నాలుగేళ్లలో కోటి ఎకరాలకు నీరు
ఇందుకు రూ.1.25 లక్షల కోట్లు ఖర్చు చేస్తాం: సీఎం కేసీఆర్
ఖమ్మం జిల్లాలో భక్తరామదాసు, సీతారామ ప్రాజెక్టులకు శంకుస్థాపన
సాక్షి ప్రతినిధి, ఖమ్మం/కొత్తగూడెం, ఇల్లెందు: ‘‘నాలుగేళ్లలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. ఇందుకు రూ.1.25 లక్షల కోట్లు ఖర్చు చేస్తాం. వందశాతం తాగు, సాగునీటి సమస్యలను పారదోలతాం. ఆరునూరైనా ఇది చేసి తీరుతాం’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటించారు. తెలంగాణ తెచ్చేందుకే తాను పుట్టానని, పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయడమే ధ్యేయమన్నా రు. కోటి ఎకరాలకు సాగునీరందించి హరిత తెలంగాణ నిర్మించడమే తన జీవిత లక్ష్యమని, అందుకోసం అవసరమైతే ప్రాణత్యాగం చేస్తానని అన్నారు.
మంగళవారం ఖమ్మం జిల్లాలో రెండోరోజు పర్యటన ముగింపు సందర్భంగా సీఎం తొలుత తిరుమలాయపాలెంలో భక్తరామదాసు ఎత్తిపోతల పథకానికి, అనంతరం టేకులపల్లి మండలం రోళ్లపాడులో రూ.8 వేల కోట్లతో నిర్మించతలపెట్టిన శ్రీసీతారామ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఈ రెండు చోట్ల ఏర్పాటు చేసిన సభల్లో ప్రసంగించారు. ‘‘నా ప్రాణం పోయినా ఎవరితో రాజీ పడను. ఉద్యమం ఎలా చేశామో.. అలాగే ప్రభుత్వాన్ని ముందుకు నడుపుతాం. రెండేళ్లలో రాజకీయ అవినీతి లేని పాలనను అందించాం. ఇకముందూ పాలన ఇలానే కొనసాగిస్తాం’’ అన్నారు.
బిహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలు తెలంగాణలోని మిషన్ భగీరథను అనుసరిస్తున్నాయని, ఇక్కడి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై అనేక రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నాయన్నారు. పేదింటి ఆడపిల్లల కోసం కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టామని, మార్చి 31 నుంచి తెల్ల రేషన్‌కార్డు ఉన్న బీసీలకు కూడా ఈ పథకం వర్తింపజేస్తామన్నా రు. కాలేజీలు, వర్సిటీ హాస్టళ్లకు సన్నబియ్యం అందిస్తామన్నారు. రూ.14 వేల కోట్లతో వచ్చే ఏడాది 2 లక్షల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మిస్తామన్నారు. రాబోయే రెండేళ్లలో 24 గంటలు త్రీఫేజ్ కరెంటు అందిస్తామన్నారు. రైతుల రుణమాఫీ విషయంపై దృష్టి సారించామని, రెండు విడతలది ఒకేసారి మాఫీ చేసేందుకు ఈ బడ్జెట్‌లో ప్రయత్నం చేస్తామన్నారు. ‘‘మెదక్ జిల్లా నారాయణఖేడ్‌లో ప్రజలు అపురూపమైన మెజారిటీ ఇచ్చి టీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించారు. మొదటిసారిగా కొత్త చరిత్రను లిఖించి టీఆర్‌ఎస్‌ను గెలిపించిన ప్రజలకు, కష్టపడి గెలుపునకు కృషి చేసిన యువ నాయకుడు హరీశ్‌రావు, నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు..’’ అని సీఎం ప్రశంసించారు. ఈ రోజు మనసు నిండా సంతోషం అనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
పాలేరు కరువును పారదోలేందుకే..: దశాబ్దాల తరబడి పాలేరు నియోజకవర్గం ప్రజలు సాగునీటికి, తాగునీటికి అలమటించారని, ఇప్పుడు భక్తరామదాసు ప్రాజెక్టుతో కరువును పారదోలుతామన్నారు. మిషన్ భగీరథతో తిరుమలాయపాలెం, పాలేరు నియోజకవర్గానికి మంచినీళ్లు అందుతున్నాయన్నారు. భద్రాద్రి రాముడు ఉన్న ప్రాంతంలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్నామన్నారు. రేయింబ వళ్లు కష్టపడి ఐదారు నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేసి వచ్చే ఖరీఫ్ నాటికి పాలేరు నియోజకవర్గంలో 60 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేయాలని మంత్రులు హరీశ్, తుమ్మలకు సీఎం చెప్పారు. ‘‘భక్తరామదాసు, సీతారామ ప్రాజెక్టుతో పాలేరు నియోజకవర్గంలో రెండు పంటలకు నీరు అందుతుంది. కృష్ణాలో నీళ్లు తగ్గి సాగర్ ఆయకట్టు దెబ్బతింటే సీతారామ ప్రాజెక్టుతో ఈ భూములకు నీరందించి కరువు కాటకాల బారిన పడకుండా చూస్తాం. మళ్లీ ఆరునెలల తర్వాత వచ్చి ఇక్కడ మిషన్ భగీరథ, భక్త రామదాసు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేస్తా. పాలేరు నియోజకవర్గానికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కూడా మంజూరు చేస్తాం’’ అని చెప్పారు.
