మోడీ సర్కారుతో వృద్ధి పరుగులు!
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ నేతృత్వంలోని సుస్థిర ఎన్‌డీఏ సర్కారు కొలువుదీరనున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు మంచిరోజులు రానున్నాయని కార్పొరేట్లు ఆశిస్తున్నారు. పారిశ్రామిక మండలి ఫిక్కీ నిర్వహించిన సర్వేలో మెజారిటీ కంపెనీల సీఈఓలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సమీప కాలంలో దేశ ఆర్థిక పరిస్థితులు భారీగా మెరుగుపడనున్నాయని 93 శాతం మంది సీఈఓలు(మొత్తం సర్వేలు పాల్గోన్నవారి సంఖ్య 76) పేర్కొన్నారు. 7 శాతం మంది మాత్రమే ఓమోస్తరు మెరుగుదల ఉంటుందని అంచనా వేశారు.
గడిచిన కొద్దికాలంగా ప్రభుత్వంలో విధానపరమైన నిర్ణయాల విషయంలో జడత్వం నెలకొందని, వృద్ధికి ఇది ఆటంకంగా మారినట్లు అత్యధిక శాతం సీఈఓలు భావిస్తున్నారని ఫిక్కీ పేర్కొంది. ఇప్పుడు కేంద్రంలో సుస్థిరమైన మోడీ సర్కారు రానుండటంతో ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని తిరిగి పెంపొందించే చర్యలు ఉంటాయని.. అదేవిధంగా ఉపాధి కల్పనే లక్ష్యంగా ముఖ్యంగా తయారీ రంగంలో పెట్టుబడుల పెంపునకు కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చన్న విశ్వాసం వ్యక్తమవుతున్నట్లు సర్వే నివేదిక వెల్లడించింది.
వస్తు-సేవల పన్ను(జీఎస్‌టీ)ను పటిష్టంగా అమలు చేయడం, కొత్త ఉద్యోగాల కల్పన వంటి అంశాలను మోడీ సర్కారు నుంచి కార్పొరేట్లు ప్రధానంగా ఆశిస్తున్నారని తెలిపింది. వచ్చే 12 నెలల్లో తమ వ్యాపారాలు, పెట్టుబడి అవకాశాల్లో గణనీయమైన పురోగతి ఉండొచ్చని సర్వేలో పాల్గొన్న 82 శాతం మంది సీఈఓలు చెప్పడం గమనార్హం.