పెదబయలు పీహెచ్‌సీలో కల్యాణి
విశాఖపట్నం, పెదబయలు : మండలంలో సీతగుంట పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్న పి.కల్యాణి శుక్రవారం మధ్యాహ్నం సూసైడ్ నోట్ రాసుకుని, నిద్ర మాత్రలు మింగి, పెదబయలు పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఒక్కసారిగా కుప్పకూలింది. ఎస్‌ఐ రామకృష్ణారావు స్థానిక నాయకుల సహకారంతో వెంటనే ఆమెను పెదబయలు పీహెచ్‌సీకి తరలించి వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పింది. కొంతసేపటికి కోలుకున్న కల్యాణి విలేకరులతో మాట్లాడుతూ కొంతకాలంగా ఎంపీడీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ స్వామి తనను మానసికంగా వేధిస్తున్నాడని తెలిపారు.
ఇటీవల తనకు వాహనంలో ప్రయాణం చేసే క్రమంలో కాలు బెణికి, ఆస్పత్రిలో చేరడం జరిగిందని, దీంతో ఒక్కరోజు సెలవు పెంచాలని కోరినా సెలవు మంజూరు చేయకుండా ఆబ్సెంట్ వేశారని, అంతేకాకుండా దీనిపై అనేక మార్లు సంజాయిషీ కోరుతూ మానసికంగా బాధపెడుతున్నాడని ఆరోపించారు. ఏడాది నుంచి నీకు భవిష్యత్తు లేకుండా చేస్తానని, సర్వీసు రిజిష్టర్‌లో బాడ్‌గా రాస్తానని, సర్వీసు రిజిష్టర్ చింపివేస్తానని, నీ కారెక్టర్‌పై మచ్చపడేలా ప్రచారం చేస్తానని, తన కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పాలని మాటలతో హింసకు గురిచేస్తుండడంతో తాను మానసికంగా ఎంతో కుంగి చనిపోవాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.
సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు చేస్తాం..
సీతగుంట పంచాయతీ కార్యదర్శి కల్యాణిని ఎంపీడీవో కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ స్వామి వేధిస్తున్నాడని, తన చావుకు అతనే కా>రణమని, ఎంపీడీవోకు చెప్పినా పట్టించుకోలేదని అందువల్లే చనిపోవాలని నిర్ణయించుకున్నానని నోట్‌లో ఉందని ఎస్‌ఐ రామకృష్ణారావు తెలిపారు. విచారణ చేసి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసు నమేదు చేయడం జరుగుతుందని తెలిపారు. కాగా స్వామిపై చర్యలు తీసుకోవాలని వీఆర్వోల సంఘం డివిజన్ అధ్యక్షుడు చెండా రమేష్‌కుమార్, స్థానిక జెడ్‌పీటీసీ జర్సింగి గంగాభవాని, సందడి కొండబాబు డిమాండ్ చేశారు.
వేధింపులు సరికాదు
గ్రామ స్థాయిలో పనిచేసే సీతగుంట పంచాయతీ కార్యదర్శి కళ్యాణిని సీనియర్ అసిస్టెంట్ వేధించడం దారుణం. కొంతకాలంగా స్వామి కార్యదర్శులతో ప్రవర్తించే తీరుపై ఫిర్యాదులు ఉన్నాయి. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. – వి.చిరంజీవి, పంచాయతీ కార్యదర్శుల సంఘం డివిజన్ అధ్యక్షుడు
ఎన్నడూ ఫిర్యాదు చేయలేదు : ఎంపీడీవో
ఈ విషయమై ఎంపీడీవో వసంతరావు నాయక్‌ను వివరణ కోరగా సీనియర్ అసిస్టెంట్ వేధిస్తున్నారని తనకు కార్యదర్శి ఎన్నడూ ఫిర్యాదు చేయలేదని అన్నారు. ఈ ఆరోపణలపై సీనియర్ అసిస్టెంట్ స్వామిని వివరణ కోరగా తాను ఎవరినీ ఎలాంటి ఇబ్బందులకు గురి చేయలేదని, తన వల్ల తప్పు జరిగి ఉంటే క్షమించాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment