- రెండోరోజు రైతు భరోసా యాత్రలో వైఎస్ జగన్
- రైతులకు న్యాయం కోసం ప్రభుత్వాన్ని నిలదీద్దాం
- 79 కిలోమీటర్లు... 3 కుటుంబాలకు భరోసా
అనంతపురం:
ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా, రైతు వ్యతిరేక విధానాల వల్ల అనేక మంది అన్నదాతలు అర్ధాంతరంగా తమ జీవితాలను ముగిస్తున్నారు. రోడ్డున పడిన ఆ కుటుం బాలను ఆదుకోవాల్సిన అధికారులు, పాల కులు చనిపోయింది రైతులు కాదని, అప్పుల వల్ల అసలే కాదని తప్పుడు పద్ధతిలో ప్రజలను మోసగిస్తున్నారు. అటువంటి ఈ ప్రభుత్వం మెడలు వంచేందుకు కలిసి కట్టుగా పోరాడు దామని వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.
రైతు భరోసాయాత్రలో రెండోరోజు బుధవారం జగన్ మూడు రైతు కుటుంబాలను పరామర్శించారు. కళ్యాణదుర్గం నుంచి జగన్ రెండోరోజు యాత్రను ప్రారంభించారు. ముందుగా పట్టణంలో పార్టీ కార్యాలయానికి భూమిపూజ చేశారు. ఆపై వాల్మీకి విగ్రహానికి పూలమాల వేశారు. ఈసందర్భంగా వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు జగన్‌ను కలిశారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని వినతిపత్రం అందజేశారు. దీనిపై చంద్రబాబు మాట తప్పారని, వాల్మీకులకు న్యాయం జరిగేలా చూస్తానని వారికి హామీ ఇచ్చారు. అనంతరం ఉప్పవంక మీదుగా యాటకల్లు చేరుకున్నారు. అక్కడ గ్రామస్తులు దారిపొడవునా బంతిపూలు చల్లి స్వాగతం పలికారు. మహిళలు రోడ్డుపైకి వచ్చి జగన్‌కు హారతి ఇచ్చి, దిష్టితీశారు. వృద్ధులు, పిల్లలకు ఆప్యాయంగా ముద్దులు పెట్టారు. తర్వాత కోనాపురం, మామిడూరు, ఎర్రడికెర, పడమటికోడిపల్లి మీదుగా పొబ్బర్లపల్లి చేరుకున్నారు. ఈ నెల 20న ఆత్మహత్య చేసుకున్న రైతు ఈరన్న కుటుంబాన్ని పరామర్శించారు. ఈరన్న చనిపోయారని తెలిసి వెంటనే షెడ్యూలు మార్చుకుని పొబ్బరపల్లి వచ్చినందుకు గ్రామంలోని రైతులంతా ఆనందపడ్డారు. రైతులకు అండగా తాను ఉన్నానని జగన్ భరోసా ఇచ్చారని ధీమా వ్యక్తం చేశారు. తర్వాత ముదిగల్లుకు చేరుకున్నారు. దారిలో న్యాయవాదుల సంఘం ప్రతినిధులు జగన్ కలిశారు. కళ్యాణదుర్గంలో సబ్‌కోర్టు ఏర్పాటు చేయాలని విన్నవించారు. తర్వాత గిరిజన సంక్షేమ సంఘం విద్యార్థులు కలిసి విద్యార్థి సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ముదిగల్లు గ్రామస్తులు జగన్‌కు అఖండ స్వాగతం పలికారు. ఓవైపు వర్షం పడుతుంటే... వర్షంతో పోటీగా జగన్‌పై పూలవర్షం కురిపించారు. డప్పులమోతతో జగన్‌కు స్వాగతం పలికారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న నారాయణప్ప కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత మల్లిపల్లికి చేరుకున్నారు. అక్కడ తనను చూసేందకు వచ్చిన కుష్టురోగులను జగన్ ఆప్యాయంగా పలకరించారు. తర్వాత తూర్పుకోడిపల్లి మీదుగా వర్లి చేరుకున్నారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న గంగన్న అనే రైతు కుటుంబాన్ని పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తర్వాత నేరుగా కళ్యాణదుర్గం చేరుకున్నారు. రాత్రికి ఇక్కడే బస చేశారు. రెండోరోజు యాత్రలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, పార్టీ ప్రోగ్రాం కన్వీనర్ తలశిల రఘురాం, ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా, మాజీ ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్తలు ఉషాశ్రీచరణ్, వెంకట్రామిరెడ్డి, తిప్పేస్వామి, రాష్ట్ర కార్యదర్శులు తిప్పేస్వామి, ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, మీసాల రంగన్న, జిల్లా నేత చవ్వారాజశేఖరరెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ధనుంజయయాదవ్, మహిళా నేత శ్రీదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, పామిడి వీరాంజనేయులు, పసుపుల బాలకృష్ణారెడ్డి, రఘునాథరెడ్డి పాల్గొన్నారు.
మూడోరోజు పర్యటన ఇలా
రైతు భరోసాయాత్రలో భాగంగా మూడోరోజు గురువారం జగన్ నాలుగు కుటుంబాలను పరామర్శించనున్నారు. కళ్యాణదుర్గం నుంచి కంబదూరు మండలం తిమ్మాపురం చేరుకుంటారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న నారాయణప్ప కుటుంబాన్ని పరామర్శిస్తారు. తర్వాత ఒంటారెడ్డిపల్లి చేరుకుంటారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న రామాంజనేయులు కుటుంబాన్ని పరామర్శిస్తారు. తర్వాత పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం వైటీ రెడ్డిపల్లికి చేరుకుంటారు. ఇక్కడ ఆత్మహత్య చేసుకున్న లక్ష్మిదేవి, పెద్దపాతన్న కుటుంబాలను పరామర్శిస్తారు.