అద్దె ఇంట్లో మరణిస్తే... చావే!
- మృతదేహాలను అనుమతించని ఇళ్ల యజమానులు
- అద్దెవాసులకు అవస్థలు
- యజమానితో సమానంగా హక్కు ఉందంటున్న చట్టం
గ్రామాల్లో, పట్టణాల్లో.. ఎక్కడైనా నేడు అద్దెకు ఉండేవారికి చచ్చినా.. చావే. అద్దెకు ఉండేవారి కుటుంబాల్లో ఎవరైనా మృతిచెందితే ఆ మృతదేహాన్ని ఇంటి ఆవరణలోకి కూడా ఇంటి యజమాని రానివ్వడం లేదు. ఇక కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే.. వెంటనే ఖాళీ చేయాలని ఆదేశిస్తున్నారు. అద్దె ఇంట్లో ఉండేవారికి ఇది జీవితంలో ఒకసారైనా ఎదురయ్యే అనుభవం. ఇలా అమానుషంగా ప్రవర్తించేవారిలో బాగా చదువుకున్నవారే అధికమనే వాదన వినిపిస్తోంది.
తిరుపతి : ప్రపంచం శాస్త్రరంగంలో ప్రగతి సాధిస్తోంది. నగరాలు, పట్టణాల్లో నివసించే వారి సంఖ్య పెరుగుతోంది. 30 శాతం మందికి పైగా పట్టణాల్లో నివాసముంటున్నారు. చాలామంది ఉద్యోగాలు, ఉపాధి వెతుక్కుంటూ పట్టణాల బాట పడుతున్నారు. ఈ క్రమంలో వారు అద్దె ఇళ్లలో ఉండాల్సిన పరిస్థితి నెల కొంది.
అయితే అద్దె ఇళ్లలో నివసిస్తూ కుటుంబంలో ఎవరైనా మరణిస్తే బతికున్నవాళ్లు నరకయాతన పడాల్సి వస్తోంది. ఇంట్లో మృతదేహాన్ని పెట్టేందుకు యజమానులు ఒప్పుకోవడం లేదు. అదే సమయంలో మృతదేహాన్ని ఎక్కడికైనా తీసుకెళ్లాలంటే అందరూ శవంతో బేరాలు ఆడతారు. అంబులెన్స్ దగ్గర నుంచి శ్మశానం చేరే వరకు అమ్మో శవమా... అంటారు. భారీ గా డబ్బులు డిమాండ్ చేస్తారు. పవిత్ర కార్యాన్ని ఎలా చేయాలో దిక్కుతోచని స్థితిలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఇది మానవత్వానికి చెందిన పెద్ద సమస్య.
ఇటీవల కొన్నిచోట్ల ఎదురైన సంఘటనలు..
తిరుచానూరులో నివాసముంటున్న ఓ వ్యక్తి విజయవాడలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతని భార్య, పిల్లలు తిరుచానూరులోని అద్దె భవనంలో నివాసముంటున్నారు. సదరు వ్యక్తి విజయవాడలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో మృతదేహాన్ని తిరుచానూరుకు తీసుకువచ్చారు. మృతదేహాన్ని ఇంటి లోపలికి తీసుకెళ్లకూడదని, బయటే ఉంచాలని ఇంటి యజమానులు గొడవపడ్డారు. చేసేదేమీ లేక బయటే ఉంచి తదుపరి కార్యక్రమం కానిచ్చారు.
కొన్నాళ్ల క్రితం మదనపల్లిలో ఓ పల్లెలో కూడా ఇదే సంఘటన నెలకొంది. అద్దెకు నివాసముంటున్న రైతు ఆకస్మికంగా చనిపోవడంతో ఇంటి యజమానులు వచ్చి శవాన్ని బయటపెట్టాలని గొడవపడి శవాన్ని బయటపెట్టారు.
మానవతే ఆదర్శం..
ఓ ముస్లిం మృతిచెందితే వారివారి ఆచారం ప్రకారం శ్మశానానికి తరలిస్తారు. ఎక్కడైనా మృత దేహాల పట్ల అవమానకరంగా వ్యవహరిస్తారని తెలిస్తే వెంటనే వారు ఆ మృతదేహం బాధ్యత తీసుకుని కడవరకు సాగనంపుతారు. వారే దహన క్రియ ఖర్చులు కూడా పెట్టేవారు ఉన్నారు... ఇలా ఇటీవల చాలామంది అనాథ శవాలకు, ఎవరైనా పేదవారు మరణిస్తే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మృతదేహాలకు దహనక్రియలు నిర్వహిస్తున్నారు. అన్నీ తామై వారి భుజాన వేసుకుని కర్మకాండలు కూడా పూర్తిచేస్తుండగా, అద్దె ఇళ్ల యజమానులు అమానుషంగా ప్రవర్తిస్తుండడం శోచనీయం.
చట్టం ఏం చెబుతోంది?
ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ లీజ్ రెంట్ ఎవిక్షన్ కంట్రోల్ యాక్ట్ 1960 ప్రకారం అద్దెవాసులకు కొన్ని హక్కుల్ని చట్టం కల్పించింది. ఇందులో జీవించే, మరణానంతరం కర్మలకు సంబంధించిన హక్కులున్నాయి.
ఇంటి యజమానితో సమానమైన హక్కుల్ని ఆ భవనం అద్దెవాసులు కలిగి ఉంటారు. తాను నివశించే భవనంలో యజమానికి ఎలాంటి వసతులు, స్వేచ్ఛ ఉంటాయో.. అదే అద్దెవాసులకు కూడా వర్తిస్తుంది.
అద్దెవాసుల కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే ఇంటిలోకి రానివ్వకుండా అడ్డుకునే అధికారులు యజమానికి లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
సొంత ఇల్లు, అయినవారు లేని సమయంలో అద్దె భవన కుటుంబం చుట్టుపక్కల నివసించేవారి సహకారంతో ఆచారాల ప్రకారం దానం చేసుకోవచ్చని చట్టం చెబుతోంది. వీటిని ఉల్లంఘించడం చట్టవిరుద్ధం.
మృతదేహానికి జరగాల్సిన క్రియలను అడ్డుకుంటే హక్కుల్ని కాలరాసినట్టే. అలా ఎవరైనా చేసినా హక్కుల ఉల్లంఘన జరిగిందని రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చు.
మానవ హక్కుల సంఘం చిరునామా : బ్లాక్ నెం-7, గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్, గృహకల్ప బిల్డింగ్, ఏపీ హౌస్ కార్పొరేటివ్ బిల్డింగ్, మొజంజాహీ రోడ్డు, నాంపల్లి, హైదరాబాద్, 040-24601572, 73.