నమ్మకద్రోహానికి మారు పేరు చంద్రబాబు
= మందకృష్ణ మాదిగ ఆరోపణ
= శ్రీవరాహ లక్ష్మీనరసింహ స్వామికి పూజలు
సింగరాయకొండ: చంద్రబాబు నియంతృత్వ విధానాలను మానుకోకపోతే ఆయన పాలనకు కాలం చెల్లకతప్పదని ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. మండలంలోని పాతసింగరాయకొండ శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించి తరువాత విలేకరులతో మాట్లాడారు. తాను చెప్పిన వాగ్దానాన్ని నిలబెట్టుకోమంటే అరెస్టులు, నిర్బంధాలతో చంద్రబాబు అడ్డుకుంటున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లో నడిపించి, గెలిపించిన మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ఆయన ఓటమికి కృషి చేసిన వారిని అందలం ఎక్కించడం చంద్రబాబుకే చెల్లుతుందన్నారు. నిన్నటివరకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న రావెలను తొలగించి మాల అయిన నక్కా ఆనంద్‌బాబుకు పదవి కట్టబెట్టారని చెప్పారు.
మమ్మల్ని అణగదొక్కడానికి ప్రయత్నిస్తే బెదిరే వారం కాదని.. ప్రభుత్వాన్ని మార్చే శక్తి మాదిగలకు మాత్రమే ఉందన్నారు. తమ గోడు వినాల్సిన పాలకులు పట్టించుకోకపోవడంతో వివిధ దేవాలయాలు తిరుగుతూ దేవుళ్లు, దేవతలకు ప్రార్థిస్తున్నామని చెప్పారు. గతంలో తమకు స్వేచ్ఛ లేని రోజుల్లో మా తాత గుర్రం జాషువా గబ్బిలం ద్వారా మా విన్నపాలను దేవతలకు, దేవుళ్లకు విన్నవించాడని గుర్తు చేశారు. ఈనెల 27 నుంచి జూలై 2 వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. 27న అన్ని మండలాల్లో కాళ్లు, చేతులు తాళ్లతో కట్టుకుని నోటికి నల్లగుడ్డలు కట్టుకుని అంబేడ్కర్ విగ్రహాల ముందు నిరసన కార్యక్రమం, 29న విగ్రహాల నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు అర్ధనగ్న ప్రదర్శన, 30న చంద్రబాబు చెప్పులు కుట్టిన ఫొటో పెట్టుకుని చెప్పులు, బూట్లు పాలిష్ చేయడం, జులై 2న అన్ని మండలాల్లో 100 డప్పులు, వెయ్యి గొంతులతో నినాదాలు చేస్తూ కురుక్షేత్ర మహాసభకు మాదిగజాతిని సర్వసన్నద్ధం చేస్తామని చెప్పారు. జూలై 7న మాదిగలంతా అమరావతిలో జరిగే కురుక్షేత్ర సభకు తరలి రావాలన్నారు.
దేవునికి మొక్కుకున్నా..
జూలై 17న పార్లమెంటు సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించాలని, ఈ లోగా ప్రధానమంత్రి మోదీ క్యాబినెట్ ఆమోదం పొంది అఖిల పక్ష సహకారంతో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని, వర్గీకరణ కోసం పోరాడుతున్న వెంకయ్యకు తగిన బలాన్ని, శక్తిని అందించాలని, చంద్రబాబు ప్రతిపక్షంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, జగన్ కూడా వర్గీకరణ అంశం పట్టించుకోవాలని, జూలై 7న కురుక్షేత్ర మహాసభ విజయవంతం అవ్వాలని దేవుడ్ని కోరుకున్నానన్నారు. తరువాత పట్టణంలో ర్యాలీగా వెళ్లి పోలీస్‌స్టేషన్ సెంటరులోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. చంద్రమాదిగ, ఉపాధ్యాయులు ఆనంద్, డేవిడ్, భిక్షాలు, నరసింహులు, కరుణమ్మ, కోటయ్య తదితరులు పాల్గొన్నారు.