- విద్యాశాఖ అధికారులపై ఇన్‌చార్జ్ జేసీ ఆగ్రహం
అనంతపురం అర్బన్ : ‘ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలపై విద్యార్థి సంఘాలు చేస్తున్న ఫిర్యాదుల్లో వాస్తవాలున్నాయి. నిబంధనలు ఉల్లంఘించే విద్యాసంస్థలపై చర్యలు తీసుకోండి. ఉదాసీంగా వ్యవహరించడానికి వీల్లేదు. చర్యలు తీసుకోవడం చేతకాకపోతే బదిలీ చేయించుకోండి.’ అని అధికారులను ఇన్‌చార్జ్ జాయింట్ కలెక్టర్ సయ్యద్ ఖాజా మొహిద్దీన్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో మంగళవారం విద్యాశాఖ అధికారులు, విద్యాసంస్థల ప్రతినిధులు, విద్యార్థి సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలను ఏ విధంగా ఉల్లంగిస్తున్నాయనే విషయాన్ని ఒక్కొక్కటిగా ఇన్‌చార్జ్ జేసీకి విద్యార్థి సంఘాల నాయకులు వివరించారు. ఇందుకు సంబంధించి ఆధారాలను డీఈఓకి ఇచ్చామన్నారు.
వాటిని పరిశీలించిన జేసీ అధికారులను ఉద్ధేశించి మాట్లాడుతూ విద్యార్థి సంఘాలు చేస్తున్న ఫిర్యాదుల్లో వాస్తవాలు ఉన్నాయన్నారు. వాటిని పరిగణలోకి తీసుకోవాల్సిందే అన్నారు. నిబంధనలు ఉల్లఘిస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగితే సహించేది లేదని కలెక్టర్ స్వయంగా చెప్పారన్నారు. చర్యలు తీసుకోవడం చేతకాని పక్షంలో ఇక్కడి నుంచి వేరేచోటికి బదిలీ చేయించుకోండని ఆదేశించారు. అంతే తప్ప చూస్తూ ఊరుకుంటామంటే సహించబోమన్నారు. విద్యాసంస్థల ప్రతినిధులను ఉద్ధేశించి మాట్లాడుతూ నిబంధనలు ఉల్లంఘించడాన్ని తీవ్రంగా పరిగణిస్తామన్నారు.
కరువు జిల్లాలో ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేయడం సరికాదన్నారు. గవర్నింగ్ బాడీ సమావేశం ఏర్పాటు చేసుకుని ఫీజు నిర్ణయించాలని, ఆ వివరాలను ఒక ఫ్లెక్సీలో పొందపరిచి విద్యాసంస్థలో ప్రదర్శనకు ఉంచాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు, యూనిఫాం విక్రయాలు జరపకూడదన్నారు. నిబంధనలను పాటించకపోతే చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఈఓ పగడాల లక్ష్మినారాయణ, ఆర్‌ఐఓ వెంకటేశ్వర్లు, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నేతలు బండిపరశురాం, మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు జాన్సన్‌బాబు, నరేశ్, బీసీ విద్యార్థి సంఘం నాయకుడు సాకే నరేష్, విద్యా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
చేతకాకపోతే వెళ్లిపోండి
Published Wed, May 3 2017 12:02 AM | Last Updated on Thu, Jul 11 2019 5:24 PM
Advertisement
Advertisement