భారత్‌లో ఉబెర్ ఫుడ్ డెలివరీ సర్వీసులు
♦ ముంబైలో ఉబెర్‌ఈట్స్ పేరుతో ప్రారంభం
♦ 200 పైగా రెస్టారెంట్స్‌తో జట్టు
♦ త్వరలో ఢిల్లీ, చెన్నై తదితర నగరాలకు విస్తరణ
ముంబై: ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్ తాజాగా భారత్‌లో ఫుడ్ డెలివరీ వ్యాపార విభాగంలోకి ప్రవేశించింది. ముంబైలో ఉబర్‌ఈట్స్ పేరుతో యాప్ సర్వీసులు ప్రారంభించింది. దీనికోసం స్థానికంగా 200 పైగా రెస్టారెంట్స్‌తో జట్టు కట్టింది. త్వరలోనే ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా తదితర నగరాలకు కూడా విస్తరించనున్నట్లు ఉబర్‌ఈట్స్ ఇండియా విభాగం హెడ్ భవిక్ రాథోడ్ తెలిపారు.
అయితే, ఇందుకోసం నిర్దిష్ట గడువేదీ నిర్దేశించుకోలేదని తెలిపిన రాథోడ్.. ఉబెర్‌ఈట్స్ విభాగం పెట్టుబడులను వెల్లడించడానికి నిరాకరించారు. ఫుడ్ డెలివరీ వ్యాపార విధానం కింద తమ ప్లాట్‌ఫాంను వినియోగించుకునే రెస్టారెంట్ల నుంచి ఉబెర్‌ఈట్స్ సర్వీసు ఫీజు వసూలు చేస్తుంది. మెనూలో ఆహారపదార్థాల ధరలను రెస్టారెంట్లే నిర్ణయిస్తాయి. ప్రతి ఆర్డరుపై నామమాత్రంగా రూ.15 డెలివరీ ఫీజు (పన్నులతో కలిపి) కస్టమర్ నుంచి వసూలు చేయాలని యోచిస్తున్నట్లు రాథోడ్ పేర్కొన్నారు. ఇప్పటికే 200–300 డెలివరీ పార్ట్‌నర్స్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు.
2014లో లాస్ ఏంజెల్స్‌లో ప్రారంభమైన ఉబర్‌ఈట్స్ ప్రపంచవ్యాప్తంగా ముంబైతో సహా 78 నగరాలకు కార్యకలాపాలు విస్తరించింది. ప్రస్తుతం ఇది స్టాండెలోన్ యాప్‌గా పనిచేస్తోంది. జొమాటో, స్విగీ వంటి దేశీ ఫుడ్ డెలివరీ సంస్థలు భారీ స్థాయిలో కార్యకలాపాలు విస్తరిస్తున్న తరుణంలో మార్కెట్లోకి ఉబర్‌ఈట్స్ ప్రవేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది.