నిజామాబాద్ : నగరపాలక సంస్థ పరిధిలో ఐదేళ్లలో 354 బహుళ అంతస్తుల నిర్మాణాలు జరిగినట్లు స.హ. చట్టంలో బట్టబయలైంది. ఇందులో 211 భవనాలకు మాత్రమే కార్పొరేషన్ అనుమతి ఉండగా.. ఇంకా 143 బహుళ అంతస్తులకు అనుమతి లేదు. వీటికి పురపాలక చట్టంలోని 217 సెక్షన్ అనుసరించి నోటీసులు అందించారు. 143 అక్రమ భవనాల్లో సింహభాగం భవనాలు వీక్లీబజారు, వినాయక్‌నగర్, పూలాంగ్, గాంధీచౌక్, కంఠేశ్వర్, గంగాస్థాన్, సీతారామ్‌నగర్‌కాలనీ, ఎల్లమ్మగుట్ట కాలనీల్లో ఉన్నారుు. వీటిలో ప్లాన్ సమర్పించిని 45 ఉండగా.. ఏ అనుమతి లేకుండా నిర్మించిన బహుళ అంతస్తు భవనాలు 98 కలవు. అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలకు నోటీసులు జారీ చేసినా నిర్మాణదారులు పట్టించుకోవడం లేదు. మరో పక్క అనధికారంగా ఇంకా 100 వరకు అక్రమ బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు దర్జాగా కొనసాగుతున్నాయి.
టైటిల్ ట్రాన్స్‌ఫర్ ఫీజు నొక్కెస్తున్నారు..
నగరంలో భవనాల అమ్మకాలు చేపట్టినప్పుడు సదరు యజమాన్యాలు వాటిని కొనుగోలు చేసిన వారితో రిజిస్టేషన్ చేయించడం అన్నది సాధారణంగా జరిగే ప్రక్రియ. అయితే రిజిస్ట్రేషన్ అనంతరం తన పేరు మీది నుంచి కొనుగోలుదారు పేరు మీద బదిలీ చేయాలి. ఇక్కడ రెవెన్యూకి, పట్టణ ప్రణాళిక అధికారులు రిజిస్ట్రేషన్ పరంగా పేర్కొన్న ఆస్తి విలువను అనుసరించి రూ.లక్షకు రూ.500 చొప్పున టైటిల్ ట్రాన్స్‌ఫర్ ఫీజు వసూలు చేస్తారు. అయితే మూడేళ్లుగా నగరపాలక సంస్థకు ఈ ఫీజు లక్ష్యానికి తగ్గ విధంగా జమకావడం లేదన్నది బహిరంగ రహస్యం. ఏడాది 500 నుంచి 1000 వరకు టైటిల్ ట్రాన్స్‌ఫర్ కోరుతూ దరఖాస్తులు వస్తున్నాయి. ఏటా దాదాపుగా రూ.కోట్ల ఆదాయం సమకూరుతుంది. మూడేళ్లుగా ఎక్కడికక్కడ ఈ సొమ్ము చేతులు మారిపోతుండటంతో పాలక ఆదాయానికి గండిపడుతున్నది. 2013-14 సంవత్సరంలో టైటిల్ ట్రాన్స్‌ఫర్ ఫీజు కింద గరిష్టంగా రూ.2,81,62,700 సొమ్ము వచ్చినా లక్ష్యాన్ని చేరుకోలేదు. 2014-15, 2015-16 సంవత్సరంలో రూ.3 కోట్లు కూడా దాటకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. నగరపాలక సంస్థలో అక్రమాలపై ఉన్నతాధికారులు స్పందించి విజిలెన్స్ దర్యాప్తు చేపడితే వివరాలు వెలుగుచూసే అవకాశం ఉంది.
అతిక్రమిస్తున్నారు..
- ముందుగా ఎటువంటి అనుమతి లేకుండా బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలు ప్రారంభిస్తున్నారు.
- సెల్లార్ల నిర్మాణానికి అనుమతి లేకున్నా ఇష్టానురీతిన కట్టేస్తున్నారు. పార్కింగ్‌కు వాడుకోవాల్సిన చోట దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు.
- ఇష్టానురీతిన భవనాల ముందు వాహనాలు నిలపడంతో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం పోలీసుశాఖకు తలకుమించిన భారంగా మారుతుంది.
- బహుళ అంతస్తుల భవనాలకు అగ్నిమాపక శాఖ అనుమతులు ఉండటం లేదు. ఏదైనా ప్రమాదం జరిగితే అగ్నిమాపక వాహనం వెళ్లేందుకు కూడా అవకాశం లేదు.
- 200 చ.మీ. వైశాల్యం దాటితే పార్కింగ్‌కు తప్పనిసరిగా స్థలం వదలాలి. కానీ.. చాలా కాలనీల్లో సొమ్ములకు కక్కుర్తి పడిన అధికారులు నిబంధనలు ఉల్లంఘించినా చర్యలు తీసుకోవడం లేదు.