- నగరాలు, పట్టణాల్లో అభివృద్ధి, మౌలిక ప్రాజెక్టులకు రూపకల్పన
- ఎస్‌బీఐ క్యాపిటల్ బృందాన్ని కోరిన రాష్ట్ర మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏతో పాటు రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాల్లో భారీ ఎత్తున అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నామని, ఈ ప్రాజెక్టులకు రుణ సదుపాయం అందించడం ద్వారా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టుబడుల విభాగం(ఎస్‌బీఐ క్యాపిటల్) బృందాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు కోరారు. పట్టణాభివృద్ధికి పెట్టుబడులతో ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.
మున్సిపల్ ప్రాజెక్టులకు నిధుల సమీకరణలో భాగంగా బుధవారం నగరంలోని ఓ హోటల్‌లో ఎస్‌బీఐ క్యాపిటల్ ప్రతినిధి బృందంతో మంత్రి కేటీఆర్ సమావేశమై చర్చించారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో ఆకర్షితులైన అనేక జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు నిధులు ఇచ్చేం దుకు ముందుకు వస్తున్నాయని ఎస్‌బీఐ అధికారులకు కేటీఆర్ వివరించారు.
ఆస్తుల విలువ పెరుగుతుంది
పురపాలికల్లో ఐటీ పార్కు లు, భవన సముదాయాలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలను నగరాల్లోని కొత్త ప్రాంతాలకు విస్తరిం పజేస్తే ప్రభుత్వ, ప్రజల ఆస్తుల విలువలు భారీగా పెరుగుతాయని మంత్రి కేటీఆర్ అన్నారు. దీంతో స్థానిక నగర, పురపాలక సంస్థలకు వచ్చే పన్నుల ఆదాయం సైతం భారీగా పెరుగుతుందన్నారు. హైదరాబాద్ లో చేపట్టనున్న భారీ ప్రాజెక్టులకు నిధులను సమకూర్చడం కష్టమేమీ కాదని ఎస్‌బీఐ బృందం మంత్రికి తెలిపింది. సమావేశంలో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి ఎంజీ గోపాల్, సీడీఎంఏ కమిషనర్ ఎం.దానకిశోర్, హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు.
పెట్టుబడులతో రండి
Published Thu, Aug 18 2016 9:45 AM | Last Updated on Tue, Aug 28 2018 8:04 PM
Advertisement