సంచార వైద్యానికి సుస్తీ
సంచార వైద్యానికి సుస్తీ
Published Mon, Jul 18 2016 3:25 PM | Last Updated on Mon, Sep 4 2017 5:16 AM
ప్రైవేటు సంస్థకు అప్పగించడంతో కుంటుపడిన 104
వాహన సేవలు
842 రకాల మందులకు
ఇస్తోంది 10 రకాలే
సిబ్బంది, రక్తపరీక్ష కిట్ల కొరత
మారుమూల గ్రామాల్లో ఉండే ప్రజల చెంతకే వెళ్లి వైద్యసేవలందించేందుకు ఏర్పాటు చేసిన 104 వాహనాలకు సుస్తీ చేసింది. సిబ్బంది, మందుల కొరత ఈ సంచార వైద్యశాలలను వేధిస్తోంది. రక్తపరీక్షల కిట్లూ కనపడటం లేదు. మెుత్తం మీద దీని ద్వారా అందించే సేవల్లో కోతలు పెట్టి రోగులను అవస్థలపాలు చేస్తున్నారు.
ఒంగోలు సెంట్రల్:
రోగి చెంతకి కదిలి వచ్చే ఆసుపత్రిలాంటి 104 వాహనాలకు సుస్తీ చేసింది. గతంలో 104 వాహనం ద్వారా 52 రకాలకు పైగా మందులు అందిస్తే ప్రస్తుతం ఆ సంఖ్య 42కు తగ్గింది. అవి కూడా తగ్గించి పదికి పరిమితం చేశారు. పేదల చెంతకే వైద్యాన్ని అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2009 మార్చిలో 104 వాహనాలను ప్రవేశపెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక, సాధారణ వ్యాధులతో బాధపడుతున్న వారికి అక్కడికక్కడే పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించాలన్నది ఈ పథకం ముఖ్య ఉద్దేశం. తొలినాళ్లలో మారుమూల ప్రాంతాల వారికి సైతం మెరుగైన సేవలందించిన 104 వాహనాలకు వైఎస్ మరణానంతరం ఒడిదొడుకులు మెుదలయ్యాయి. మందుల కొరత, చేయని పరీక్షలతో అరకొరగానే 104 వైద్యసేవలు అందుతున్నాయి. పైగా ప్రభుత్వం నుంచి ప్రైవేటు సంస్థకు ఈ సేవలు అప్పగించడంతో పూర్తిస్థాయిలో పథకం పనిచేయడం లేదు.
గతంలో సేవలిలా..
నిర్ణీత షెడ్యూల్లో గ్రామాల్లోకి వెళ్లి బీపీ, షుగర్, ఉబ్బసం, ఫిట్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో పాటు జ్వరం, విరేచనాలు తదితర సాధారణ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు వైద్యసేవలు అందించి నెలకు సరిపడా మందులు ఉచితంగా పంపిణీ చేసేవారు. ఆ వ్యాధులకు సంబంధించి గతంలో 52 రకాల మందులు అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం 42 రకాలు మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు. అయితే వీటిలో ఏ ఒక్కటీ వాడటం లేదు. కొన్ని రకాల మందుల కాంబినేషన్లకు బదులుగా ఒక రకం మందులను మాత్రమే ఇచ్చి రెండో రకం మందులను బయట కొనుగోలు చేయాలని చెప్తున్నారు.
సిబ్బంది, రక్తపరీక్ష కిట్ల కొరత...
104 వాహనంలో విధుల్లో ఆరుగురు ఉండాలి. వైద్యుడు, నర్సు, ఫార్మాసిస్టు, ల్యాబ్‌టెక్నీషియన్, డ్రైవర్, సెక్యూరిటీ గార్డు ఉన్నారు. అయితే చాలా చోట్ల ఇద్దరు సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. ఉదాహరణకు ఉలవపాడు పార్కింగ్ ప్లేస్‌కు సంబంధించి కేవలం వైద్యుడు, నర్సు మాత్రమే సేవలు అందిస్తున్నారు.
మలేరియా, యూరిన్ పరీక్షలు, షుగర్ పరీక్షలు, గర్భనిర్ధారణ పరీక్షలు, ఈఎస్‌ఆర్, బ్లడ్ గ్రూప్, హిమోగ్లోబిన్ పరీక్షలను ఉచితంగా చేయాల్సి ఉండగా వాహనంలో కనీసం రక్త పరీక్షలు చేసే కిట్లు కూడా కనిపించడం లేదు. రక్త పరీక్షలను పూర్తిగా నిలిపేశారు. చాలా చోట్ల జ్వరం చూడటానికి ధర్మామీటర్లు కూడా లేవు. వాహనంలో పూర్తి స్థాయిలో 42 రకాల మందులు ఉండాలి అయితే కేవలం 10 రకాల మందులతోనే వాహనాలు సంచరిస్తున్నాయి. ఉన్న మందులతోటే అన్ని రకాల వ్యాధులకు ఒకటే ఔషధం తరహాలో చికిత్స అందిస్తున్నారు.
వీటిని పట్టించుకోవాల్సిన 104 పిరమిల్ అధికారులు గుంటూరు జిల్లా నుంచి తమ విధులు నిర్వహిస్తున్నారు. కనీసం సిబ్బందికి కూడా అందుబాటులో ఉండటం లేదు. నెలకు అన్ని రకాల సేవలకు రూ.7 కోట్లు బడ్జెట్ ఉంది. జిల్లాలో 20 వాహనాలు తిరుగుతున్నాయి. అయినా నామమాత్రపు సేవలతో సరిపెడుతున్నారు.
Advertisement