నేటినుంచి ‘గుత్ప’ నీటి విడుదల
Published Wed, Jul 27 2016 11:29 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM
ఆర్మూర్ : నిజాంసాగర్ చివరి ఆయకట్టు ప్రాంతమైన ఆర్మూర్ రైతాంగానికి ఈ ఖరీఫ్‌లో సాగునీటి కష్టాలు తీరనున్నాయి. అర్గుల్ రాజారాం(గుత్ప) ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం ఉదయం నందిపేట మండలంలోని గుత్ప ఎత్తిపోతల పథకం నుంచి నీటిని విడుదల చేయనున్నారు.
ఆర్మూర్ ప్రాంత రైతాంగం ప్రధానంగా 2008 నుంచి గుత్ప ఎత్తిపోతల పథకం నీటిపైన ఆధారపడి పంటలను సాగు చేస్తోంది. రెండేళ్లుగా కరువు పరిస్థితులతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి నీరు చేరలేదు. దీంతో గతేడాది గుత్ప ఎత్తిపోతల నుంచి నీటిని విడుదల చేయలేదు. రెండేళ్ల కరువుతో భూగర్భ జలాలూ అడుగంటాయి. ఇటీవల వర్షాలు కురుస్తుండడంతో గుత్ప ద్వారా నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. దీంతో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి స్పందించి భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావును కలిసి విషయాన్ని వివరించారు. ఆయన ఆదేశాలతో గురువారంనుంచి నీటిని విడుదల చేయనున్నారు. గుత్ప ఎత్తిపోతల పథకం నుంచి నీటి విడుదలతో ఆర్మూర్ ప్రాంతంలోని 53 గ్రామాలలో గల 38,792 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందనుంది.
Advertisement
Advertisement