స్టార్టప్ కంపెనీల్లో ఎస్‌బీఐ పెట్టుబడులు!
ముంబై: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు ఎస్‌బీఐ రానున్న కాలంలో స్టార్టప్స్ వృద్ధిలో ప్రధాన భూమిక పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫైనాన్షియల్ రంగ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎస్‌బీఐ సుముఖంగా ఉంది. ఈ చర్య ఎస్‌బీఐ కార్యకలాపాలకు ఎంతగానో దోహదపడుతుందని ఒక బ్యాంకు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఎస్‌బీఐ ఇప్పటిదాకా ఎటువంటి స్టార్టప్స్‌లో పెట్టుబడులు పెట్టలేదని, వాటితో జతకట్టడానికి ఎస్‌బీఐ సంసిద్ధంగా ఉందని పేర్కొన్నారు. బ్యాంకుకు నిధుల సమస్య లేదని, తమకు సరైన వేదిక లభిస్తే.. తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తామని తెలిపారు. గతవారం ఎస్‌బీఐ చైర్మన్ అరుంధతీ భట్టాచార్య స్టార్టప్స్‌తో బెంగళూరులో సమావేశమైన విషయం తెలిసిందే. ఇందులో ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగానికి చెందిన కొత్త స్టార్టప్స్ వాటి సొల్యూషన్స్‌ను వివరించాయి.