కరోనా వైరస్ కట్టడికి కొద్ది రోజులుగా అమలు చేస్తున్న లాక్‌డవున్ నిబంధనలను సడలిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆతిథ్య రంగ కౌంటర్లు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 8 నుంచీ హోటళ్లను తిరిగి ప్రారంభించుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. అయితే కోవిడ్-19 కట్టడికి వీలుగా సామాజిక దూరం తదితర నిబంధనలు పాటించవలసి ఉంటుంది. అంతేకాకుండా తొలి దశలో భాగంగా హోటళ్ల సామర్థ్యంలో 33 శాతాన్ని మాత్రమే వినియోగించేందుకు అనుమతించింది. కంటెయిన్‌మెంట్ జోన్లలో ఇందుకు అనుమతి లేదు. ఈ నిబంధనలు లాడ్జిలు, గెస్ట్‌హౌస్‌లకు సైతం వర్తించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో పలు హోటల్ స్టాక్స్‌కు డిమాండ్ పెరిగింది. వెరసి ఆటుపోట్ల మార్కెట్లోనూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..
కామత్, చాలెట్ జోరు
మహారాష్ట్ర ప్రభుత్వనిర్ణయం నేపథ్యంలో పలు ఆతిథ్య రంగ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం బీఎస్‌ఈలో కామత్ హోటల్స్ 14 శాతంపైగా దూసుకెళ్లి రూ. 34ను తాకగా.. చాలెట్ హోటల్స్ 6.5 శాతం జంప్‌చేసి రూ. 146కు చేరింది. తొలుత రూ. 150కు ఎగసింది. ఈ బాటలో లెమన్ ట్రీ హోటల్స్ 5 శాతం జంప్‌చేసి రూ. 25 వద్ద, తాజ్ జీవీకే 5 శాతం జంప్‌చేసి రూ. 160 వద్ద, ఇండియన్ హోటల్స్ 3 శాతం లాభపడి రూ. 84 వద్ద, ఈఐహెచ్ 3 శాతం పుంజుకుని రూ. 68 వద్ద ట్రేడవుతున్నాయి. ఇతర కౌంటర్లలో ఐటీడీసీ 2.5 శాతం బలపడి రూ. 217 వద్ద, ఓరియంటల్ హోటల్స్ 4 శాతం ఎగసి రూ. 21 వద్ద కదులుతున్నాయి. ఈఐహెచ్ అసోసియేటెడ్ 7.4 శాతం పెరిగి రూ. 262 వద్ద, జిందాల్ హోటల్స్ 2.6 శాతం లాభంతో రూ. 21 వద్ద ట్రేడవుతున్నాయి. ఇదే విధంగా ఏషియన్ హోటల్స్ వెస్ట్ 3.6 శాతం లాభంతో రూ. 280 కు చేరగా.. ఏషియన్ హోటల్స్ నార్త్ 2.3 శాతం పుంజుకుని రూ. 56ను తాకింది.
Comments
Please login to add a commentAdd a comment