పక్కదారిలో లడ్డూ గోవిందా.. | Bypasses Govinda brownies .. | Sakshi
Sakshi News home page

పక్కదారిలో లడ్డూ గోవిందా..

Published Tue, Dec 20 2016 1:37 AM | Last Updated on Mon, Sep 4 2017 11:07 PM

పక్కదారిలో లడ్డూ గోవిందా..

పక్కదారిలో లడ్డూ గోవిందా..

మిలాఖత్‌ అవుతున్న సిబ్బంది
దళారులకు సహకారం..
జోరుగా లడ్డూల అక్రమ దందా
భారీగా చేతులు మారుతున్న లడ్డూ
స్పందించని టీటీడీ విజిలెన్స్‌ విభాగం


భక్తులు ప్రీతిపాత్రంగా స్వీకరించే శ్రీవారి  లడ్డూల అక్రమ విక్రయాలు జోరందుకున్నాయి. దళారులతో ఇంటిదొంగలు చేతులు కలిపారు. ఫలితంగా రోజూ రూ.5 నుంచి రూ.10 లక్షల వరకు చేతులు మారుతున్నట్టు ఆరోపణలున్నాయి. అయినా సంబంధిత టీటీడీ విజిలెన్స్‌ విభాగం మాత్రం చూసీ చూడనట్టుగా ఉంటోంది. దీనివల్ల లడ్డూల మాఫియా ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండాపోతోంది.

తిరుమల: తిరుమల భక్తులకు వెంకన్న దర్శనం ఎంత ముఖ్యమో.. లడ్డూలూ అంతే ముఖ్యం. ఇందుకోసం భక్తుడు ఎంత ఖర్చుచేయడానికికైనా వెనుకాడడు. ఇదే అక్రమార్కులకు వరమైంది. వీరు మాఫియాలా రింగయ్యారు. ప్రధానంగా దళారులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో లడ్డూటోకెన్లు ఇచ్చే సిబ్బంది, స్కానింగ్‌ చేసే సిబ్బంది, లడ్డూ కౌంటర్‌ సిబ్బంది, లడ్డూల ట్రే లిఫ్టర్లు ఇలా వరుసగా మిలాఖత్‌  అయ్యారు. అందరూ కలసి లడ్డూలను నల్లబజారులోకి తరలిస్తూ అక్రమార్జనలో పడ్డారు.

కాలిబాట టోకెన్లు, సబ్సిడీ లడ్డూ టోకెన్లే ఎక్కువ
ఒక లడ్డూ తయారు చేయడానికి టీటీడీకి రూ.30 దాకా ఖర్చు అవుతోంది. కాలిబాట భక్తులకు ఒక లడ్డూ ఉచితంగా అందజేస్తుంటారు. కాలిబాటతోపాటు సర్వదర్శనం భక్తులకు సబ్సిడీ ధరతో రూ.20కే రెండు లడ్డూలు అందజేస్తున్నారు. రూ.25 చొప్పున రూ.50కి మరో రెండు లడ్డూలు ఇస్తుంటారు. కాలిబాట భక్తులకు ఉచిత లడ్డూతో కలిపి 5 లడ్డూ టోకెన్లు, సర్వదర్శనం భక్తులకు 4 లడ్డూల టోకెన్లు పొందే అవకాశం ఉంది. వీటిలో 20శాతం వరకు నల్ల బజారుకు తరలిపోతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

పద్ధతి ప్రకారమే టోకెన్ల తరలింపు
కాలిబాట భక్తులకు ఇచ్చే టోకెన్లను కొందరు సిబ్బంది దొడ్డిదారిన  దళారులకు ఆ కాలిబాట టోకెన్లు ఇస్తారు. వాటిని వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో కొందరు స్కానింగ్‌ సిబ్బందితో ఒప్పందం కుదుర్చుకుని పద్ధతి ప్రకారం స్కానింగ్‌ చేస్తారు. అనంతరం వాటిని వెలుపల దళారులకు అందజేశారు. అక్కడే భక్తులకు మంజూరు చేసే రూ.20 రెండు సబ్సిడీ టోకెన్లు కూడా అదే పద్ధతి ప్రకారమే   వెలుపుల దళారులకు అందజేసి భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తుంటారు.  అవసరాన్ని బట్టి కొందరు లడ్డూ కౌంటర్‌ సిబ్బంది, ట్రే లిఫ్టర్లు తమ వంతుగా చేతివాటంతో దళారులకు సంపూర్ణంగా సహకరిస్తున్నారు.

విజిలెన్స్‌ నిఘా నామమాత్రమే.. టీటీడీ ఈవో, జేఈవో అయినా పట్టించుకోరా?
టీటీడీ విజిలెన్స్‌ విభాగం కొన్నాళ్లుగా డీలా పడింది.  లడ్డూ వ్యవహారంపై ఈ విభాగం స్పందించడంలేదు. గతంలో ఇదే విభాగంలో ఆరోపణలు ఎదుర్కొన్న  కొందరు అధికారులు, సిబ్బందిపై బదిలీ వేటు పడింది. అప్పట్లో లడ్డూల అక్రమాలు ఆగాయి. తాజాగా ఆరు నెలలుగా ఈ దందా మళ్లీ ఊపందుకుంది. అది కూడా లడ్డూలతో ముడిపడిన అన్ని విభాగాలతో మాఫియాలా దందా పెరిగిపోవడం దారుణం. కనీసం టీటీడీ ఈవో డాక్టర్‌ దొండపాటి సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు, ఇన్‌చార్జి సీవీఎస్‌వో శ్రీనివాస్‌.. లడ్డూల అక్రమ దందా అరికట్టడంపై దృష్టి సారించకపోతే భక్తులపై దోపిడీ పెరగటంతోపాటు పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం కనిపిస్తోంది.

భక్తుల ముసుగులో ఆలయ వీ«ధుల్లోనే మాఫియా తిష్ట
లడ్డూ కౌంటర్‌ కేంద్రం చేసుకుని ఆలయ పడమర మాడ వీధి, ఉత్తరమాడ వీధి, పుష్కరిణి కేంద్రంగా చేసుకుని లడ్డూల మాఫియా తిష్ట వేశారు. ఓ దళారి వద్ద  టోకుగా టోకెన్లు ఉంచుకుంటాడు. మరికొందరు దళారులు భక్తులతో బేరసారాలు సాగించి తర్వాత టోకు దళారి నుంచి టోకెన్లు భక్తులకు అందజేస్తారు.  కొందరు దళారులు ముందే తీసుకొచ్చిన లడ్డూలు భక్తులకు అందజేస్తూ సొమ్ము చేసుకుంటుంటారు. ఈ అక్రమ వ్యవహారాలు సాగించుకునేందుకు  కొందరు దళారులు తరచూ గుండు కొట్టుకోవటం, చేతిలో లగేజీతో సంచరిస్తూ అక్రమ వ్యవహారాలు సంపూర్ణం చేస్తుంటారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement