- నేషనల్ హార్టికల్చర్ బోర్డు డైరెక్టర్ కృష్ణంరాజు
కోనసీమలోనే కోకోనట్ బోర్డు కార్యాలయం
Published Fri, Jan 13 2017 11:22 PM | Last Updated on Tue, Sep 5 2017 1:11 AM
సఖినేటిపల్లి (రాజోలు) :
కోనసీమ ప్రాంతంలోనే కోకోనట్ బోర్డు రీజినల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేవిధంగా కృషిచేస్తున్నట్టు నేషనల్ హార్టికల్చర్ బోర్డు డైరెక్టర్ సీహెచ్ సత్య కృష్ణంరాజు అన్నారు. శుక్రవారం గ్రామానికి వచ్చిన ఆయన బీజేపీ శ్రేణులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆ పార్టీ నాయకుడు అల్లూరు సత్యనారాయణరాజు ఇంటి వద్ద విలేకరులతో మాట్లాడారు. కొబ్బరికి, తోటల్లో అంతర పంటల వరకూ సాగుకు కో ఆపరేటివ్ సొసైటీల ద్వారా మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే సొసైటీల ద్వారా కేంద్రప్రభుత్వం ఎరువులను రైతులకు సరఫరా చేస్తోందని వెల్లడించారు. రాష్ట్రంలో జాతీయ హార్టికల్చర్ కార్యాలయం ఏర్పాటు దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ఈ మేరకు అధికారులతో కూడిన కమిటీ పరిశీలన చేయనున్నదని పేర్కొన్నారు. విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి పట్టణాల్లో కార్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కూడా తాను కోరినట్టు చెప్పారు. దీనివల్ల రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని తెలిపారు. కాగా ఆయనను స్థానిక బీజేపీ నాయకులు ఘనంగా సత్కరించారు. మాజీ ఎమ్మెల్యే ఎంఏ వేమా, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.సూర్యప్రకాశరావు, నియోజకవర్గ కన్వీనర్ మాలే శ్రీనివాస నగేష్, మండల శాఖ అధ్యక్షుడు చెంపాటి శివరామకృష్ణంరాజు, నాయకులు ఇందుకూరి అచ్యుత రామరాజు, కొల్లాబత్తుల నాగభూషణం, తిరుమల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
Advertisement