స్పెక్ట్రం వేలానికి లైన్ క్లియర్
రిజర్వ్ ధరకు కేబినెట్ ఆమోదముద్ర
⇒ వేలం ద్వారా రూ. 64,840 కోట్ల
⇒ఆదాయం రావచ్చని కేంద్రం అంచనా
న్యూఢిల్లీ: అత్యంత భారీ స్థాయిలో టెలికం స్పెక్ట్రం వేలానికి తెరతీస్తూ.. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ సోమవారం రిజర్వ్ ధరలకు ఆమోదముద్ర వేసింది. దీంతో ఏకంగా రూ. 64,840 కోట్లు రాగలవని అంచనా. ఇందుకు సంబంధించి 2జీ సేవలకు ఉపయోగపడే మూడు బ్యాండ్లలో 380.75 మెగాహెర్ట్జ్ మేర స్పెక్ట్రమ్‌ను వేలం వేయనుంది.
దేశవ్యాప్తంగా ప్రతి మెగాహెర్ట్జ్‌కి 800 మెగాహెట్జ్ బ్యాండ్‌విడ్త్‌లో రూ. 3,646 కోట్లు, 900 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌లో (ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, జమ్మూ కశ్మీర్ మినహా) రూ. 3,980 కోట్లు, 1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌లో (మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ మినహా) రూ. 2,191 కోట్లుగాను రిజర్వ్ ధర ఉంటుందని కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. 2,100 మెగాహెర్ట్జ్ ధరను గురించి మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం 900 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌కి నిర్ణయించిన ధర క్రితం వేలంలో ఆపరేటర్లు చెల్లించిన దానికన్నా 10 రెట్లు అధికం. ఇక, 800 మెగాహెర్ట్జ్ బ్యాండ్ రేటు.. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ నిర్ణయించిన దానికన్నా 17% అధికం.
దరఖాస్తులకు ఫిబ్రవరి 2 ఆఖరు తేది..
టెలికం విభాగం సూచనప్రాయంగా నిర్ణయించిన దాని ప్రకారం దరఖాస్తులు దాఖలు చేసేందుకు ఆఖరు తేది ఫిబ్రవరి 2గా ఉంటుంది. ఫిబ్రవరి 13 బిడ్డర్ల ప్రీ-క్వాలిఫికేషన్ జరుగుతుంది. 23న వేలం ప్రారంభమవుతుంది. ఈ వేలం ద్వారా కనీసం రూ. 64,840 కోట్లు (2,100 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రం) రాగలవని అంచనా వేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది.
ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఇందులో రూ. 16,000 కోట్లు ఖజానాకు జమ కాగలవని పేర్కొంది. 1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌విడ్త్ బిడ్డింగ్‌లో గెలుపొందితే తుది ధరలో 33 శాతాన్ని 10 రోజుల్లోగా జమ చేయాల్సి ఉంటుంది. అదే 900, 800 మెగాహెట్జ్ బ్యాండ్‌విడ్త్ విషయంలో 25 శాతం చెల్లించాల్సి ఉంటుంది. మిగతా మొత్తాన్ని చెల్లించేందుకు రెండేళ్ల మారటోరియం ఉంటుంది. వన్ టైమ్ చార్జీలను 10 సమాన వాయిదాల్లో చెల్లించవచ్చని కేంద్రం తెలిపింది.
3జీ వేలం కూడా అప్పుడే..: అటు 3జీ స్పెక్ట్రం (2,100 మెగాహెర్ట్జ్) వేలాన్ని కూడా అదే సమయంలో నిర్వహించాలని కేంద్రం భావిస్తోందని టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ చెప్పారు. తగినంత స్థాయిలో స్పెక్ట్రంను అందుబాటులో ఉంచడం, సముచిత విధంగా పోటీతత్వాన్ని ప్రోత్సహించడం, వినియోగదారులకు టెలికం సర్వీసులను మెరుగుపర్చడంతో పాటు ప్రభుత్వానికి మరింత ఆదాయాన్ని సమకూర్చుకోవడం ఈ వేలం నిర్వహణలో ప్రధాన లక్ష్యాలని ఆయన వివరించారు.
కేంద్రం ఆమోదం తెలిపిన వాటిలో 900 మెగాహెట్జ్ బ్యాండ్‌విడ్త్ మినహా మిగతావన్నీ టెలికం కమిషన్ సిఫార్సు చేసిన రిజర్వ్ ధరలే. టెలికం కమిషన్ 900 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌విడ్త్‌కి రూ. 3,695 కోట్లు సిఫార్సు చేయగా కేబినెట్ రూ. 3,980 కోట్లు ఖరారు చేసింది.
దేశవ్యాప్తంగా మొత్తం 22 టెలికం సర్వీస్ ఏరియాలు ఉన్నాయి. 800 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌కి సంబంధించి అన్ని సర్వీస్ ఏరియాల్లోనూ 103.75 మెగాహెర్ట్జ్‌ని ప్రభుత్వం వేలానికి ఉంచింది.
17 టెలికం సర్కిల్స్‌లో 900 మెగాహెట్జ్ బ్యాండ్‌విడ్త్‌లో 103.75 మెగాహెర్ట్జ్‌ను, 1800 మెగాహెర్ట్జ్‌కి బ్యాండ్‌విడ్త్‌కి సంబంధించి 15 సర్కిళ్లలో 99.2 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రంను వేలం వేయనుంది. ప్రస్తుతం 900, 1800 మెగాహెట్జ్ బ్యాండ్‌ను జీఎస్‌ఎం ఆధారిత సర్వీసులు అందించే ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా, యూనినార్ వంటిసంస్థలు ఉపయోగిస్తున్నాయి. 800 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌విడ్త్‌ను సీడీఎంఏ టెక్నాలజీ ఆధారిత సేవలు అందించే ఎంటీ ఎస్, టాటా టెలీసర్వీసెస్, ఆర్‌కామ్ ఉపయోగిస్తున్నాయి.
గనుల వేలం ఆర్డినెన్స్‌కు ఆమోదముద్ర
బొగ్గు బ్లాకుల వేలం, బీమా సంస్కరణలు మొదలైన వాటి తరహాలోనే ప్రభుత్వం తాజాగా ముడి ఇనుము, ఇతర ఖనిజాల గనుల వేలానికీ ఆర్డినెన్స్ బాట పట్టింది. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను సోమవారం ఆమోదించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ముడి ఇనుము, బొగ్గు యేతర ఖనిజాలకు సంబంధించిన గనుల వేలానికి ఇది ఉపయోగపడగలదని వివరించాయి.
అలాగే, ఆయా ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులయ్యే వారి సంక్షేమానికి తోడ్పడేలా జిల్లా ఖనిజ నిధి(డీఎంఎఫ్) ఏర్పాటుకూ ఈ ఆర్డినెన్స్ ఉపయోగపడనుంది. కీలకమైన బిల్లులు పార్లమెంటు సమావేశాల్లో ఆమోదం పొందకపోవడం వల్ల.. కేంద్రం ఆర్డినెన్స్ బాట పట్టింది. అయితే, వేలం విధానం వల్ల గుత్తాధిపత్య ధోరణులు పెరగ వచ్చంటూ ఖనిజ సంస్థల సమాఖ్య వ్యతిరేకిస్తోంది.