రైల్వే ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకమవుతోంది.వందలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే రైళ్ల విషయంలో రైల్వే, పోలీసు శాఖ నిర్లక్ష్యం దొంగలకు వరంగా మారింది. ఒక్కో రైలులో ఒకరు లేదా ఇద్దరు కానిస్టేబుళ్లతో భద్రత నిర్వహిస్తుండటం చూస్తే..దొంగలకు దారి చూపినట్లుగా ఉంది. దొంగలు గుంపుగా వచ్చి తమ పని చేసుకుంటుండగా.. పోలీసులు చూస్తూ ఉండిపోవాల్సిన పరిస్థితి.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: దొంగలు చాకచక్యంగా వ్యవహరిస్తున్నారా? పోలీసులు నిద్ర మత్తులో జోగుతున్నారా? గత నెల 21న రాత్రి 11.30 నుంచి ఈనెల 17వ తేదీ తెల్లవారుజాము వరకు సరిగ్గా నెల రోజుల్లో ఏడు రైళ్లలో చోటు చేసుకున్న చోరీలను పరిశీలిస్తే ఈ సందేహం కలుగక మానదు. వరుస చోరీలతో రైలు ప్రయాణమంటేనే ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. రైల్వేలో సిబ్బంది కొరత.. రైల్వే, సివిల్ పోలీసుల మధ్య సమన్వయ లోపం దొంగలకు కలిసి వస్తోంది. దొంగలను పట్టుకునేందుకు రోజూ 40 బీట్లలో పోలీసులు పహారా కాస్తున్నా వీరి కళ్లుగప్పి దొంగలు చోరీలకు పాల్పడుతుండటం గమనార్హం. ఏకంగా సిగ్నల్స్ కట్ చేసి మరీ చోరీలు చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రైళ్లలో చోరీలకు పాల్పడుతున్నది షోలాపూర్ గ్యాంగే అని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు ఎస్పీ అశోక్‌కుమార్ ఓ ప్రత్యేక బృందాన్ని నాలుగు రోజుల కిందట షోలాపూర్ పంపించారు. బృందం వెళ్లిన తర్వాత కూడా మరుసటి రోజే 17వ తేది తెల్లవారుజామున వేములపాడు వద్ద వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో దొంగతనం జరగడం పోలీసులకు సవాల్‌గా మారింది. గుత్తి–తాడిపత్రి మధ్యలోనే వరుస చోరీలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రూట్‌లో రాయలసీమ, ఎగ్మోర్, వెంకటాద్రి, కాచిగూడ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి.
సిగ్నల్ కట్ చేసి చోరీలు
రైలులో ప్రయాణికులతోపాటు దొంగలు కూడా ఉంటారు. స్లీపర్, ఏసీ బోగీల్లో ఎక్కడ బ్యాగులు ఎక్కువగా ఉన్నాయి? బంగారు ధరించిన వారు ఎక్కడ ఎక్కువగా ఉన్నారు? అనే విషయాన్ని ముందుగానే పరిశీలిస్తారు. అంతా నిద్రపోయే సమయంలో ఫోన్ చేసి తోటి దొంగలకు సమాచారం ఇస్తారు. రైలు వెళుతున్నప్పుడు సిగ్నల్స్ మొత్తం గ్రీన్‌లైట్లు ఉంటాయి. ఈ సిగ్నల్‌ను దొంగలు కట్ చేస్తారు. దీంతో సిగ్నల్ లేక రైలును డ్రైవర్ నిలిపేస్తారు. ఆ సమయంలో బోగీలోని దొంగలు ప్రయాణికులను బెదిరించి, దాడి చేసి దొంగతనం చేసి రైలు నుంచి దిగేస్తారు.
ముఠాను పట్టుకోవడం సవాలే..
షోలాపూర్‌లో దొంగల ఇళ్లు, ఇక్కడి పోలీసులకు తెలుసు. వారిని పట్టుకునేందుకు వెళితే అక్కడి పోలీసులు పూర్తిస్థాయిలో సహకరించని పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు అక్కడి పోలీసులు, దొంగలకు సన్నిహిత సంబంధాలు ఉండటమే కారణమని సమాచారం. ఇక్కడి పోలీసులు వెళితే వీరిపై దొంగలు దాడులకు తెగబడతారు. అవసరమైతే చంపేందుకూ వెనుకాడరు. ఇతర రాష్ట్రాల్లోని పోలీసులపై ఇలాంటి దాడులకు తెగబడిన సందర్భాలు అనేకం చోటు చేసుకున్నాయి. దొంగల ఇళ్లలోని మహిళలు కూడా పోలీసులు వస్తే దుస్తులు చించుకుని పోలీసులపై అత్యాచారం కేసులు నమోదు చేసే పరిస్థితి. మురికివాడలు, మారుమూల పల్లెల్లో నివసించే పేదలను పోలీసులు వేధిస్తున్నారని స్థానికులు ఆందోళనలు కూడా చేస్తారు. ఈ నేపథ్యంలో దొంగలను పట్టుకోవాలంటే పథకం ప్రకారం పోలీసులు వ్యవహరించాల్సి ఉంది. ఇవన్నీ చూస్తే షోలాపూర్ దొంగలను పట్టుకోవడం పోలీసులకు ఎప్పుడూ సవాలే. నెలకిందట కూడా షోలాపూర్‌కు ఓ పోలీసు బృందాన్ని పంపారు. అయితే వారు దొంగలను పట్టుకోలేక తిరుగు పయనమయ్యారు. ఇప్పడు తాజాగా వెళ్లిన బృందం నాలుగురోజులుగా గాలిస్తోంది. ఇప్పటి వరకూ అక్కడ దొంగలు పట్టుబడలేదని సమాచారం.
జీఆర్‌పీ పోలీసులదే భద్రత బాధ్యత
రైల్వే పోలీసును జీఆర్‌పీ(గవర్నమెంట్ రైల్వే పోలీసు), ఆర్‌పీఎఫ్(రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్)గా విభజించారు. ప్రయాణికులు, ప్రయాణికుల బ్యాగ్‌ల భద్రత జీఆర్‌పీది. రైల్వే, రైల్వే ఆస్తుల రక్షణ బాధ్యత ఆర్‌పీఎఫ్‌ది. దీంతో ఇద్దరి విధులు వేరయ్యాయి. ఇప్పటికీ రైల్వే లగేజీ బోగీని తెరిచే అధికారం జీఆర్‌పీకి లేదు. దీంతో రైల్వేపోలీసులు భద్రతను పట్టించుకోరు. పోనీ జీఆర్‌పీ పోలీసులు పర్యవేక్షిస్తున్నారా? అంటే మన రాష్ట్రంలో జీఆర్‌పీ రిక్రూట్‌మెంటే లేని పరిస్థితి.
పొరుగు రాష్ట్రాలకుభిన్నంగా ఏపీలో జీఆర్‌పీ పరిస్థితి
కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళతో పాటు చాలా రాష్ట్రాల్లో జీఆర్‌పీకి ప్రత్యేకంగా రిక్రూట్‌మెంట్ ఉంటుంది. కానీ ఏపీలో రిక్రూట్‌మెంట్ లేదు. సివిల్ పోలీసులే డిప్యూటేషన్‌పై జీఆర్‌పీలో విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో గుంతకల్లు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం, కదిరి పోలీసుస్టేషన్లలో ఒకే సీఐ ఉన్నారు. 9మంది ఎస్‌ఐలు ఉండాల్సి ఉంటే ఇద్దరే దిక్కయ్యారు. 138మంది కానిస్టేబుళ్లకు గాను 53మంది ఉన్నారు. ఒక రైలుకు ఒక్కరు, లేదా ఇద్దరు కానిస్టేబుళ్లు రాత్రిళ్లు భద్రత పర్యవేక్షిస్తారు. దొంగతనాలు జరిగే సమయంలో వీరు దొంగలను నియంత్రించలేని పరిస్థితి. అందువల్లే చోరీలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment