న్యూఢిల్లీ: భారత ఎగుమతులు 2017–18 ఆర్థిక సంవత్సరం చివరి నెల మార్చిలో నిరాశపరిచాయి. 2017 మార్చితో పోల్చిచూస్తే, 2018లో మార్చిలో ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా –0.66% క్షీణించి 29.11 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఎగుమతులు మైనస్‌లోకి జారడం ఐదు నెలల తర్వాత ఇదే తొలిసారి. వాణిజ్యమంత్రిత్వశాఖ శుక్రవారం తాజా గణాంకాలను విడుదల చేసింది. పెట్రోలియం, రత్నాలు–ఆభరణాల ఎగుమతుల క్షీణత మొత్తం నెలవారీ ఎగుమతులపై ప్రభావం చూపింది.
దిగుమతుల్లో 7.15 అప్
ఇక దిగుమతులు మార్చిలో 7.5 శాతం పెరిగి 42.80 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీనితో ఎగుమతులు–దిగుమతులకు మధ్య నికర వ్యత్యాసం 13.69 బిలయన్ డాలర్లుగా నమోదయ్యింది. కాగా చమురు దిగుమతులు 13.92 శాతం పెరిగి 11.11 బిలయన్ డాలర్లుగా నమోదయ్యాయి. చమురుయేతర దిగుమతులు 4.96 శాతం ఎగసి 31.69 బిలియన్ డాలర్లకు ఎగశాయి.
పసిడి దిగుమతులు 40 శాతం డౌన్
మార్చి నెలలో పసిడి దిగుమతులు 40 శాతం తగ్గి 2.49 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే వెండి దిగుమతులు మాత్రం 31 శాతం పెరిగి 267.33 మిలియన్ డాలర్లకు చేరాయి. ప్రస్తుతం పసిడి దిగుమతులపై 10 శాతం సుంకం అమలవుతోంది.
వార్షికంగా సానుకూలం...
2017 ఏప్రిల్ – 2018 మార్చి (2017–18) మధ్య 12 నెలల కాలంలో ఎగుమతుల్లో 9.78 శాతం పెరిగాయి. విలువ రూపంలో 302.84 బిలియన్ డాలర్లు. ఇక ఇదే కాలంలో దిగుమతుల 19.59 శాతం పెరిగి 459.67 బిలియన్ డాలర్లకు చేరాయి. వాణిజ్యలోటు 156.83 బిలియన్ డాలర్లు. 2012–13 తరువాత (190.30) అంతస్థాయిలో వాణిజ్యలోటు ఇది. కాగా ఆర్థిక సంవత్సరంలో చమురు దిగుమతులు 25.47 శాతం పెరుగుదలతో 109.11 బిలియన్ డాలర్లకు చేరాయి. విశేషం ఏమిటంటే.. ఎగుమతులు మళ్లీ 300 బిలియన్ డాలర్లను అధిగమించడం రెండేళ్ల తరువాత ఇదే తొలిసారి. 2014–15 ఏడాదిలో 310.30 బిలియన్ డాలర్లను నమోదుచేసుకున్న తరువాత మళ్లీ 300 మార్కును ఎగుమతులు చూడలేదు.
ఆందోళనకరం: ఎఫ్‌ఐఈఓ
రత్నాలు, ఆభరణాలు, జౌళి, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల వంటి కార్మిక ఆధారిత విభాగాల నుంచి ఎగుమతులు ప్రోత్సాహకరంగా లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని ఎగుమతుల సంఘాల భారత సమాఖ్య (ఎఫ్‌ఐఈఓ) ఒక ప్రకటనలో తెలిపింది. బ్యాంకులు, ఇతర రుణ సంస్థల నిబంధనలు కఠినతరం వల్ల ఆయా రంగాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని ఈ ప్రకటన వివరించింది. అంతర్జాతీయంగా వాణిజ్య సంబంధ ఉద్రిక్తతలు కొంత ఆందోళనకు గురిచేస్తున్నాయని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment