చిల్లకూరు, న్యూస్‌లైన్: డెంగీతో ఓ యువతి మృతి చెందిన సంఘటన చిల్లకూరు పాలబూత్ సెంటర్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు గ్రామానికి చెందిన అలిమిలి మల్లికార్జున్, వరమ్మ దంపతుల పెద్ద కుమార్తె కీర్తి (18) గతేడాది ఇంటర్ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటుంది. వారం రోజుల క్రితం ఆమెకు జ్వరం రావడంతో గూడూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. డెంగీ లక్షణాలు ఉన్నాయని, వెంటనే నెల్లూరుకు తీసుకెళ్లాలని వైద్యులు కుటుంబ సభ్యులకు సూచించారు. దీంతో నెల్లూరులోని రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాలలో చేర్పించారు. వ్యాధి తీవ్రంగా ఉందని మరో ఆసుపత్రికి తరలించాలని సూచించారు. దీంతో మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా ప్లేట్‌లేట్స్ పూర్తిగా తగ్గిపోయి శుక్రవారం తెల్లవారుజామున ఆమె మృతి చెందింది.
దీంతో ఆమె మృతదేహాన్ని చిల్లకూరుకు తీసుకువచ్చారు. ఇటీవల మండలంలో పలు గ్రామాల్లో విషజ్వరాలతో పాటు డెంగీ వ్యాధి సోకి పలువురు చెన్నై, నెల్లూరు ప్రాంతాల్లో చికిత్స పొందుతున్నప్పటికీ స్థానికంగా ఉన్న వైద్యులు సేవలు అందించడంలో నిర్లక్ష్యం చూపుతుండటంతోనే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని మండల ప్రజలు వాపోతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సేవలు అందించాలని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు.
డెంగీతో యువతి మృతి
Published Sat, Oct 12 2013 3:58 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement