ఫుడ్‌ యాప్స్‌.. డిస్కౌంటు పోరు! | Restaurants and aggregators are locking horns over discounts | Sakshi
Sakshi News home page

ఫుడ్‌ యాప్స్‌.. డిస్కౌంటు పోరు!

Published Thu, Sep 5 2019 4:23 AM | Last Updated on Thu, Sep 5 2019 4:23 AM

Restaurants and aggregators are locking horns over discounts - Sakshi

వంద రూపాయలు ఖరీదు చేసే టిఫిన్‌.. యాభైకే, ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ అంటూ సగానికి సగం డిస్కౌంట్లు ఆఫర్‌ చేసే ఫుడ్‌ అగ్రిగేటర్‌ యాప్స్‌కి ప్రస్తుతం పెద్ద చిక్కొచ్చి పడింది. ఇలాంటి భారీ డిస్కౌంట్లు మేం ఇవ్వలేమంటూ యాప్స్‌ నుంచి హోటల్స్‌ ఒక్కొక్కటిగా తప్పుకుంటున్నాయి. ముందుగా బెట్టు చేసినా .. ఆ తర్వాత సమస్య సామరస్యంగా పరిష్కరించుకుందాం అంటూ అగ్రిగేటర్స్‌ ముందుకొచ్చినప్పటికీ.. హోటళ్ల యాజమాన్యాలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

దీంతో.. అగ్రిగేటర్స్, హోటళ్ల మధ్య డిస్కౌంటు పోరు మరింతగా ముదురుతోంది. బడా రెస్టారెంట్లు, చోటా మోటా హోటళ్ల మధ్య పోరు కింద మారుతోంది. జొమాటో వంటి ఫుడ్‌ యాప్స్‌.. ప్రత్యేక మెంబర్‌షిప్‌ తీసుకున్న యూజర్లకు అందిస్తున్న డైన్‌–ఇన్‌ ఆఫర్లు ఈ వివాదానికి దారితీశాయి. వాస్తవానికి ఈ ఆఫర్ల ఉద్దేశం మెరుగైన రేటింగ్‌ హోటళ్లలో భోంచేసేలా కస్టమర్లను ఆకర్షించడమే అయినా.. ఆయా హోటళ్లు ఇవే తమకు గుదిబండగా మారుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో లాగ్‌అవుట్‌ ఉద్యమం లేవనెత్తాయి. ఫుడ్‌ యాప్స్‌ నుంచి తప్పుకుంటున్నాయి.  

ఆకర్షణీయ ఆఫర్లు ..
అగ్రిగేటర్‌ యాప్స్‌.. యూజర్లను ఆకర్షించేందుకు రకరకాల ఆఫర్స్‌ ఇస్తున్నాయి. ఉదాహరణకు జొమాటో సంగతి తీసుకుంటే ఈ సంస్థ గోల్డ్‌ పేరిట ప్రత్యేక మెంబర్‌షిప్‌ ప్రోగ్రాం నిర్వహిస్తోంది. ఇందులో సభ్యత్వం తీసుకున్న యూజర్లు.. ఇందులో లిస్టయిన హోటళ్లలో ఒకటి తీసుకుంటే మరొకటి ఉచితం తరహాలో మెనూలో ఏ వంటకాన్నైనా, ఎంత పరిమాణమైనా, ఏ హోటల్లోనైనా, ఎన్నిసార్లయినా తినొచ్చని ఆఫర్‌ ఇచ్చింది. ఈ గోల్డ్‌ ప్రోగ్రాంలో చేరాలంటే ఆయా రెస్టారెంట్లకు మంచి రేటింగు ఉండాలి. ఫుడ్‌ డెలివరీ సర్వీసు బాగుండాలి వంటి ప్రమాణాలు ఉన్నాయి. కాబట్టి అన్ని హోటళ్లు కాకుండా కొన్ని హోటళ్లకే ఈ గోల్డ్‌లో సభ్యత్వం లభిస్తోంది.

రెస్టారెంట్ల వాదనేంటంటే..
కస్టమర్లను హోటళ్ల వైపు ఆకర్షించేందుకు ప్రవేశపెట్టిన ఈ ఆఫర్‌ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ.. ఇందులో భారీ డిస్కౌంట్లు ఇవ్వాల్సి వస్తుండటం తమను దెబ్బతీస్తోందని రెస్టారెంట్లు వాదిస్తున్నాయి. తాము అత్యంత తక్కువగా 10 శాతం మార్జిన్లతో హోటళ్లు నిర్వహిస్తుంటామని ఏకంగా 50 శాతం డిస్కౌంటు ఇవ్వాల్సి వస్తుండటంతో తమ వ్యాపారాలపై చాలా ప్రతికూల ప్రభావం పడుతోందని ది నేషనల్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్‌ (ఎన్‌ఆర్‌ఏఐ) మాజీ ప్రెసిడెంట్‌ రియాజ్‌ అమ్లానీ పేర్కొన్నారు. పైపెచ్చు అగ్రిగేటర్స్‌ యాప్‌లో తాము లిస్ట్‌ చేసుకోవాలంటే భారీగా చెల్లించుకోవాల్సి వస్తోందని, దానితో పాటు కమీషన్లూ ఇచ్చుకోవాల్సి ఉంటోందని చెప్పారు.

సందర్భాన్ని బట్టి కొన్ని సార్లు రెస్టారెంట్లు ఏకంగా రూ. 75,000 దాకా సైన్‌–అప్‌ ఫీజు చెల్లించుకోవాల్సి వస్తోందని వివరించారు. ఇక కొన్నింటికి మాత్రమే ఎక్స్‌క్లూజివ్‌ సభ్యత్వం అన్న యాప్స్‌.. ఆ తర్వాత కుప్పలు తెప్పులుగా మెంబర్‌షిప్స్‌ ఇచ్చేస్తుండటంతో పోటీ మరింత పెరిగిపోతోందని హోటల్స్‌ ఆక్షేపిస్తున్నాయి. ఈ పరిణామాల కారణంగా జొమాటో, నియర్‌బై, మ్యాజిక్‌పిన్, ఈజీడైనర్‌ వంటి యాప్స్‌ పాటించే భారీ డిస్కౌంటు విధానాలను వ్యతిరేకిస్తూ.. వాటి నుంచి నిష్క్రమించేందుకు ఆగస్టు 15 సుమారు 300 రెస్టారెంట్లు లాగ్‌అవుట్‌ ఉద్యమాన్ని మొదలెట్టాయి. ఇప్పటిదాకా దాదాపు 2,500 పైగా రెస్టారెంట్లు ఇలా యాప్స్‌ నుంచి లాగవుట్‌ అయినట్లు అంచనా. ఎన్‌ఆర్‌ఏఐలో దాదాపు 6,000 పైచిలుకు రెస్టారెంట్లకు సభ్యత్వం ఉంది.

దిద్దుబాటు ప్రయత్నాల్లో అగ్రిగేటర్స్‌..
రెస్టారెంట్లు హఠాత్తుగా కీలక ప్రోగ్రాం నుంచి తప్పుకుంటుండటంతో ఫుడ్‌ యాప్స్‌ హడావుడిగా సమస్యల పరిష్కారం కోసం రంగంలోకి దిగాయి. గోల్డ్‌ ఆఫర్‌లో మార్పులు, చేర్పులు చేస్తామంటూ జొమాటో ప్రతిపాదించింది. ‘కొందరు యూజర్లు ఒక హోటల్లో 1+1 స్టార్టరు తీసుకుని, మరో చోట 1+1 మెయిన్‌ కోర్స్‌ తిని, మరో చోట 2+2 డ్రింక్స్‌ తీసుకోవడం వంటివి చేస్తున్నారు. ఇలాంటి వాటి వల్ల డిస్కౌంటింగ్‌ భారం భారీగా పెరుగుతోంది. ఇకపై అలా జరగకుండా యూజర్లు గోల్డ్‌ ఆఫర్‌ను రోజులో ఒక్కసారి, ఒక్క హోటల్లో మాత్రమే వినియోగించుకునేలా సవరిస్తాం‘ అంటూ జొమాటో సీఈవో దీపిందర్‌ గోయల్‌ ప్రతిపాదించారు. అలాగే, గోల్డ్‌ మెంబర్‌షిప్‌ ఉన్న హోటళ్లకు ఉచిత ప్రకటనలు మొదలైన వాటి రూపంలో ప్రత్యేక ప్రయోజనాలూ కల్పిస్తామన్నారు. లాగ్‌అవుట్‌ ఉద్యమంలో భాగంగా తమ యాప్‌ నుంచి తప్పుకున్న రెస్టారెంట్లకు మళ్లీ ఉచితంగా సభ్యత్వం కూడా ఇస్తామని చెప్పారు. ఇందుకు సెప్టెంబర్‌ 15 దాకా గడువివ్వాలంటూ కోరారు.

వెనక్కి తగ్గని రెస్టారెంట్లు
అయితే, ఈ ప్రతిపాదనలను రెస్టారెంట్లు కొట్టిపారేశాయి. గతంలో నోటీసు ఇవ్వకుండా తప్పుకున్నందుకు పెనాల్టీలు అంటూ బెదిరించిన అగ్రిగేటర్లు ప్రస్తుతం ఉచితంగా సభ్యత్వం అంటూ ఊరించినా ఉపయోగం లేదని పేర్కొన్నాయి. దీంతో... లాగ్‌అవుట్‌ పరిష్కార ప్రయత్నాలను విరమించుకుంటున్నట్లు గోయల్‌ గురువారం ప్రకటించారు. అదే సందర్భంలో లాగ్‌అవుట్‌ ఉద్యమానికి మూలకారకుడైన ఎన్‌ఆర్‌ఏఐ ప్రెసిడెంట్‌ రాహుల్‌ సింగ్‌పై కూడా వ్యాఖ్యలు చేశారు. డిస్కౌంట్లను వ్యతిరేకిస్తూ ఉద్యమం లేవనెత్తిన రాహుల్‌ సింగ్‌ స్వయంగా తాను నిర్వహించే ది బీర్‌ కెఫే అవుట్‌లెట్స్‌లో మాత్రం డిస్కౌంట్లు ఇస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.

ఇదంతా చూస్తుంటే అగ్రిగేటర్స్‌ను దెబ్బతీసి, లబ్ధి పొందేందుకు కొందరు బడా రెస్టారెంటు ఓనర్లు ఎన్‌ఆర్‌ఏఐని వాడుకుంటున్నట్లుగా కనిపిస్తోందంటూ విమర్శలు గుప్పించారు. అయితే, ఏ వ్యాపారానికైనా విశ్వాసవంతమైన కస్టమర్లు అవసరమన్నది తమకూ తెలుసని రాహుల్‌ సింగ్‌ ఘాటుగా స్పందించారు. ఎవరికి పడితే వారికి కాకుండా తమ టాప్‌ 500 కస్టమర్స్‌కే ఇలాంటి ఆఫర్లు ఇస్తున్నామని, జొమాటో పిల్ల దశలో ఉన్నప్పుడే తమ యాప్‌నకు 3.5 లక్షల డౌన్‌లోడ్‌లు ఉన్నాయన్నారు. ‘ఓనర్లలాగా బ్రోకర్లకు అధికారాలు ఉండవు‘ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏదైతేనేం.. ఇప్పటికైతే ఈ విమర్శలు, ప్రతి విమర్శలకు ఇప్పుడప్పుడే ఫుల్‌స్టాప్‌ పడేట్లు కనిపించడం లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement