ఆర్థిక బలిమి.. అట్నుంచి ఇటు
- పశ్చిమం నుంచి తూర్పునకు ఆర్థిక శక్తి
- టాప్-100 ఆర్థిక నగరాల్లో 49 చైనాలోనే
- అమెరికాలో మాత్రం కేవలం 12
- బ్రూకింగ్స్ మెట్రో మానిటర్ సూచీ వెల్లడి
న్యూయార్క్: ‘‘అంతర్జాతీయ ఆర్థిక శక్తిగా ఇన్నాళ్ళూ నిలిచిన పశ్చిమదేశాలిపుడు వెనకబడుతున్నాయి. ఆర్థిక బలిమి పశ్చి మం నుంచి తూర్పు, దక్షిణానికి తరలుతోంది’’ ఇదీ... ప్రసిద్ధ బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్ చెబుతున్న మాట. ఈ సంస్థ వెలువరించిన ఆసియా-పసిఫిక్ మెట్రో మానిటర్ సూచీ ప్రకారం... అమెరికా పశ్చిమతీరంలోని వాంకూవర్, శాన్‌ఫ్రాన్సిస్కోతో పాటు ఆక్‌లాండ్‌లోని లిమా, ఇండోనేషియా రాజధాని జకార్తా, చైనా శక్తి కేంద్రాలు షాంగై, హాంకాంగ్, జపాన్ రాజధాని టోక్యో వంటి 100 నగరాల జీడీపీ... 22 ట్రిలియన్ డాలర్లు. మొత్తం ప్రపంచ జీడీపీలో ఇది ఏకంగా 20 శాతం!!.
ఇంకా ఆశ్చర్యపరిచే విషయమేంటంటే ఈ టాప్-100 శక్తిమంతమైన ఆర్థిక నగరాల్లో దాదాపు సగం... అంటే 49 వరకూ కేవలం చైనాలోనే ఉన్నాయి. వీటిలో 19 నగరాలు జపాన్, దక్షిణ కొరియా, తైవాన్‌లలో ఉండగా, అమెరికాలో 12 ఉన్నాయి. ఆగ్నేయాసియా, లాటిన్ అమెరికాల్లో తలా 7 నగరాలుండగా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో 6 నగరాలున్నాయి. ‘‘ఆసియా-పసిఫిక్ మెట్రో మానిటర్ చెబుతున్నదేమిటంటే ఆసియా దేశాలు పట్టణీకరణ, పారిశ్రామికీకరణ దిశగా కదులుతున్నాయి.
దీంతో ఆర్థిక శక్తి తూర్పు, దక్షిణ దేశాలకు తరలుతోంది. ఫలితంగా ఇక్కడి మెట్రో నగరాలు ఆసియా- పసిఫిక్ ఆర్థిక వృద్ధికి చోదక శక్తులుగా, వాణిజ్య, పెట్టుబడుల కేంద్రాలుగా మారుతున్నాయి’’ అని నివేదిక వెల్లడించింది. అంతేకాదు. ఈ 100 నగరాలకు సంబంధించి మరో విశేషం కూడా ఉంది. ప్రపంచ జీడీపీలో 20 శాతం వీటిదే కాగా... 2014లో ప్రపంచ జీడీపీ వృద్ధిలో 29 శాతం వీటిదే. ఇక ఈ 100 నగరాలూ గనక ఒకే దేశంలో ఉంటే అది 22 ట్రిలియన్ డాలర్లతో ఈ భూమ్మీద అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుంది. ఇక జీడీపీ తలసరి వృద్ధిలో మాత్రం చైనా నగరాలదే ముందంజ. అలాగని ఒక్క ఆసియా మాత్రమే కాదు. పోర్ట్‌లాండ్, శాన్‌జోస్, సీటెల్ వంటి నగరాలు సైతం 2014 జీడీపీ వృద్ధిలో వాటి జాతీయ సగటును దాటేశాయి.