నిందితుడి వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ ప్రేమ్‌కాజల్, పక్కన సీఐ, ఎస్‌ఐ
మార్టూరు: సోషల్ మీడియాను ఉపయోగించి మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించిన ఓ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. చీరాల డీఎస్పీ డాక్టర్ ప్రేమ్‌కాజల్ స్థానిక పోలీసుస్టేషన్‌లో ఇంకొల్లు సీఐ మద్దినేని శేషగిరిరావు, మార్టూరు ఎస్‌ఐ సీహెచ్ వెంకటేశ్వర్లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలు వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. రాజస్థాన్ రాష్ట్రం నాగోర్ జిల్లా డేగానా మండలం ఆంత్రోలికల్లా గ్రామానికి చెందిన మున్నారామ్ చౌదరి ఆలియాస్ కిషన్ అనే వ్యక్తి 2010 నుంచి గ్రానైట్ పరిశ్రమల్లో మార్కర్‌గా పనిచేస్తూ మార్టూరులో నివాసం ఉంటున్నాడు. గత ఫిబ్రవరి 18వ తేదీన మున్నారామ్ చౌదరి తన ఫేస్‌బుక్ ఖాతా నుంచి ఒక అభ్యంతరకర సన్ని వేశంతో కూడిన ఓ మతానికి సంబంధించిన చిత్రాన్ని పోస్టు చేయడంతో అది సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది.
స్థానికంగా ఆ మతానికి చెందిన వారు గత ఫిబ్రవరి 20వ తేదీన పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ సత్య ఏసుబాబు ఆదేశాలతో ఇంకొల్లు సీఐ ఎం శేషగిరిరావు తన సిబ్బందితో దర్యాప్తు ప్రారంభించారు. డీఎస్పీ ప్రేమ్‌కాజల్ సారథ్యంలో పలు బృందాలుగా ఏర్పడిన పోలీసు అధికారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిందితుడి కోసం ఢిల్లీ, బెంగళూరు, రాజస్థాన్, వరంగల్ ప్రాంతాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో నిందితుడు మున్నారామ్ చౌదరి మేదమెట్ల పైలాన్ సెంటర్‌లో అనుమానాస్పదంగా సంచరిస్తున్నాడనే సమాచారంతో సీఐ శేషగిరిరావు వలపన్ని అదుపులోకి తీసుకున్నారు.
డీఎస్సీ ప్రేమ్‌కాజల్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఒకరి నుంచి మరొకరికి మంచి సమాచారం, సందేశాలు అందిచేవిగా ఉండాలిగానీ ఇతరుల మనోభావాలు దెబ్బతీసేవిగా ఉండకూడదని హితవు పలికారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతిభకు ప్రామాణికంగా పోలీసు శాఖలో అధికారులకు అందజేస్తున్న ఏబీసీడీ అవార్డులు డీజీపీ మాలకొండయ్య చేతులమీదుగా అందుకున్న సందర్భంగా డీఎస్పీ డాక్టర్ కాజల్, సీఐ శేషగిరిరావును మార్టూరు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది ఘనంగా సన్మానించి అభినందిచారు.
Comments
Please login to add a commentAdd a comment