బంగారుపాళ్యం దొంగలకు సంకెళ్లు | Bangaraupalyam Thiefs Arrest in Gold Robbery Case | Sakshi
Sakshi News home page

బంగారుపాళ్యం దొంగలకు సంకెళ్లు

Published Thu, Dec 20 2018 10:14 AM | Last Updated on Thu, Dec 20 2018 10:14 AM

Bangaraupalyam Thiefs Arrest in Gold Robbery Case - Sakshi

నిందితుల అరెస్టు చూపుతున్న ఎస్పీ విక్రాంత్‌ పాటిల్, (ఇన్‌సెట్‌) దొంగల నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు

బంగారుపాళ్యంలో సంచలనం కలిగించిన బంగారు నగల చోరీ కేసును చిత్తూరుకు కొత్తగా వచ్చిన ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌  సవాలుగా తీసుకోవడంతో పోలీసులు ఎనిమిది రోజుల్లోనే ఛేదించారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి దొంగల భరతం పట్టారు. రూ.1.62 కోట్ల విలువ చేసే 5.25 కిలోల బంగారు ఆభరణాలు చోరీకి గురైతే.. వారంలోనే నిందితులను పట్టుకోవడంతో పాటు 90 శాతం ఆభరణాలను రికవరీ చేసి శభాష్‌ అనిపించుకున్నారు.

చిత్తూరు అర్బన్‌:  బంగారుపాళ్యం వద్ద ఈనెల 8న జరిగిన బంగారు ఆభరణాల చోరీ కేసులో మహారాష్ట్రలోని ‘పరందా’ ముఠాకు చెందిన గుండిభా (35), శివాజీరామ డికులే (32), సతీష్‌ రామ్‌దాస్‌ సుఖేల్‌ (25), రాందాస్‌ గుర్రప్ప పవర్‌ (45), చగస్‌ గుండిభా సుఖాలే (42), అర్జున్‌ రమ జూదవ్‌ (40), రామారావు సుఖాలే (34)లను అరెస్టు చేసి బుధవారం చిత్తూరులోని పోలీసు అతిథి గృహంలో మీడియాకు ఎస్పీ వివరాలను వెల్లడించారు. వీరిపై మహారాష్ట్ర, విజయవాడలో పలు కేసులు ఉన్నట్లు తెలిపారు.

చోరీ జరిగిన తీరు..
భావేష్‌ అనే వ్యక్తి ముంబయ్‌లో పెద్ద బంగారు ఆభరణాల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఇతను చెన్నై, విజయవాడ, వైజాగ్‌లోని పలు దుకాణాలకు బంగారు ఆభరణాలను విక్రయిస్తుంటాడు. ఈనెల 7న తన సిబ్బంది కేదార్, సంజయ్‌ ద్వారా చెరో 8 కిలోల బంగారు ఆభరణాలను ఇచ్చి విజయవాడకు పంపించాడు. ఇక్కడ కొంత బంగారాన్ని విక్రయించిన వీరు, అదే రోజు విశాఖకు వెళ్లి అక్కడ మరికొన్ని ఆభరణాలు విక్రయించారు. మిగిలిన పది కిలోలకు పైగా బరువున్న బంగారు ఆభరణాలను కేదార్, సంజయ్‌ చెరో బ్యాగులో ఉంచుకుని విశాఖ నుంచి బెంగళూరుకు వెళ్లేందుకు వోల్వో బస్సు ఎక్కారు. ముంబయ్‌ మార్కెట్లలోని బంగారు దుకాణాల వద్ద రెక్కీ నిర్వహించే పరందా ముఠా, భావేష్‌ దుకాణ సిబ్బందిని వెంబడిస్తూ వచ్చారు. విశాఖలో వీరితో పాటు ఇద్దరు ముఠా సభ్యులు బస్సు టికెట్లు బెంగళూరుకు బుక్‌ చేసుకోగా ముందరి సీట్లు వచ్చాయి. అక్కడి నుంచి కేదార్, సంజయ్‌ ఎక్కడైనా ఏమరుపాటుగా ఉంటారోనని గమనిస్తూ వచ్చిన దొంగలకు 8న ఉదయం ఆ అవకాశం బంగారుపాళ్యం వద్ద లభించింది. అప్పటికే తిరుపతిలో 12, చిత్తూరులో 2 సీట్లు ఖాళీ అవడంతో దొంగలు వెనుకవైపు కూర్చున్నారు.

బస్సు బంగారుపాళ్యం సమీపంలోని ఫుడ్‌ప్లాజా వద్ద ఆగింది. బ్యాగులో ఉన్న ఆభరణాలు భద్రమని చెప్పి కేదార్‌ కిందకు దిగడం, నిద్రమత్తులో ఉన్న సంజయ్‌ దుప్పటి కప్పుకోవడంతో వెనుకనే ఉన్న దొంగలు బ్యాగును తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా బస్సు దిగేశారు. అప్పటికే విశాఖ నుంచి స్కార్పియోలో బస్సును అనుసరిస్తున్న పరందా ముఠా, బంగారుపాళ్యంలో తమ సహచరులను ఎక్కించుకుని వాహనంలో తిరుపతికి వచ్చేశారు. తిరుపతిలోని శ్రీనివాసం వద్ద తొమ్మిది మంది ముఠా సభ్యులు ఆభరణాలు పంచుకుని అటునుంచి కడప మీదుగా ముంబయ్‌ పారిపోయారు. చోరీ జరిగిన మరుసటి రోజు బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

శభాష్‌ పోలీసులు
మరోవైపు ఈ కేసు ఛేదనలో కృషి చేసిన పలమనేరు ఇన్‌చార్జ్‌ డీఎస్పీ ఎన్‌టివి.రామ్‌కుమార్, పలమనేరు రూరల్‌ సీఐ శ్రీనివాస్, బంగారుపాళ్యం, పంజాణి, గంగవరం, గుడిపాల ఎస్‌ఐలతో పాటు సిబ్బంది దేవరాజులురెడ్డి తదితరులకు ఎస్పీ నగదు రివార్డులు అందచేసి ప్రత్యేకంగా అభినందించారు.

పట్టుబడింది ఇలా...
తొలుత చోరీలో కేదార్, సంజయ్‌ హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానించారు. తీరా సీసీ ఫుటేజీలు పరిశీలించడంతో ఓ ముఠా స్కార్పియో వాహనంలో వెంబడిస్తుండటాన్ని గుర్తించి చోరీ జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ తరహా ఘటనలు మరెక్కడైనా జరిగాయా? అని ఆరా తీశారు. విజయవాడలో ఏడాదిన్నర క్రితం 9 కిలోల బంగారు ఆభరణాలు చోరీకి గురవడాన్ని గుర్తించి అక్కడ అరెస్టయి బెయిల్‌పై వెళ్లిన నిందితులపై ఖాకీలు దృష్టి సారించారు. ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌కు మహారాష్ట్రలో తన బ్యాచ్‌మేట్స్‌ ఉండటంతో దొంగల ఫొటోలు పంపడంతో పాటు చిత్తూరు నుంచి 50 మంది అధికారులు, సిబ్బందిని ముంబయ్, విజయవాడ, విశాఖ, అహ్మద్‌నగర్, ఔరంగాబాద్, పుణే ప్రాంతాలకు పంపించారు. నిందితులను పట్టుకోవడానికి గాలింపు ముమ్మరం చేశారు. తీరా పరందా అనే గ్రామానికి చెందిన తొమ్మిది మంది ముఠా ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించి, పెద్దపంజాణి వద్ద నిందితులను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.1.35 కోట్ల విలువ చేసే 4.372 గ్రాముల ఆభరణాలు, ఓ స్కార్పియో వాహనం సీజ్‌ చేశారు. మరో ఇద్దరిని అరెస్ట్‌ చేయాల్సి ఉందని, త్వరలోనే వీరి నుంచి బంగారు రికవరీ చేస్తామని ఎస్పీ వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement