సాక్షి, అద్దంకి (ప్రకాశం):రాజ్యాంగ రచనతో అంబేడ్కర్ దళితులు, గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపారు. కానీ తెలుగు దేశం ప్రభుత్వం మాత్రం బడుగుల బతుకులు బాగుపడకూడదని కంకణం కట్టుకుంది. గత ఎన్నికల సమయంలో 100 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించుకునే ఎస్సీ, ఎస్టీలకు కరెంట్ బిల్లు పూర్తిగా మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. మోసపు మాటలు నమ్మిన ప్రజలు చంద్రబాబును గెలిపించారు. గెలిచిన తరువాత పేద ప్రజలను మోసం చేశాడు. చంద్రబాబు తమ బతుకుల్లో అంధకారం నింపాడని బడుగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రం రాష్ట్రానికి విద్యుత్ పుష్కలంగా సరఫరా చేస్తుంటే, అదంతా తన క్రెడిట్ అని చెప్పుకు తిరుగుతున్నాడు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద నెలకు 100 యునిట్ల లోపు వినియోగం ఉంటే బిల్లు లేకుండా చేస్తానని బాబు చెప్పినా ఆచరణలో అమలు కాలేదు. కుల ధ్రువీకరణ పత్రాలు అందజేసినా, తమకు బిల్లులు చెల్లించక తప్పడం లేదని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా, పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడు. ఈ క్రమంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ కాలనీలు, గిరిజన తండాల్లో ఏడాదికి 2 వేల యూనిట్లు ఉచిత కరెంటు లేదా రూ.6 వేలు ఇస్తానని చేసిన ప్రకటనపై ఆయా వర్గాల్లో ఆనందం కలిగిస్తోంది. వారంతా వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. తమను బాబు మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దొంగ మాటలు ఇవ్వడంలో చంద్రబాబుకు సాటిలేరు
దొంగ హామీలు ఇవ్వడం మాయ మాటలు చెప్పడం చంద్రబాబుకే చెల్లింది. ఉచిత విద్యుత్ పథకం కేవలం ప్రకటనకే పరిమితం అయింది. దీంతో ఎంతోమంది ఆవేదనకు గరవుతున్నారు. జగన్ ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీపై మాకు నమ్మకం ఉంది. ఆయన చెప్పింది చేస్తాడనే విశ్వాసం ఉంది. ఆయన అధికారంలోకి రావాలని మాలాంటి పేదలంతా కోరుకుంటున్నాం.
- గంగా ప్రతాప్, మల్లాయపాలెం
చంద్రబాబు హామీ నమ్మి మోసపోయాం
నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాడిని, గత ప్రభుత్వం నెలకు 100 యూనిట్లలోపు వినియోగం ఉన్న వారికి బిల్లు లేకుండా చేస్తామని హామీ ఇస్తే నమ్మి మోసపోయాం. కుల ధ్రువీకరణ పత్రాలు కార్యాలయంలో అందజేశాను. అయినా నా దగ్గర బిల్లు వసూలు చేస్తున్నారు. టీడీపీది అంతా నాటకం. జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటనను నమ్ముతున్నాం. ఆయనొస్తే మాకు మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం.
- అంగలకూర్తి సుబ్బరాయుడు తిమ్మాయపాలెం
జగన్ పథకాలన్నీ ప్రజల కోసమే
మాది కోటపాడు గ్రామం మా ఇంటికి నెలకు సరాసరిన 70 యూనిట్లు వరకు విద్యుత్ వాడుకుంటాం. కరెంట్ బిల్లు రూ. 100 లోపే వస్తుంది. చాలా తక్కువ కరెంట్ బిల్లు వస్తున్పటికీ తెలుగు దేశం ప్రభుత్వం మాకు రావాల్సిన డబ్బును ఇవ్వటంలేదు. జగన్ అధికారంలోకి వస్తే 2 వేల యూనిట్లు ఉచిత విద్యుత్ వాడకం లేదా రూ. 6 వేలు ఇవ్వటం మంచి పరిణామం. జగన్ ప్రవేశపెట్టిన పథకాలన్ని ప్రజలకోసమే. జగన్ చెప్పింది చేస్తాడు.
- గందం రవీంద్ర, కోటపాడు
Comments
Please login to add a commentAdd a comment