ఉత్తమాటలే!
♦ అతీగతీ లేని ఉద్యానహబ్
♦ ఉత్తుత్తి ప్రకటనలతో ఊరిస్తున్న పాలకులు
♦ ఫ్రూట్‌బౌల్ ఆఫ్ ఏపీగా ‘అనంత’కు గుర్తింపు
♦ మార్కెటింగ్, ఎగుమతులపై దష్టి పెడితేనే ఉద్యాన రైతులకు ఊరట
జిల్లాను ఉద్యాన హబ్‌గా మారుస్తామంటూ రెండేళ్లుగా పాలకులు చెబుతున్న మాటలు నీటిమూటలే అవుతున్నాయి. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా జిల్లాలో 22 రకాల పండ్లతోటలు సాగు చేస్తున్నారు. ఇక్కడి పండ్ల ఉత్పత్తులు నాణ్యతకు మారుపేరుగా నిలుస్తున్నాయి. ఢిల్లీ, ముంబాయి, నాగపూర్, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, పూణె తదితర మార్కెట్లకు ఎగుమతి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాను ఉద్యాన హబ్‌గా చేస్తామంటూ సీఎం చంద్రబాబుతో పాటు జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఆ శాఖ కమిషనరేట్ అధికారులు తరచూ ప్రకటనలు చేస్తున్నారు. ఇవి ఆచరణకు నోచుకోకపోవడంతో రైతుల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయి.
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లా వ్యాప్తంగా ఏకంగా 1.71 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఉద్యాన తోటలు విస్తరించాయి. ఇందులో చీనీ అత్యధికంగా 48 వేల హెక్టార్లు, మామిడి తోటలు 45 వేల హెక్టార్లలో ఉన్నాయి. ఇవేగాక దానిమ్మ, ద్రాక్ష, సపోట, జామ, రేగు, అల్లనేరేడు, అరటి, బొప్పాయి, కళింగర, కర్భూజా, దోస, ఆకు, వక్క లాంటి స్వల్పకాలిక, దీర్ఘకాలిక తోటలు, పూలు, కూరగాయల తోటలు, ఔషధ పంటలు కూడా సాగవుతున్నాయి. దీంతో జిల్లాకు ‘ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఏపీ’గా పేరొచ్చింది. గత ఏడాది (2015–16 ఆర్థిక సంవత్సరం) అన్ని పంటల ద్వారా 33.28 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తులు వచ్చాయి. వీటి ద్వారా రూ.3,570 కోట్ల టర్నోవర్ జరిగినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అంతకుముందు సంవత్సరం (2014–15)లో రూ.3,100 కోట్ల ఉత్పత్తులు వచ్చాయి. ఈ ఏడాది రూ.4,400 కోట్ల విలువ చేసే ఉత్పత్తులు సాధించాలని ఉద్యానశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాది చీనీ, అరటి ద్వారానే రూ.1,700 కోట్ల వరకు టర్నోవర్ ఉండటం విశేషం.
మార్కెటింగ్ లేక అవస్థలు
జిల్లాలో ఉద్యాన తోటలు పెద్దఎత్తున విస్తరించినా.. అందుకు తగ్గట్టు మార్కెటింగ్ సదుపాయం లేకపోవడంతో నాణ్యమైన పండ్లను ఎగుమతి చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేనప్పుడు విలువ ఆధారిత (వ్యాల్యూ అడిషన్) ఉత్పత్తులుగా చేసుకునేందుకు అవసరమైన గ్రేడింగ్, ప్రాసెసింగ్ యూనిట్లు జిల్లాలో లేవు. దీనివల్ల రైతులు నష్టాలను కొని తెచ్చుకుంటున్నారు. ఒక్కోసారి చీనీ, బొప్పాయి, అరటి, టమాట, మిరప లాంటి పంట ఉత్పత్తులను అమ్ముకోలేక తీవ్రంగా నష్టపోతున్నారు.
బడా కంపెనీలు చూస్తున్నా...
జిల్లాలో నాణ్యమైన ఉద్యాన ఉత్పత్తుల గురించి తెలుసుకున్న బడా కంపెనీలు కొనుగోలు, మార్కెటింగ్‌కు ముందుకు వస్తున్నా, వాటికి ప్రోత్సాహం అందించడంలో పాలకులు, అధికారులు విఫలమవుతున్నారు. గతేడాది వాల్‌మార్ట్ ప్రతినిధులు కూడా రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటించి వెళ్లారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన అపెడా సంస్థ ప్రతినిధులు జిల్లాలో పర్యటించి ఎగుమతిని ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇటీవల బెంగళూరుకు చెందిన లీఫ్ సంస్థ, లక్నోకు చెందిన మరో సంస్థ ప్రతినిధులు కూడా జిల్లాపై దష్టి పెట్టారు. త్వరలో ముంబై కేంద్రంగా వ్యాపారాలు చేస్తున్న ఫూచర్ కంపెనీ ప్రతినిధులు ‘అనంత’కు రానున్నట్లు ఉద్యాన శాఖ వర్గాలు తెలిపాయి. ఇలా దేశ విదేశాల్లో పేరున్న కంపెనీలు జిల్లాలో ఉద్యాన ఉత్పత్తుల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నా .. ఈ అవకాశాన్ని రైతులకు సానుకూలంగా మలచడంలో పాలకులు, అధికారులు విఫలమవుతున్నారు. గుత్తి, కొడికొండ ప్రాంతాల్లో హైవే బజార్లు, టమాట కిచెప్ సెంటర్, మరో నాలుగు ప్రాంతాల్లో ఫ్రూట్, వెజిటెబుల్ కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామంటూ ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. వీటిని ఎప్పటిలోపు ఏర్పాటు చేస్తారన్న విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు.