నల్లగొండ కల్చరల్, న్యూస్‌లైన్: తెలంగాణ ప్రజలకే ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ అని, ఇది మహిళా సాంస్కృతిక సమ్మేళనమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బంగారు బతుకమ్మ కార్యక్రమంలో భాగంగా శనివారం నల్లగొండ ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో ఆమె మాట్లాడారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతగొప్పవో బతుకమ్మ పండగను చూస్తే తెలుస్తుందన్నారు. ముఖ్యంగా తెలంగాణ మహిళలు 9 రోజులపాటు నిర్వహించుకునే అతి పెద్ద పూల పండగన్నారు. ఇంతటి గొప్ప పండగను సీమాంధ్రుల పరిపాలనలో అణగదొక్కాలని చూశారన్నారు. విదేశీయులెందరో ఉత్సాహంగా, ఆసక్తిగా బతుకమ్మ పండగలో పాల్గొంటున్నారన్నారు. కేంద్రం ప్రకటించిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇక ఆపడం ఎవరి తరమూ కాదన్నారు. ఆర్‌టీసీ కాలనీకి చెందిన కుంభం మల్లారెడ్డి తయారుచేసిన 7అడుగుల బతుకమ్మ ఆకర్షణగా నిలిచింది.
అంతకుముందు రామగిరిలోని రామాలయంలో మహిళలు పెద్దఎత్తున బతుకమ్మలను తీసుకుని కవిత ఆధ్వర్యంలో గడియారం సెంటర్ మీదుగా సభావేదిక ఎన్జీ కళాశాలకు చేరుకున్నారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శులు వేణుసంకోజు, జవహర్‌లాల్, జిల్లా కన్వీనర్ బోనగిరి దేవేందర్, కంచనపల్లి రమేష్‌బాబు, దుబ్బాక నర్పింహారెడ్డి, మాలె శరణ్యారెడ్డి, పున్న కైలాస్ నేత, జిల్లా జేఏసీ చైర్మన్ జి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. జగిని టెక్స్‌టైల్స్ అధినేత వెంకటేశ్వర్లు పలువురు మహిళలకు బహుమతులు అందజేశారు.
మహిళా సాంస్కృతిక సమ్మేళనం.. బతుకమ్మ
Published Sun, Oct 6 2013 4:45 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement