పండుగలా పంద్రాగస్టు వేడుకలు
మూడు గంటల్లో కార్యక్రమం పూర్తి
ఉదయం 7.30లోగా స్టేడియంలోకి రావాలి
9 గంటలకు సీఎంచే జాతీయ జెండా ఆవిష్కరణ
10 వేల మందికి ఏర్పాట్లు : కలెక్టర్ శశిధర్ వెల్లడి
అనంతపురం సెంట్రల్ : స్వాతంత్య్ర వేడుకలను పండుగలా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శశిధర్ తెలిపారు. శుక్రవారం ఆయన డీఐజీ ప్రభాకర్‌రావు, ఎస్పీ రాజశేఖర బాబుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. పోలీస్ శిక్షణ కళాశాల (పీటీసీ) మైదానంలో రాష్ట్రస్థాయి వేడుకలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని తెలిపారు. రాష్ట్రస్థాయి వేడుకలు కావడంతో తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్తు దేశం మన జిల్లావైపు చూస్తోందన్నారు. ఎక్కడా పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఈ నెల 15న నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, ప్రజలందరూ సహకరించాలని కోరారు.
స్టేడియంలోకి కేవలం పాస్ తీసుకున్న వారికి మాత్రమే అవకాశముంటుందని తెలిపారు. వీఐపీలు, వీవీఐపీలు కాకుండా రెండు వేల మంది సామాన్య ప్రజానీకానికి అనుమతి ఇస్తున్నట్లు వివరించారు. అనంతపురం ఆర్‌డీఓ మలోల వద్ద వెయ్యి పాసులు, కార్పొరేషన్ కమిషనర్ వద్ద 500 పాస్‌లు, అనంతపురం డీఎస్పీ వద్ద 500 పాస్‌లు ఉంచినట్లు వెల్లడించారు. ఆసక్తి ఉన్న వారు సదరు అధికారులను సంప్రదించాలన్నారు. ఉదయం 7.30 గంటలకే స్టేడియంలోకి చేరుకోవాలని, అనంతరం ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేశారు. మధ్యాహ్నం 12 వరకూ కదిలేందుకు వీలుండదని, కావున ప్రజలు అల్పాహారం స్వీకరించి రావాలని సూచించారు. వేడుకల్లో 10 బృందాలు కవాతులో పాల్గొంటాయని తెలిపారు. ఐదు బృందాలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అవకాశం ఇచ్చామన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి సీఎం చేతుల మీదుగా అవార్డులు అందిస్తామన్నారు. సీఎం ఉదయం తొమ్మిది గంటలకు జాతీయ జెండాను ఎగురవేస్తారని తెలిపారు.
ఎవరు ఎలా రావాలంటే.. : ఏ1 పాస్‌లు తీసుకున్న వీవీఐపీలు, ప్రజాప్రతినిధులు పీటీసీ ప్రధాన ద్వారం గుండా, ఏ2 పాస్‌లు తీసుకున్న అధికారులు, మీడియా ప్రతినిధులు గేట్ 2 ద్వారా, ఏ3 పాస్‌లు తీసుకున్న వారు గేట్ 3 ద్వారా, జనరల్ పాస్‌లు తీసుకున్న వారు బీ3 గేట్ ద్వారా రావాల్సి ఉంటుందని వివరించారు.
పటిష్ట బందోబస్తు : ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా నగరం మొత్తం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటుచేసినట్లు డీఐజీ ప్రభాకర్‌రావు, ఎస్పీ రాజశేఖరబాబు తెలిపారు. మొత్తం 6 పార్కింగ్ స్థలాలు, 8 ఎంట్రీ పాయింట్లు, 4 ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. కార్యక్రమం జరుగుతున్నంత సేపూ సమీపంలోని ఫ్లై ఓవర్‌పై వాహనాల రాకపోకలు నిషేధించినట్లు తెలిపారు. నగరంలో అన్ని లాడ్జీలను, వాహనాలను తనిఖీలు చేస్తున్నామని వివరించారు. సమావేశంలో పీటీసీ ప్రిన్సిపల్ వెంకటరామిరెడ్డి, జేసీ లక్ష్మీకాంతం, ఆర్‌డీఓ మలోలా తదితరులు పాల్గొన్నారు.