అనంతపురం సెంట్రల్ : జిల్లా కేంద్రంలోని రుద్రంపేటలో సంచలనం సృష్టించిన జంటహత్యల కేసులో నాల్గో పట్టణ సీఐ సాయిప్రసాద్, ఎస్‌ఐ హేమంత్‌కుమార్‌ను సస్పెండ్ చేస్తూ అనంతపురం రేంజ్ డీఐజీ జె.ప్రభాకర్‌రావు శనివారం నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 21న పట్టపగలే రౌడీషీటర్లు గోపీనాయక్, వెంకటేష్‌నాయక్‌లను దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. అయితే ఇది వరకే పలుమార్లు వీరిపై హత్యకు కుట్ర జరిగింది. ఇటీవలే పోలీసులు భగ్నం చేసి వారిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. అయితే కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపకుండా బైండోవర్‌తో‡సరిపెట్టడం కారణంగా జంటహత్యలు జరిగాయని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యం, సక్రమమైన నిర్ణయాలు తీసుకోకపోవడం, ముందస్తు చర్యలు చేపట్టకపోవడం తదితర కారణాలతో సీఐ సాయిప్రసాద్, ఎస్‌ఐ హేమంత్‌కుమార్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు.
గాలింపు ముమ్మరం
జంటహత్యల కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు హత్య జరిగిన సమయం నుంచే మొబైల్ వాహనాలతో ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. మొత్తం ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. హత్య జరిగిన వెంటనే బొలెరో వాహనంలో ఆలుమూరు రోడ్డు వైపు వెళ్లారని ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు. ఆ దిశగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు శనివారం ఉదయం బుక్కపట్నం మండలం బుచ్చిగారిపల్లి సమీపంలో అటవీ ప్రాంతంలో నిందితులు వదిలేసి వెళ్లిన బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని ఆధారంగా నిందితులు జిల్లా పరిధి దాటి బయటకు పోలేదని తెలుస్తోంది.