గ్రాసిమ్ ఇండస్ట్రీస్ - కొనొచ్చు
బ్రోకరేజ్ సంస్థ: ఎడిల్‌వీజ్ ఫైనాన్షియల్
ప్రస్తుత ధర: రూ.1,131 ; టార్గెట్ ధర: రూ.1,416
ఎందుకంటే: ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన ఫ్లాగ్‌షిప్ కంపెనీ ఇది. సిమెంట్, కెమికల్స్, టెక్స్‌టైల్స్, వీఎస్‌ఎఫ్ సెగ్మెంట్లలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆల్ట్రాటెక్ సిమెంట్‌లో 60.3 శాతం, ఆదిత్య బిర్లా క్యాపిటల్‌లో 56 శాతం చొప్పున వాటాలున్నాయి. వీఎస్‌ఎఫ్, సిమెంట్ సెగ్మెంట్‌ల నుంచి దాదాపు 90 శాతం ఆదాయం వస్తోంది. దుస్తుల తయారీలో వినియోగించే విస్కోస్ స్టేపుల్ ఫైబర్(వీఎస్‌ఎఫ్) సెగ్మెంట్లో ప్రపంచంలోనే అగ్రస్థానం ఈ కంపెనీదే. ఈ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి.
ఇబిటా (స్టాండోలోన్) రూ.870 కోట్లకు పెరిగింది. వీఎస్‌ఎఫ్ సెగ్మెంట్లో అమ్మకాలు,, డిమాండ్ జోరుగా ఉండటంతో ఉత్పత్తి సామర్థ్యాన్ని మూడేళ్లలో 58 శాతం పెంచుకుంటోంది. దీని కోసం రూ.4,300 కోట్లు పెట్టుబడులు పెడుతోంది. గుజరాత్‌లోని విలాయత్ వీఎస్‌ఎఫ్ ప్లాంట్ విస్తరణకు ఇటీవలనే పర్యావరణ ఆమోదం పొందింది. రసాయనాల సెగ్మెంట్లో కూడా ఈ కంపెనీదే అగ్రస్థానం. ఈ క్యూ3లో రూ.359 కోట్ల ఇబిటా సాధించింది. కంపెనీ చరిత్రలో ఇదే అత్యధిక క్వార్టర్లీ ఇబిటా.
గత ఏడాది డిసెంబర్ నాటికి కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర నగదు రూ.274 కోట్లుగా, నికర రుణ భారం రూ.14,460 కోట్లుగా ఉన్నాయి. స్టాండోలోన్ ప్రాతిపదికన రూ.600 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. వీఎస్‌ఎఫ్, కెమికల్స్ రంగాల్లో అగ్రస్థానంలో ఉండడం, సిమెంట్ రంగం వృద్ధి ఆశావహంగా ఉండడం, ఆర్థిక సేవల రంగం వ్యాపారం కూడా బాగా ఉండనుండడం సానుకూలాంశాలు. సిమెంట్, వీఎస్‌ఎఫ్ ధరలు బాగా తగ్గితే అది ఈ కంపెనీపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. వీఎస్‌ఎఫ్ సెగ్మెంట్ ఉత్పత్తి వ్యయాలు పెరగడం, దేశీయంగా, అంతర్జాతీయంగా ఇంధన వ్యయాలు అధికమయ్యే అవకాశాలు, ఆర్థిక సేవల రంగ సెగ్మెంట్ వృద్ధి అవకాశాలు తగ్గడం... ఇవన్నీ ప్రతికూలాంశాలు.
అశోక్ లేలాండ్ - కొనొచ్చు
బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్
ప్రస్తుత ధర: రూ.134 ; టార్గెట్ ధర: రూ.158
ఎందుకంటే: హిందుజా గ్రూప్‌లో ప్రధానమైన కంపెనీ ఇది. బస్సుల తయారీలో భారత్‌లోనే అతి పెద్ద కంపెనీ. మధ్య, భారీ వాణిజ్య వాహన మార్కెట్లో 26 శాతం మార్కెట్ వాటాతో భారత్‌లో రెండవ అతి పెద్ద కంపెనీ ఇదే. ఈ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. ఆదాయం 47 శాతం వృద్దితో రూ.7,110 కోట్లకు పెరిగింది. వివిధ రకాల మోడళ్లను అందుబాటులోకి తేవడం, ఎగుమతులు పెరగడంతో ఇబిటా మార్జిన్ 2 శాతం పెరిగి 11.1 శాతానికి చేరింది.
ఇబిటా 74 శాతం వృద్ధితో రూ.790 కోట్లకు ఎగసింది. నికర లాభం 178 శాతం వృద్ధి చెంది రూ.450 కోట్లకు పెరిగింది. ఈ క్యూ3లో అమ్మకాలు 42 శాతం పెరిగాయి. పంత్ నగర్ ప్లాంట్ పన్ను ప్రోత్సాహకాలు తగ్గడం, భారీ డిస్కౌంట్ల కారణంగా స్థూల మార్జిన్ ఒకింత తగ్గింది. పన్ను రేటు అంచనాల కంటే అధికంగా ఉండటంతో ఇతర ఆదాయం రూ.38 కోట్లకు తగ్గింది. వాణిజ్య వాహన రంగం ఈ ఆర్థిక సంవత్సరంలో 10 శాతం వృద్ధి చెందగలదన్న అంచనాలున్నాయి. ఈ కంపెనీ కూడా ఇదే స్థాయిలో వృద్ధి చెందగలదని అంచనా వేస్తున్నాం.
గత ఏడాది నవంబర్‌లో 1 శాతం, ఈ ఏడాది జనవరిలో 1–2 శాతం చొప్పున వాహనాల ధరలను పెంచడం కంపెనీకి కలసివచ్చే అంశం. కీలకం కాని ఆస్తుల విక్రయం, మూలధన పెట్టుబడులపై నియంత్రణ, తదితర చర్యల కారణంగా రుణ భారం తగ్గించుకోవాలని, నగదు నిల్వలను పెంచుకోవాలని యోచిస్తోంది. ఏడాది కాలంలో 6–7 కొత్త మోడళ్లను అందుబాటులోకి తేనున్నది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఓవర్ లోడింగ్‌పై నిషేధం కారణంగా అమ్మకాలు పుంజుకోనుండడం, రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేయనుండడం, వ్యయ నియంత్రణపై కంపెనీ గట్టిగా దృష్టి పెట్టడం సానుకూలాంశాలు.
Comments
Please login to add a commentAdd a comment