లాకెట్‌తో పూజలందుకుంటున్న లక్ష్మణస్వామి
భద్రాచలం : భద్రాద్రి ఆలయంలో శ్రీసీతారామలక్ష్మణ సమేతంగా జరిపే నిత్య కల్యాణోత్సంలో గురువారం లక్ష్మణస్వామికి లాకెట్ అలంకరించారు. భక్తరామదాసు చేయించిన బంగారు ఆభరణాలతో పాటు, భక్తులు కానుకల రూపేణా ఇచ్చిన నగలు నిత్యకల్యాణోత్సవ సమయంలో ఉత్సవమూర్తులకు అలంకరించడం ఆనవాయితీ. అయితే గత కొద్ది రోజులుగా లక్ష్మణస్వామి మెడలో బంగారు లాకెట్ వేయటం లేదు. ఈ విషయం పత్రికల ద్వారా బయటకు పొక్కటంతో దేవస్థానం అధికారులు మేల్కొన్నారు. కొక్కెం విరిగిపోవటంతో అలంకరించలేదని ఆలయాధికారులు చెబుతున్నప్పటికీ, దానిలో ఏదో గమ్మత్తు దాగిఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల ఆలయంలో రెండు బంగారు ఆభరణాలు మాయమైన విషయం తెలిసిందే. సీతమ్మ పుస్తెలతాడు, లక్ష్మణస్వామి వారి లాకెట్ కనిపించలేదు. తిరిగి పది రోజులు తర్వాత దొరికినప్పటికీ, ఆ అభరణాన్నే బుధవారం దాకా లక్ష్మణస్వామికి అలంకరించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బంగారు ఆభరణాల మాయంపై ఇప్పటి వరకూ ఏ ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోలేదు.
అర్చకుల మధ్య మాటల యుద్ధం
లక్ష్మణస్వామికి బంగారు లాకెట్ అలంకరించకపోవడంపై దేవస్థానం ఈఓ రమేష్‌బాబు తీవ్రంగానే స్పందించారు. కొంతమంది అర్చకులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అయితే ఈ పరిణామాలు అర్చకుల మధ్య విభేదాలకు దారితీశాయి. గురువారం రాత్రి ఆలయ ప్రాంగణంలో ఇద్దరు అర్చకుల మధ్యమాటల యుద్ధం కొనసాగినట్లుగా ప్రచారం జరుగుతోంది. ‘దేవస్థానం పరువు పోవడానికి నీవే కారణమని, నీవు ఇక్కడి నుంచి వెళ్లిపోతేనే ఆలయం బాగుపడుతుందని’ బంగారు ఆభరణాలు పోయిన నాటినుంచి తీవ్ర మధనపడుతున్న ఓ అర్చకుడు మరో అర్చకుడిపై తీవ్ర పదజాలాన్ని ఉపయోగించినట్లుగా తెలుస్తోంది. ఈఓ రమేష్‌బాబు వారిని సమన్వయపరిచినట్లుగా తెలిసింది. ఇటువంటి పరిణామాలు ఆలయపాలనను ఎత్తిచూపుతున్నాయి. భద్రాద్రి ఆలయంలో జరుగుతున్న ఇటువంటి వ్యవహారాలపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.