రాజన్నరాజ్యం జగన్‌తోనే సాధ్యం | YSRCP Leader Rajanna Dora Meeting in Vizianagaram | Sakshi
Sakshi News home page

రాజన్నరాజ్యం జగన్‌తోనే సాధ్యం

Published Fri, Dec 28 2018 6:31 AM | Last Updated on Fri, Dec 28 2018 6:31 AM

YSRCP Leader Rajanna Dora Meeting in Vizianagaram - Sakshi

మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాజన్నదొర

విజయనగరం, సాలూరురూరల్‌: మాట తప్పని, మడమ తిప్పని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి సువర్ణయుగం మళ్లీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర అన్నారు. పాచిపెంట మండలంలోని గిరిశిఖర కేరంగి పంచాయతీలో ఆయన గురువారం పర్యటించారు. కేరంగి పాస్టర్‌ డోనేరు లచ్చయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు తమ సమస్యలను వినిపించారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధిం చాలంటూ  పలువురు పాస్టర్లు, క్రైస్తవ సోదరీ సోదరిమణులు ప్రార్థనలు చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరూ సన్మార్గంలో నడుస్తూ మంచి వైపు ఉంటూ మాట తప్పని, మడమ తిప్పని నాయకులకు అండగా నిలబడాలని కోరారు.

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆర్‌పీ భంజ్‌దేవ్‌ మూడుసార్లు ఎమ్మెల్యేగా వ్యవహరించినా నాడు ఈ గిరిశిఖర గ్రామాల అభివృద్ధికి  చేసిందేమిటో తెలపాలని ప్రశ్నించారు. తను నిజమైన గిరిజనుడునని, కొండల్లో పుట్టి పెరిగానని, అందుకే ప్రజలు బాధలు, ఇబ్బందులు తనకు తెలుసన్నారు. పల్లెలకు తాగునీరు, రోడ్లు మంజూరుతో పాటు పింఛన్లు, రేషన్‌ కార్డుల మంజూరుకు కృషిచేశానని తెలిపారు. ఈ  ప్రాంతానికి బీటీ రోడ్డు మంజూరైందని, ఎన్నికలు తర్వాత పనులు ప్రారంభమవుతాయన్నారు. రానున్న ఎన్నికల్లో  వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రానుందని, ప్రజానాయకుడైన వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్రం లో ప్రజాపాలన ప్రారంభంకాబోతుందని తెలిపారు. ప్రజలందరూ జగన్‌మోహన్‌రెడ్డికి ముఖ్యమంత్రిగా ఒక్క అవకాశం ఇచ్చి  ఆశీర్వదించాలని కోరారు.

ఈ సందర్భంగా వృద్ధులకు దుప్పట్లు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షుడు గొట్టాపు ముత్యాలునాయుడు, పార్టీ రాష్ట్ర బీసీసెల్‌ నాయకుడు సలాది అప్పలనాయుడు, వైస్‌ ఎంపీపీ తట్టికాయల గౌరీశ్వరరావు, తాజా మాజీ సర్పంచ్‌లు చింతా సీతయ్య, నారాయణరావు, నాయకులు పెద్దిబాబు, కొండలరావు, భాస్కరరావు, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement