకటరెడ్డి, జిల్లా ఎగ్జిక్యూటివ్ బాడీ సభ్యులు పీ.వీ.హనుమంతరావు, జాయింట్ సెక్రటరీ వీఎస్‌ఆర్ నాయుడు, రాష్ర్ట ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎల్.రామనాథం, సభ్యులు ఎస్.దయానందరావు, కోశాధికారి కోటేశ్వరరావు, సంపూర్ణరావు, సభ్యులు టీ.మాధవి తదితరులున్నారు.