మీ త్యాగం వృథా కానివ్వం!
అనంతపురం: తెల్లదొరల పాలన నుంచి దేశాన్ని విముక్తి కలిగించి స్వాతంత్య్రం సిద్ధించేందుకు పోరాటాలు చేసి అమరులైన సమరయోధుల త్యాగం వృథా కానివ్వకూడదని వైఎస్సార్‌సీపీ నాయకులు పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. పార్టీ క్రమశిక్షణ సంఘం సభ్యులు బి.ఎర్రిస్వామిరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెల్లదొరల దౌర్జన్యాలను ఎండగట్టి దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన మహనీయుల త్యాగాలాను ఎప్పటికీ మరువలేమన్నారు. గాంధీజీ మార్గం, నెహ్రూ ఆలోచనలు, సుభాష్ చంద్రబోష్ పౌరుషంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.
లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు నారాయణరెడ్డి మాట్లాడుతూ దేశం కోసం ఎంతోమంది స్వాతంత్య్ర సమరయోధులు అసువులు బాసారన్నారు. తెల్లదొరల పాలన నుంచి మనల్ని విముక్తుల్ని చేశారన్నారు. అవినీతి, అక్రమాలను అరికట్టాల్సిన ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తుండటం బాధాకరమన్నారు. గాంధీ చూపిన బాటలో పయనించాలని పిలుపునిచ్చారు. పార్టీ నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ నాటి త్యాగధనుల అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట మధు, కిసాన్‌సెల్ జిల్లా అధ్యక్షులు మిద్దె భాస్కర్‌రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు పెన్నోబులేసు, నాయకులు సుబ్బరాయుడు, సాదిక్, కుమ్మర ఓబులేసు, ముక్తియార్, కార్పొరేటర్ జానకి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ, శ్రీదేవి, కొండమ్మ, అంకిరెడ్డి ప్రమీల, విజయశాంతి తదితరులు పాల్గొన్నారు.