మహిళా సాధికారత ఎక్కడ?
మహిళా సాధికారత ఎక్కడ?
Published Sun, Feb 12 2017 12:42 AM | Last Updated on Mon, Aug 20 2018 4:30 PM
ఎమ్మెల్యే రోజాను అరెస్ట్ చేయడంపై మేధావుల మండిపాటు
వ్యతిరేకిస్తారని ఊహించి అడ్డుకోవడం దారుణం
తొండంగిలో పోలీసులతో మహిళలను కొట్టించారు
ప్రజల హక్కులను కాలరాస్తున్నారు
బాబు సర్కారు తీరుపై సర్వత్రా నిరసన
సాక్షి, రాజమహేంద్రవరం: తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో పోలీసులతో పాలన సాగిస్తోందనడానికి వైఎస్సార్ సీపీ నేత, ఎమ్మెల్యే రోజాను అరెస్ట్ చేసిన తీరే ఉదాహరణని ప్రజాసంఘాల ప్రతినిధులు, మేధావులు మండిపడ్డారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని దుయ్యబట్టారు. తొండంగి మండలంలో తమ బతుకులు బుగ్గిచేసే దివీస్ పరిశ్రమ వద్దంటూ ఆందోళన చేసిన మహిళలపై పోలీసులు దాడి చేసి అమానుషంగా కొట్టడాన్ని...పురుష పోలీసులే మహిళలను జుట్టు పట్టుకుని ఈడ్చిన సందర్భాలను గుర్తు చేస్తున్నారు. ఆ ఘటనల్లో మహిళల దుస్తులు కూడా చిరిగిపోయేలా పోలీసులను ఉసిగొల్పి భయకంపితులను చేశారని, ఎన్నికల వేళ చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు తమ జీతాలను పెంచాలని ఆందోళన చేసిన డ్వాక్రా సంఘాల యానిమేటర్లు, అంగ¯ŒSవాడీ కార్యకర్తలను జిల్లా కలెక్టరేట్ వద్ద ఈడ్చివేశారు. ఇప్పడు అదే ప్రభుత్వం మహిళా సాధికారత పేరుతో రాజధాని అమరావతిలో నిర్వహిస్తున్న జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులో ప్రజల చేత ఎన్నికైన మహిళా ఎమ్మెల్యేను సభకు రాకుండా అడ్డుకోవడంపై మేధావులు మండిపడుతున్నారు. సభలో ప్రభుత్వం నేతలు, అధికార పార్టీల నేతలు మహిళలపై చేపట్టిన కాల్‌మనీ సెక్స్ రాకెట్, మహిళా తహసీల్దార్ వనజాక్షిని జట్టు పట్టుకుని ఈడ్చడం వంటి ఘటనలు మాట్లాడుతారేమోనన్న ఆనుమానంతో ఎమ్మెల్యే రోజాను పోలీసులు అడ్డుకోవడం దారుణమంటున్నారు. అసలు రోజా ఏం మాట్లాడతారో తెలుసుకోకుండా ఓ నిర్ణయానికి వచ్చి ముందస్తుగా అరెస్ట్ చేయడం ఎంత వరకు సబబని ప్రశ్నిస్తున్నారు. మహిళా సాధికారత పేరుతో నిర్వహిస్తున్న సదస్సులో ఓ మహిళ హక్కులను కాలరాసినప్పుడు ఇక సాధికారత ఎక్కడ నుంచి వస్తుందని ప్రశ్నిస్తున్నారు.
Advertisement