సుదాపాలెం ఘటనను ఖండించిన చంద్రబాబు
రాజమండ్రి : తూర్పు గోదావరి జిల్లాలో దళితులపై దాడిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. బడుగు, బలహీన వర్గాలకు తాము రక్షణగా ఉంటామని ఆయన గురువారమిక్కడ హామీ ఇచ్చారు. రాజకీయంగా చిచ్చు రగిల్చే ప్రయత్నం చేస్తున్నారంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. శాంతి భద్రతలను చేతిలోకి తీసుకుంటే కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. బాధితులకు ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున ముగ్గురికి మూడు లక్షలు ప్రకటించామని చంద్రబాబు తెలిపారు. రెండ్రోజుల్లోనే ఎనిమిదిమంది నిందితులను పట్టుకున్నామని ఆయన తెలిపారు.
కాగా తూర్పు గోదావరి జిల్లాలో ఆవులను అపహరించి వధిస్తున్నారన్న అనుమానంతో కొందరు దళితులపై దాడికి దిగారు. ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి శివారు సూదాపాలెం శ్మశానంలో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. అమలాపురంలోని జానకిపేటకు చెందిన మోకాటి ఎలీషా, అతని సోదరుడు మోకాటి వెంకటేశ్వరరావు, లాజర్ ఈ ఘటనలో గాయపడిన విషయం తెలిసిందే.