అదే మ’ధనం’
-ఆదివారమూ అష్టకష్టాలు
–బ్యాంకులు, ఏటీఎంల వద్దే పడిగాపులు పడ్డ జనం
హాయిగా గడపాల్సిన హాలీడే.. ఆదివారం. ప్రతి ఒక్కరూ చవులూరించే వంటకాలు చేసుకోవాలని, కుటుంబ సభ్యులతో కలిసి సినిమాలకు, షికారుకు వెళ్లాలని తహతహలాడతారు. సామాన్యుల ఈ చిన్న ఆశలను కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఆవిరిచేసింది. ఫలితంగా పేద, మధ్యతరగతి వర్గాలు ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ బ్యాంకుల వద్దే పడిగాపులు పడ్డారు. పాతనోట్ల మార్పిడికి, నగదు ఉపసంహరణలకు పెద్ద యుద్ధమే చేశారు. అయినా చాలామందికి నిరాశే మిగిలింది.
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట) : పెద్దనోట్లను రద్దు చేసి ఆరు రోజులైనా ప్రజల కష్టాలు తీరలేదు. పాతనోట్ల మార్పిడి, నగదు ఉపసంహరణలకు పేద, మధ్యతరగతి వర్గాలు అవస్థలు పడుతూనే ఉన్నారు. ఆదివారం సెలవు రోజైనా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో బ్యాంకులు పనిచేశాయి. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఉదయం 6 గంటల నుంచే బ్యాంకులు, పోస్టాపీసుల వద్ద క్యూ కట్టారు. ఏటీఎంల వద్ద పడిగాపులు పడ్డారు. కొన్నిప్రాంతాల్లో అదీ కొద్ది సమయం మాత్రమే ఏటీఎంలు పనిచేశాయి. ఆ తర్వాత ఎక్కడ చూసినా ’అవుట్ ఆఫ్ సర్వీస్’ అనే బోర్డులే దర్శనమిచ్చాయి. బ్యాంకుల వద్ద క్యూలైన్లలో నిలుచోవడానికి వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడ్డారు. చంటిపిల్లల తల్లులూ అవస్థల పడ్డారు. కొన్ని బ్యాంకుల్లో వీరికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏలూరులోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా బజార్ బ్రాంచ్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది అత్యుత్సాహంతో ఖాతాదారులను తోసివేశారు. దీంతో ప్రజలు సెక్యూరిటీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరులోని పెద్ద పోస్టాఫీసులో కేవలం రూ.2 వేల నోట్లు మాత్రమే ఇవ్వడంతో ఖతాదారులు పెదవివిరిచారు. చిల్లర సమస్యతో సతమతమవుతున్నామని, రూ.100, రూ.20 నోట్లు ఇవ్వాలని బతిమాలారు. తమ వద్ద అవే ఉన్నాయని పోస్టాఫీసు సిబ్బంది సమాధానం చెప్పడంతో చేసేది లేక వెనుదిరిగారు. కొన్ని బ్యాంకుల వద్ద ఖాతాదారులకు మైకుల్లో సిబ్బంది సూచనలు చేశారు. జంగారెడ్డిగూడెంలో బ్యాంకుల్లో మధ్యాహ్నానికే నగదు నిల్వలు నిండుకున్నాయి. దీంతో అధికారులు ప్రజలను తిప్పి పంపేశారు.
తణుకు, నిడదవోలు తదితర ప్రాంతాల్లో వివిధ బ్యాంకు శాఖలు కేవలం తమ ఖాతాదారులకు మాత్రమే పాత నోట్లు మార్చుకునే అవకాశం కల్పించాయి. తాడేపల్లిగూడెం భీమవరం రోడ్డులోని ఎస్‌బీఐ వద్ద ఉదయం నుంచే ప్రజలు భారీ సంఖ్యలో వేచిఉన్నారు. ఉదయం పదిగంటలకు శాఖను తెరవగానే ఒక్కసారిగా లోపలికివెళ్లేందుకు యత్నించడంతో ప్రవేశద్వారం అద్దం పగిలిపోయింది. దీంతో పోలీసులు ప్రజలను నియంత్రించారు. భీమవరంలోనూ బ్యాంకులు కిటకిటలాడాయి. గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకు శాఖల్లో సరిపడిన నగదు అందుబాటులో లేకపోవడంతో ఆయా శాఖల్లో కేవలం నగదు జమ చేసుకోవడానికే అవకాశం ఇచ్చారు.
మార్కెట్లు డీలా
ఆదివారం మార్కెట్లన్నీ డీలాపడ్డాయి. వాస్తవానికి సన్‌డే మార్కెట్లు జోరందుకుంటాయి. ముఖ్యంగా మాంసాహార మార్కెట్లు జనంతో కిటకిటలాడతాయి. అయితే ప్రస్తుతం నగదు లభ్యత లేక అవి వెలవెలబోయాయి. సినిమాహాళ్లదీ ఇదే దుస్థితి.