హోండా నుంచి టూరింగ్ బైక్
న్యూఢిల్లీ: హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) టూరింగ్ మోటార్ సైకిల్, గోల్డ్ వింగ్-జీఎల్ 1800ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ బైక్‌ను రెండు వేరియంట్లలో అందిస్తున్నామని హెచ్‌ఎంఎస్‌ఐ ప్రెసిడెంట్, సీఈఓ కీత మురమత్సు చెప్పారు. గోల్డ్ వింగ్ ఆడియో కంఫర్ట్ ధర రూ.28.5 లక్షలని, గోల్డ్ వింగ్ ఎయిర్‌బ్యాగ్(ఎయిర్‌బ్యాగ్‌తో కూడిన మోడల్) ధర రూ. 31.5 లక్షలని (రెండు ధరలు ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) పేర్కొన్నారు.
ఆరు సిలిండర్లు, 1,832 సీసీ ఇంజిన్‌తో లభిస్తున్న ఈ బైక్‌ల్లో వినూత్నమైన ఫీచర్లున్నాయని వివరించారు. సీట్లను అడ్జస్ట్ చేసుకోవచ్చని, కాళ్లను వేడిబరిచే సిస్టమ్ ఉందని, 6-స్పీకర్ల సరౌండ్ సౌండ్ సిస్టమ్, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్, యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉన్నాయని తెలిపారు. చిన్న చిన్న సందుల్లో, పార్కింగ్ ప్రదేశాల్లో సులభంగా రివర్స్ చేసుకునేలా ఎలక్ట్రిక్ రివర్స్ సిస్టమ్ ఈ బైక్ ప్రత్యేకత అని వివరించారు. ఈ బైక్ లగేజ్ కెపాసిటీ 150 లీటర్లని, ఎలక్ట్రానిక్ క్రూయిజ్-కంట్రోల్ సిస్టమ్ ఉందని వివరించారు.
ఈ బైక్‌ను ప్రపంచవ్యాప్తంగా 1975లో మా ర్కెట్లోకి తెచ్చామని, బైక్‌ల మీద యాత్రలు చేయాలనుకునే ఔత్సాహికులకు ఇది ఫేవరెట్ బైక్ అని పేర్కొన్నారు. భారత్‌లో టూరింగ్ కల్చర్ పెరుగుతోందని, ఈ ధోరణి మరింత పెరగడానికి గోల్డ్ వింగ్ బైక్ తోడ్పడగలదని హెచ్‌ఎంఎస్‌ఐ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్, మార్కెటింగ్) యధ్‌విందర్ సింగ్ గులేరియా చెప్పారు.