అపర కుబేరులు... మూడేళ్లలో మూడింతలు!
ముంబై: మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు రూ.25 కోట్లకుపైగా మిగులు నిధులున్న అల్ట్రా హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (యూహెచ్‌ఎన్‌ఐలు) సంఖ్య గత ఆర్థిక సంవత్సరంలో 16 శాతం వృద్ధిచెంది 1.17 లక్షలకు చేరింది. వచ్చే మూడేళ్లలో వీరి సంఖ్య మూడింతలు పెరిగి 3.43 లక్షలయ్యే అవకాశం ఉందని కోటక్ గ్రూప్, ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఓ నివేదికలో పేర్కొన్నాయి. అపర కుబేరులైన వీరి ఆస్తుల విలువ గతేడాది 21 శాతం పెరిగి రూ.104 లక్షల కోట్లకు చేరింది.
ఏటా రూ.3 కోట్లకు మించిన ఆదాయం కలిగిన వృత్తినిపుణులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. మరో మూడు సంవత్సరాల్లో వీరి ఆస్తుల విలువ దాదాపు నాలుగింతలై రూ.408 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. యూహెచ్‌ఎన్‌ఐల సంఖ్య పెరుగుదల కంటే ఆస్తుల విలువ వృద్ధిరేటు అధికంగా ఉంటుందని కన్సల్టెన్సీ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ భాగస్వామి మురళీ బలరాం బుధవారం ముంబైలో మీడియాకు తెలిపారు. కోటక్ వెల్త్ మేనేజ్‌మెంట్ కంపెనీతో కలసి నివేదిక రూపొందించామని చెప్పారు.
సంపదను ఎలా సృష్టించారన్న అంశంపై నివేదికలో దృష్టిపెట్టలేదని అన్నారు. సుమారు 150 మంది యూహెచ్‌ఎన్‌ఐలు, లగ్జరీ బ్రాండ్లను విక్రయించే 15-20 కంపెనీలతో పాటు వెల్త్‌మేనేజర్లను గత మార్చిలో ఇంటర్వ్యూ చేసి రిపోర్టు తయారుచేశామని వివరించారు. ఇటీవలి ఎన్నికలకు ముందే నిర్వహించిన ఇంటర్వ్యూల్లో దేశీయ ఆర్థిక భవితపై ఎంతో ఆశావాదం వ్యక్తమైందని తెలిపారు.