బలపరుస్తూ మొత్తం 16 సెట్ల నామినేషన్లు
ఇడుపులపాయ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం ఇడుపులపాయలో జరిగిన పార్టీ ప్లీనరీ (రెండో ప్రజా ప్రస్థానం)లో పార్టీ నేతల హర్షధ్వానాల మధ్య జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికైనట్లుగా సంస్థాగత ఎన్నికల కన్వీనర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రకటించారు. ఆయన పేరు ప్రకటించగానే జై జగన్ నినాదాలు మార్మోగాయి. పార్టీ నియమావళి, ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ప్రతి మూడేళ్లకు ఒకసారి జరగాల్సిన సంస్థాగత ఎన్నికలను పురస్కరించుకుని ఈ ఎన్నికను నిర్వహించినట్లు ఉమ్మారెడ్డి వెల్లడించారు. జగన్‌ను అధ్యక్ష పదవికి ఎన్నుకోవాలని మొత్తం 16 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. జగన్ సోదరి షర్మిల తొలిసెట్ నామినేషన్‌ను ప్రతిపాదించగా వైవీ సుబ్బారెడ్డి బలపరిచారు.
మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు ఎడ్మ కృష్ణారెడ్డి రెండో సెట్‌ను ప్రతిపాదించగా కొలిశెట్టి శివకుమార్ బలపర్చారు. టీఎస్ విజయచందర్ మూడో సెట్ నామినేషన్‌ను ప్రతిపాదించగా పీఎన్వీ ప్రసాద్ బలపర్చారు. వీరు కాక తెలంగాణ నుంచి బాల మణెమ్మ మరో సెట్ నామినేషన్‌ను ప్రతిపాదించగా ఎస్.రఘురామిరెడ్డి బలపర్చారు. పార్టీ సీనియర్ నేతలు కొణతాల రామకృష్ణ, జూపూడి ప్రభాకర్‌రావు, తెల్లం బాలరాజు, కాపు రామచంద్రారెడ్డి, ఎంవీ మైసూరారెడ్డితో సహా పలువురు నేతలు జగన్‌ను బలపరుస్తూ నామినేషన్లు వేసిన వారిలో ఉన్నారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువరించిన ఉమ్మారెడ్డి... సాయంత్రం 5 వరకూ నామినేషన్లను స్వీకరించారు. పోటీలో మరెవరూ లేక పోవడంతో ప్లీనరీ సమావేశాలు ప్రారంభం అయ్యాక మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో జగ న్ ఎన్నికను ప్రకటించారు. 2013 సెప్టెంబర్, అక్టోబర్‌లో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశాల్లో 23 జిల్లాలకు, 12 మున్సిపల్ కార్పొరే షన్ నగరాలకు పార్టీ అధ్యక్షులు ఎన్నికైనట్లు పార్టీ సంస్థాగత కార్యక్రమాల రాష్ట్ర కో-ఆర్డినేటర్ పీఎన్వీ ప్రసాద్ వెల్లడించారు.
జిల్లాల కొత్త అధ్యక్షులు వీరే..
ధర్మాన కృష్ణదాస్(శ్రీకాకుళం), పెన్మత్స సాంబశివరాజు (విజయనగరం), చెక్కాకుల వెంకట్రావు (విశాఖపట్నం), కుడుపూడి చిట్టబ్బాయ్ (తూర్పు గోదావరి), తెల్లం బాలరాజు (పశ్చిమ గోదావరి), ఎస్.ఉదయభాను(కృష్ణా), మర్రి రాజశేఖర్(గుంటూరు), ఎన్.బాలాజీ(ప్రకాశం), ఎం.మురళీధర్(నెల్లూరు), కె.నారాయణస్వామి (చిత్తూరు), కె.సురేష్‌బాబు(వైఎస్సార్), ఎం.శంకరనారాయణ (అనంతపురం), గౌరు వెంకటరెడ్డి(కర్నూలు), కె.వినాయకరెడ్డి (ఆదిలాబాద్), మధురెడ్డి (నిజామాబాద్), సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి (కరీంనగర్), బి.జగపతి(మెదక్), ఎం.సోమేశ్వరరావు (వరంగల్), పాయం వెంకటేశ్వర్లు(ఖమ్మం), ఇ.సి.శేఖర్ గౌడ్(రంగారెడ్డి), ఆదం విజయ్‌కుమార్ (హైదరాబాద్), గట్టు శ్రీకాంత్‌రెడ్డి (నల్లగొండ), ఎడ్మ క్రిష్ణారెడ్డి (మహబూబ్‌నగర్).
ఏకగ్రీవంగా ఎన్నికైన జగన్
Published Mon, Feb 3 2014 1:40 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM
Advertisement
Advertisement