‘ఐరన్ హ్యాండ్’తో డీల్ చేస్తాం..
సమాజంలో మంచి చేస్తుంటే కొన్ని శక్తులకు కంటగింపుగా ఉందని, ఈ కార్యక్రమాలకు వస్తుంటే పీడీఎస్‌యూ పిల్లలు రోడ్డుపై బస్‌కు అడ్డం పడే ప్రయత్నం చేశార ని సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘పీడీఎస్‌యూ సంస్థకు ఇది సంస్కారమా..? ఆ సంస్థ ప్రధాన పార్టీ న్యూడెమోక్రసీ పార్టీ వాళ్లది ఇదేనా సంస్కారం? ఇదేమైనా రాజకీయ సభనా..? ఓట్ల సభనా..? ఎవరి సహనానికైనా హద్దు ఉంటుంది. మీ చిల్లర పాలిటిక్స్, చీఫ్ ట్రిక్స్. అక్కడేదో కూర్చుని పేపర్లో రాయించుకునే ట్రిక్స్ ఇక ముందు నడవవు జాగ్రత్త.. నలుగురు పిల్లలొచ్చి.. రెండు జెండాలు పట్టుకుని బస్‌కు అడ్డం కూర్చుంటే అదొక వార్త.. అదొక గొప్ప విషయం. ఇది ఇంత మంచి పథకం.. పాలేరు నియోజకవర్గంలో 60వేల ఎకరాలకు నీరు తెచ్చే పథకం. ఇలాంటి సందర్భాల్లో వచ్చి వెకిలి వేషాలు వేస్తే ఇప్పటి దాకా సహించాం.. కానీ హెచ్చరిక చేస్తున్నా.. రాబోయే రోజుల్లో ఐరన్‌హ్యాండ్‌తో డీల్ చేస్తాం..’’ అని అన్నారు.
పసికూన విజయాలను చూసి కుళ్లుకుంటున్నాయి..
అరవై ఏళ్లపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పాలించిన రెండు పార్టీలు ఇప్పుడు పసికూన సాధిస్తున్న విజయూలను చూసి ఓర్వ లేక కుళ్లుకుంటున్నాయని సీఎం విమర్శించారు. గోదావరిపై ప్రాజెక్టులను నిర్మించకపోవడంతో ఏటా 4 వేల నుంచి 6 వేల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలోకి పోతోందన్నారు. వాటిని వినియోగంలోకి తెచ్చేందుకే శ్రీసీతారామ ప్రాజెక్టుకు రూపకల్పన చేశామన్నారు. దీంతో ఖమ్మం, వరంగల్ జిల్లాలోని 5 లక్షల ఎకరాలకు రెండు పంటలకు సరిపడా సాగునీరు అందుతుందన్నారు. ప్రాజెక్టులకు అవసరమైన భూమిని ఇచ్చే రైతులను ఆదుకుంటామని, నిర్వాసితులకు అదే ప్రాజెక్టుల కింద అవసరమైతే భూమికి బదులు భూమి ఇస్తామని తెలిపారు. అర్హులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మిస్తామన్నారు. త్వరలో బస్సుయాత్ర చేపట్టి.. ప్రతి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తానని తెలిపారు.
ఆరు నెలల్లో పూర్తి: హరీశ్
ఆరు నెలల్లో భక్తరామదాసు ప్రాజెక్టును పూర్తిచేసి పాలేరు నియోజకవర్గ ప్రజలకు సాగునీరు అందిస్తామని సభలో పాల్గొన్న మంత్రి హరీశ్‌చెప్పారు. సీఎం ఆలోచనకు అనుగుణంగా వచ్చే ఖరీఫ్ నాటికే ఈ భూముల్లో నీళ్లు ఉంటాయన్నారు.
జిల్లా ఆశల సౌధాలు: తుమ్మల
భక్త రామదాసు, సీతారామ ప్రాజెక్టులు ఖమ్మం జిల్లా ఆశల సౌధాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. భక్తరామదాసు ద్వారా ఖరీఫ్‌లో నీళ్లందిస్తామన్నారు.
అభినందనీయం: పొంగులేటి
స్వాతంత్య్రం వచ్చినప్పట్నుంచీ తిరుమలాయపాలెం కరువు కోరల్లో అలమటిస్తోంద ని, ఇక్కడ ప్రాజెక్టును కట్టి నీరందించాలను కోవడం అభినందనీయమని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అలాగే పాలేరు నియోజకవర్గంలో పైలేరియా బాధితులను ఆదుకోవాలని, ఆసరా పింఛన్ వీరికి కూడా అందజేయాలన్నారు.