నాలుగు నెలల కనిష్టానికి సెన్సెక్స్ | Sensex falls 214 points to near 4-month low; Nifty below 8200 | Sakshi
Sakshi News home page

నాలుగు నెలల కనిష్టానికి సెన్సెక్స్

Published Fri, May 1 2015 12:55 AM | Last Updated on Sun, Sep 3 2017 1:10 AM

నాలుగు నెలల కనిష్టానికి సెన్సెక్స్

నాలుగు నెలల కనిష్టానికి సెన్సెక్స్

డెరివేటివ్స్ ముగింపు రోజు జోరుగా లాభాల స్వీకరణ
8,200 పాయింట్ల దిగువకు నిఫ్టీ
215 పాయింట్ల నష్టంతో 27,011కు సెన్సెక్స్
58 పాయింట్ల నష్టంతో 8,181కు నిఫ్టీ
ముంబై: విదేశీ నిధులు తరలిపోతుండడం, కంపెనీల నాలుగో త్రైమాసిక ఆర్థికఫలితాలు సంతృప్తికరంగా లేకపోవడం, ఏప్రిల్ నెల డెరివేటివ్స్ కాంట్రాక్ట్‌ల చివరి రోజు కావడంతో గురువారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది.

ఎఫ్‌ఎంసీజీ, వాహన రంగాల షేర్లలో భారీ అమ్మకాల కారణంగా బీఎస్‌ఈ సెన్సెక్స్ 215 పాయింట్లు నష్టపోయి 27,011 పాయింట్లకు క్షీణించింది. ఇది నాలుగు నెలల కనిష్టం.  ఇక నిఫ్టీ 8,200 మార్క్ దిగువన ముగిసింది.  58 పాయింట్లు నష్టపోయి 8,181 పాయింట్లకు పతనమైంది. స్టాక్ మార్కెట్ వరుసగా మూడో వారమూ నష్టాల్లోనే ముగిసింది.  అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు ఆరు నెలల గరిష్ట స్థాయికి చేరడం కూడా ప్రభావం చూపింది. ట్రేడింగ్ చివరలో ఎంపిక చేసిన షేర్లలో కొనుగోళ్ల కారణంగా స్టాక్ మార్కెట్ నష్టాలకు కొంత మేర కళ్లెం పడింది.  

ఈ వారంలో సెన్సెక్స్ 427పాయింట్లు, నిఫ్టీ 124 పాయింట్ల చొప్పున నష్టపోయాయి. మార్చిలో స్టాక్ మార్కెట్ సూచీలు జీవిత కాల గరిష్ట స్థాయిలను చేరాయి. అప్పటి నుంచి చూస్తే ఇవి ఇప్పుడు 10 శాతం మేర పతనమయ్యాయి. పన్ను ఆందోళన కారణంగా విదేశీ ఫండ్స్ షేర్ల అమ్మకాలను కొనసాగిస్తున్నాయని ట్రేడర్లు పేర్కొన్నారు. వర్షాలు సాధారణం కంటే తక్కువగానే ఉండొచ్చన్న అంచనాలు, కంపెనీల క్యూ4 ఫలితాలు నిరాశకు గురిచేయడం వంటి కారణాల వల్ల ఇన్వెస్టర్లు తమ లాంగ్ టెర్మ్ హోల్డింగ్స్‌ను మే సిరీస్‌కు రోల్‌ఓవర్ చేయడానికి బదులు విక్రయించారని వారంటున్నారు.

డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు కారణంగా లాభాల స్వీకరణ జరగడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ నుంచి ప్రతికూల వార్తలు ట్రేడింగ్‌పై ప్రభావం చూపాయని జియోజిత్ బీఎన్‌పీ పారిబస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్(ఫండమెంటల్ రీసెర్చ్) వినోద్ నాయర్ చెప్పారు.  లోహ, ఎఫ్‌ఎంసీజీ, వాహన, ఐటీ, టెక్నాలజీ రంగ సూచీలు నష్టపోగా, రియల్టీ, రిఫైనరీ, బ్యాంకింగ్ సూచీలు మాత్రం లాభపడ్డాయి. 30 సెన్సెక్స్ షేర్లలో 23 షేర్లు నష్టాల్లో ముగిశాయి. హెచ్‌డీఎఫ్‌సీ 2.7 శాతం, టాటా స్టీల్ 2.3 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 2.2 శాతం, కోల్ ఇండియా 2.2 శాతం, టాటా మోటార్స్ 2.2 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 2 శాతం, హీరో మోటొకార్ప్ 1.8 శాతం, ఐటీసీ 1.8 శాతం, గెయిల్ ఇండియా 1.6 శాతం చొప్పున తగ్గాయి.

ఇక పెరిగిన షేర్ల విషయానికొస్తే, యాక్సిస్ బ్యాంక్ 2.7 శాతం, భెల్ 2.1 శాతం, వేదాంత 1.3 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.3 శాతం, సిప్లా 1.2 శాతం చొప్పున పెరిగాయి. 1,401 షేర్లు నష్టాల్లో, 1,292 షేర్లు లాభాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.3,746 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో రూ.25,559 కోట్లుగా,  ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.6,27,005 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,158 కోట్లు నికర అమ్మకాలు, దేశీ ఇన్వెస్టర్లు రూ.2,461 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.
 
నేడు మార్కెట్ సెలవు
మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేడు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలకు సెలవు. ఫారెక్స్, బులియన్, ఆయిల్స్ అండ్ ఆయిల్‌సీడ్స్ సహా అన్ని కమోడిటీ మార్కెట్లకు సెలవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement