కష్టాల చెరకు
కష్టాల చెరకు
Published Thu, Aug 18 2016 12:25 AM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM
కొవ్వూరు : ఐదేళ్ల క్రితం వరకూ లాభాల తీపి పంచిన చెరకు సాగు నష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. జిల్లాలో 40 వేల హెక్టార్లలో విస్తరించిన చెరకు సాగు క్రమంగా తగ్గుతూ.. ప్రస్తుతం 8,500 హెక్టార్లకు పడిపోయింది. ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాలు అందకపోవడం, పంచదార పరిశ్రమల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడాల్సి రావడంతో చెరకు సాగుపై రైతుల్లో ఆసక్తి సన్నగిల్లుతోంది. గిట్టుబాటు ధర లభించకపోవడం, పెట్టుబడులు పెరగడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గుచూపు తున్నారు. జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సుమారు 40 శాతం సాగు విస్తీర్ణం తగ్గింది. గత ఏడాది 13,500 హెక్టార్లలో చెరకు సాగు చేస్తే ఈ ఏడాది 8,500 హెక్టార్లకు మాత్రమే పరిమితమైంది.
‘చాగల్లు’ పరిధిలో సాగుకు స్వస్తి
ఈ ఏడాది జిల్లాలోని చాగల్లు షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో చెరకు సాగుకు రైతులు పూర్తిగా స్వస్తి పలికారు.
గతం లో వేసిన కార్శి తోటలు మాత్రమే ఇక్కడ సాగువుతున్నాయి. అదికూడా బెల్లం తయారీ కోసం మాత్రమే సాగు చేస్తున్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో 15 వేలకు పైగా హెక్టార్లలో (సుమారు 50 వేల ఎకరాలు) చెరకు సాగయ్యేది. ప్రస్తుతం 3,350 హెక్టార్ల (8,375 ఎకరాలు)కు మాత్రమే పరిమితమైంది. చాగల్లు షుగర్స్ యాజమాన్యం చెరకు పండించిన రైతులకు రెండేళ్లుగా బకాయిలు సక్రమంగా బకాయిలు చెల్లించడం లేదు. ఆ సొమ్మును రాబట్టుకునేందుకు రైతులు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేశారు. చివరకు రెవెన్యూ రికవరీ యాక్ట్‌ను సైతం ప్రయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొవ్వూరు, తాళ్లపూడి మండలాల్లో ఈ ఏడాది రెండు వేలకు పైగా ఎకరాల్లో చెరకు పంటకు స్వస్తి పలికారు. గోపాలపురం, దేవరపల్లి, పోలవరం, నిడదవోలు మండలాల పరిధిలో రైతులు సైతం ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లారు.
పరిశ్రమల మూత
జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీలు నడపడానికి అవసరమైన స్థాయిలో చెరకు లభ్యం కావడం లేదు. ఈ కారణంగా ఇప్పటికే తణుకులోని పంచదార పరిశ్రమను మూసివేసిన విషయం తెలిసిందే. నల్లజర్ల మండలం పోతవరంలో నూతనంగా నిర్మించిన షుగర్ ఫ్యాక్టరీ సైతం మూతపడింది. తణుకు, జంగారెడ్డిగూడెంలలో షుగర్ ఫ్యాక్టరీలకు అనుబంధంగా నడుస్తున్న మొలాసిస్ పరిశ్రమలు కూడా మూతపడ్డాయి. ఈ కారణంగా వేలాది మంది కార్మికుల ఉపాధి సైతం దెబ్బతింటోంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ చెరకు రైతులు, ఫ్యాక్టరీలు, కార్మికులను సంక్షోభం నుంచి గట్టెక్కిం చేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చెరకు రైతులను పట్టించుకోవట్లేదు
చెరకు సాగును ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ప్రభుత్వపరంగా రైతులకు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇవ్వడం లేదు. కేన్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ఉన్నప్పటికీ రైతులకు ఏవిధంగానూ సహాయపడటం లేదు. ఫ్యాక్టరీ యాజమాన్యాలు రైతులకు చెల్లించాల్సిన సొమ్ములు ఏళ్ల తరబడి బకాయిపడినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ కారణంగానే రైతులు చెరకు సాగుకు దూరమవుతున్నారు. ఫలితంగా చెరకు ఫ్యాక్టరీలు, అనుబంధ కర్మాగారాలు మూతపడుతున్నాయి. పారిశ్రామిక మంత్రం జపిస్తున్న ప్రభుత్వం చెరకు ఫ్యాక్టరీలు మూతపడుతున్నా పట్టించుకోకపోవడం శోచనీయం.– ముళ్లపూడి కాశీవిశ్వనాథ్, చెరకు రైతుల సంఘం నాయకుడు, ధర్మవరం
యాంత్రీకరణతో గట్టెక్కవచ్చు
చెరకు సాగులో పెట్టుబడులు పెరిగాయి. చిన్న కమతాలు కావడంతో రైతులు యాంత్రీకరణను వినియోగించుకోలేకపోతున్నారు. ప్రధానంగా కూలీల కొరత తీవ్రంగా ఉంది. ఇలాంటి కారణాల వల్ల రైతులు వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. యంత్రాలను వినియోగిస్తే సాగు ఖర్చులు తగ్గించుకునే అవకాశం ఉంది. చాగల్లు ఫ్యాక్టరీ పరిధిలో బకాయిలు పెండింగ్ ఉండటం ఈ ప్రాంతంలో చెరకు సాగు తగ్గడానికి కారణం. – ఎ.సీతారామారావు,
అసిస్టెంట్ కేన్ కమిషనర్, తణుకు
Advertisement