ఈ-రిటర్నులతో ఎన్ని చిక్కులో..! | lot of problems with e-returns | Sakshi
Sakshi News home page

ఈ-రిటర్నులతో ఎన్ని చిక్కులో..!

Published Wed, Sep 25 2013 2:13 PM | Last Updated on Thu, Sep 27 2018 4:47 PM

ఈ-రిటర్నులతో ఎన్ని చిక్కులో..! - Sakshi

 ఆదాయం పన్ను శాఖలో ‘ఎలక్ట్రానిక్ విధానం’ పన్ను చెల్లింపుదారులకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. సమాచార సమన్వయం లోపించిన కారణంగా సమస్యలు తలెత్తున్నాయి. ఈ-మెయిల్స్ ద్వారా కోరుతున్న వివరాలు సంబంధిత వ్యక్తులకు చేరడం లేదన్న ఫిర్యాదులొస్తున్నాయి. రూ.5 లక్షలకు పైగా ఆదాయం ఉన్న వ్యక్తులంతా ఈ-రిటర్నులు ఫైల్ చేస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది ఈ-రిటర్నులు ఫైల్ చేస్తున్నారు. వీటిని పరిశీలించిన ఆదాయం పన్ను శాఖ అనుమానాల నివృత్తి కోసం అదనపు వివరాలు కోరడం సర్వసాధారణం.
 
 అయితే, ఈ-రిటర్నులను ఆదాయం పన్ను శాఖ పరిశీలించేందుకు మూడు నుంచి ఐదేళ్ళు పడుతుండడం పన్ను చెల్లింపుదారులకు చిక్కులు తెచ్చిపెడుతోంది. ఈ క్రమంలో తలెత్తే సందేహాలను తెలియజేయాలని చెల్లింపుదారులకు వారు సూచించిన ఈ-మెయిల్‌కు పుణ్యకాలం గడచిపోయాక సందేశం పంపుతున్నారు. వీటిపై సరిగా అవగాహన లేకపోవడమో, చూసీచూడనట్టు వదిలేయడం వల్లనో పన్ను చెల్లింపుదారులకు సమస్యలు వస్తున్నాయి. తాము కోరిన సమాచారం చప్పున ఇవ్వలేదు కాబట్టి, అదనంగా పన్ను చెల్లించాలని ఐటీ అధికారులు ఏకంగా నోటీసులు పంపుతున్నారు. దీంతో పన్ను చెల్లింపుదారులు అధికారులను ఆశ్రయించినా ఫలితం ఉండటం లేదు.
 
  ఈ దశలో అదనపు పన్నుపై చెల్లింపుదారులు ట్రిబ్యునల్‌కు వెళ్ళడం తప్ప మరో గత్యంతరం ఉండటం లేదు. ట్రిబ్యునల్‌లో సమస్య పరిష్కారానికి ఏళ్ళ తరబడి వేచిచూడాల్సి రావడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు ఉద్యోగులకు, చిరు వ్యాపారులకు ఇది తలనొప్పిగా మారుతోంది. ఇల్లు మారిన సందర్భాల్లో నోటీసులు కూడా అందడం లేదని వాపోతున్నారు. అదీగాక సుదీర్ఘకాలం తర్వాత బ్యాంకు లావాదేవీల ఆధారంగా ఆదాయాన్ని అంచనా వేస్తున్నారని, వీటికి సమాధానం ఇవ్వడం సాధ్యం కావడం లేదని వారు అంటున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement