హోమియోకేర్‌లో...కోటి మందికిపైగా వైద్యం.. | Homeopathic medical sector spread in north side | Sakshi
Sakshi News home page

హోమియోకేర్‌లో...కోటి మందికిపైగా వైద్యం..

Published Sat, Apr 26 2014 3:29 AM | Last Updated on Sat, Sep 2 2017 6:31 AM

హోమియోకేర్‌లో...కోటి మందికిపైగా వైద్యం..

హోమియోకేర్‌లో...కోటి మందికిపైగా వైద్యం..

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హోమియో వైద్యానికి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం అంతకంతకూ పెరుగుతోంది. భారత్‌లోనూ అనూహ్య ఫలితాలు నమోదవుతున్నాయి. అలోపతి (ఇంగ్లీషు) వైద్యులు సైతం హోమియోకు మళ్లుతున్నారని హోమియోకేర్ ఇంటర్నేషనల్ సీఎండీ డాక్టర్ శ్రీకాంత్ మోర్లవార్ అంటున్నారు. రోగుల కోసం వైద్యులు వేచి ఉండే రోజులు పోయాయి. ఇప్పుడు వైద్యుల కోసం రోగులు వేచి చూస్తున్నారని ఆయన తెలిపారు. హోమియో వైద్య రంగం తీరుతెన్నులు, హోమియోకేర్ విస్తరణ గురించి సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

 హోమియో వైద్య రంగం భారత్‌లో ఎలా ఉంది?
 ప్రపంచవ్యాప్తంగా చూస్తే అలోపతి తర్వాతి స్థానం హోమియో వైద్యానిదే. భారత్‌లో పదేళ్లలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పట్లో 30 వేల మంది వైద్యులుంటే నేడు వీరి సంఖ్య 3 లక్షలపైచిలుకే. పరిశ్రమ పరిమాణం రూ.4,000 కోట్లుంది. 2014 డిసెంబరునాటికి రూ.5,100 కోట్లకు చేరుకుంటుంది. ప్రభుత్వం మరింత ప్రోత్సాహం కల్పిస్తే ఈ రంగం కొత్త పుంతలు తొక్కుతుంది. హోమియోకు ప్రచారం కల్పించాలి. కళాశాలల ఏర్పాటుకు అనుమతులను విరివిగా ఇవ్వాలి.

 హోమియో వైద్యానికి ఎంత ఖర్చు అవుతుంది?
 శస్త్రచికిత్సలు మినహా అన్ని రకాల వ్యాధులను నయం చేసే ఔషధాలు హోమియోలో ఉన్నాయి. దీర్ఘకాలిక వ్యాధులకు కూడా చికిత్స ఉంది. ఫలితాలు ఆలస్యమవుతాయన్న ప్రచారంలో నిజం లేదు. చిన్న పిల్లలకు సైతం వైద్యం ఉంది. సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవడం ఈ వైద్యం ప్రత్యేకత. ఇంగ్లీషు వైద్యంతో పోలిస్తే 10 శాతంలోపే వ్యయం అవుతుంది.

 ఎంత మందికి చికిత్స అందించారు?
 ఎనిమిది సంవత్సరాల్లో కోటి మందికిపైగా చికిత్స అందించాం. చికిత్స పొందినవారిలో అలోపతి వైద్యులూ ఉన్నారు. సక్సెస్ రేటు 78 శాతముంది. మొండి వ్యాధులను నయం చేశాం. సంతానలేమి, థైరాయిడ్, కీళ్ల నొప్పులు, మానసిక రుగ్మతలు, మధుమేహం, స్పాండిలైటిస్ తదితర సమస్యలకు అంతర్జాతీయ స్థాయిలో వైద్యం అందిస్తున్నాం. 300 మందికిపైగా సుశిక్షితులైన వైద్య బృందం హోమియోకేర్ ప్రత్యేకత. మా వైద్యులకు ఎప్పటికప్పడు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. కార్పొరేట్ స్థాయికి హోమియోను తీసుకెళ్లిన ఘనత మాదే.

 సంస్థ విస్తరణ ప్రణాళిక ఏమిటి?
 ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడులో కలిపి 29 కేంద్రాలను నిర్వహిస్తున్నాం. ఏడాదిలో మరో 12 కేంద్రాలు రానున్నాయి. ఉత్తరాదికి కూడా విస్తరిస్తాం. దుబాయి, సింగపూర్, యూకేలో ఉన్న రోగులకు ఆన్‌లైన్  ద్వారా సేవలు అందిస్తున్నాం. ఈ దేశాల్లో హోమియోకేర్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. వైద్య కళాశాల ఏర్పాటు యోచన ఉంది. ఔషధ తయారీలోకి రావాలన్న ఆలోచన కూడా ఉంది. వీటన్నిటి కంటే ముందుగా హోమియోకు ప్రాచుర్యం మరింత కల్పించాలన్నదే మా ధ్యేయం. ఆలోపతి వైద్యులకోసం ప్రతి రెండు నెలలకోసారి సదస్సు ఏర్పాటు చే సి హోమియో ప్రయోజనాలను వివరిస్తున్నాం.

 వాటా విక్రయించే ఆలోచన ఉందా?
 ప్రైవేటు ఈక్విటీ సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఇప్పట్లో వాటా విక్రయించే ఉద్ధేశమేదీ లేదు. ఇప్పటి వరకు రూ.15 కోట్లు ఖర్చు చేశాం. విస్తరణకు మరో రూ.7 కోట్ల దాకా అవసరమవుతాయి. నిధులు సమకూర్చేందుకు బ్యాంకులు సిద్ధంగానే ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement