ఈ ఏడాది విక్రయాలు బావుంటాయ్‌: గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌ | Godrej Properties sees strong sales this year | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది విక్రయాలు బావుంటాయ్‌: గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌

Published Mon, Jun 1 2020 3:39 PM | Last Updated on Mon, Jun 1 2020 3:40 PM

Godrej Properties sees strong sales this year - Sakshi

గతేడాది మాదిరి ఈ ఏడాది కూడా ప్రాపర్టీ విక్రయాలు బావుంటాయని గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌ ఎక్సిక్యూటివ్ చైర్మన్‌ పిరోజ్‌షా గోద్రేజ్‌ అన్నారు.కోవిడ్‌-19 కారణంగా నిర్మాణ రంగ కార్యక్రమాలు నెమ్మదించినప్పటికీ, ప్రాపర్టీ కంపెనీలు ప్రాజెక్టులను పూర్తిచేసే ఆర్థిక సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయన్నారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.గత ఆర్థిక సంవత్సరం గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌లో రూ.5,915 కోట్ల రికార్డు స్థాయి బుకింగ్స్‌ జరిగాయని ఈ ఆర్థిక సంవత్సరంలో అదే స్థాయి విక్రయాలు జరుగుతాయని పిరోజ్‌షా ధీమా వ్యక్తం చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మొదటి రెండు నెలల కాలంలో గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌ బుకింగ్స్‌ పెరిగాయని,మార్చి నెల చివరి 10-15 రోజుల్లో కూడా అమ్మకాలు జరిపామని తెలిపారు. లాక్‌డౌన్‌ కారణంగా మార్చి 25 నుంచి నిర్మాణ రంగ పనులతోపాటు, భౌతిక విక్రయాలు నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లోకూడా అమ్మకాలు మంచిగా జరిగి ఈ ఆర్థిక సంవత్సరం కూడా బావుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్‌ఆర్‌ఐ కొనుగోలు దారులపై సంస్థ ఆసక్తి కనబరుస్తుందన్నారు. డిజిటల్‌ ప్లాట్‌ఫాం ద్వారా 10-15 శాతం ఎన్‌ఆర్‌ఐలు విక్రయాల బుకింగ్స్‌ జరిగాయని,లాక్‌డౌన్‌ కాలంలో ఇది ఎంతో సాయపడిందని తెలిపారు. 
నగదు ప్రవాహ పరిస్థితి, నిర్మాణ రంగ పనుల వేగం ఈ ఏడాది పెను సవాళ్లను ఎదుర్కొంటుందని, నగదు ప్రవాహంపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. అయితే గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌కు ఎటువంటి నగదు ఇబ్బంది లేదని రూ.2000 కోట్ల బ్యాలెన్స్‌ షీట్‌, ఆరోగ్యకరమైన డెట్‌ ఈక్విటీ రేషియో ఉందని వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో హౌసింగ్‌ మార్కెట్‌ తీవ్ర సంక్షోభాన్నిఎదుర్కోవచ్చని అభిప్రాయపడ్డారు. ఉద్యోగాలు, వేతనాల్లో కోతలవల్ల కొనుగోలు శక్తి తీవ్రంగా దెబ్బతింటుదని చెప్పారు. కాగా ప్రస్తుతం బీఎస్‌ఈలో గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌ షేరు దాదాపు 4 శాతం లాభపడి రూ.715.55 వద్ద ముగిసింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement