కేతిరెడ్డిపల్లిలో ట్రాన్స్‌ఫార్మర్‌ చోరీ | Transformer theft in Keti Reddypally | Sakshi
Sakshi News home page

కేతిరెడ్డిపల్లిలో ట్రాన్స్‌ఫార్మర్‌ చోరీ

Published Tue, Mar 27 2018 1:39 PM | Last Updated on Tue, Mar 27 2018 1:39 PM

Transformer theft in Keti Reddypally - Sakshi

మొయినాబాద్‌ మండలం కేతిరెడ్డిపల్లిలో చోరీకి గురైన ట్రాన్స్‌ఫార్మర్‌  

మొయినాబాద్‌(చేవెళ్ల): వ్యవసాయ పొలాల్లోని విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ చోరీకి గురైంది. గుర్తుతెలియని దుండగులు ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వంసం చేసి అందులోని విలువైన రాగితీగను దోచుకెళ్లారు. ఈ సంఘటన మండల పరిధిలోని కేతిరెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... కేతిరెడ్డిపల్లి గ్రామంలో రైతు చన్‌వెల్లి మల్లయ్య వ్యవసాయ పొలం వద్ద 25 హెచ్‌పీ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ఉంది.

ఆదివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వంసం చేసి అందులో ఉన్న రాగితీగను ఎత్తుకెళ్లారు. దాని విలువు సమారు రూ.40 వేల వరకు ఉంటుంది. సోమవారం ఉదయం అటుగా వెళ్లిన రైతులు ట్రాన్స్‌ఫార్మర్‌ చోరీకి గురైనట్లు గుర్తించి విద్యుత్‌ అధికారులకు సమాచారం అందించారు. విద్యుత్‌ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
ఆరు నెలల్లో 50 ట్రాన్స్‌ఫార్మర్ల చోరీలు 
మండలంలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల చోరీలు ఆగడం లేదు. గత పదిహేను రోజుల వ్యవధిలోనే ఆరు ట్రాన్స్‌ఫార్మర్లు చోరీకి గురయ్యాయి. గత ఆరు నెలల నుంచి సుమారు 50 ట్రాన్స్‌ఫార్మర్లకు పైగా గుర్తుతెలియని దుండుగులు ధ్వంసం చేసి రాగి తీగను ఎత్తుకెళ్లారు. ప్రధానంగా కనకమామిడి, కేతిరెడ్డిపల్లి సబ్‌స్టేషన్ల పరిధిలోని అప్పారెడ్డిగూడ, తోలుకట్ట, కేతిరెడ్డిపల్లి, ఎత్‌బార్‌పల్లి, నక్కలపల్లి, చాకలిగూడ, కనకమామిడి గ్రామాల్లో ట్రాన్స్‌ఫార్మర్ల చోరీలు అధికంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఒక్క దొంగ కూడా దొరకలేదు. ఇదంతా తెలిసినవారి పనే అయి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దొంగలు పగలే రెక్కీ నిర్వహించి రాత్రి సమయంలో చోరీలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
 

మరోపక్క విద్యుత్‌ సిబ్బంది సైతం చోరీలకు పాల్పడుతున్నవారికి సహకరిస్తున్నారనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్ల చోరీలను అరికట్టేందుకు పోలీసులు ఇప్పటికే పలు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లను స్తంభాలకే బిగించి వెల్డింగ్‌ చేయిస్తున్నారు. అయినా చోరీలు ఆగకపోవడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement