ప్రధాని చేతుల మీదుగా... | onwords hand to prime minister | Sakshi
Sakshi News home page

ప్రధాని చేతుల మీదుగా...

Published Sat, Aug 6 2016 8:52 PM | Last Updated on Wed, Aug 15 2018 6:22 PM

ప్రధాని చేతుల మీదుగా... - Sakshi

ప్రధాని చేతుల మీదుగా...

  • ముచ్చటగా మూడింటికి శంకుస్థాపన
  • మనోహరాబాద్‌–కొత్తపల్లి రైల్వేలైనుకు మోక్షం
  • రామగుండం ఎరువుల కర్మాగారం పనుల పునరుద్దరణ పనులు షురూ.. 
  • ఎన్టీపీసీ 1600 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి పనుల శంకుస్థాపన
  • సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌ : దశాబ్దకాలంగా ఎదురుచూస్తున్న మనోహరాబాద్‌–కొత్తపల్లి రైల్వేలైన్‌కు ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఏళ్ల తరబడి కలగా మిగిలిన రామగుండం ఎరువుల కార్మాగారం పునరుద్ధరణ ఇక వేగవంతం కానుంది. తెలంగాణ స్టేజ్‌1లో భాగంగా ఎన్టీపీసీ ఆధ్వర్యంలో చేపట్టబోయే 1600 మెగావాట్ల థర్మల్‌ పవర్‌ప్లాంట్‌ కల నెరవేరనుంది. జిల్లాకు సంబంధించిన ఈ మూడు ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల పనులకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదివారం మధ్యాహ్నం గజ్వేల్‌లో శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో మనోహరాబాద్‌–కొత్తపల్లి రైల్వేలైన్, రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ, ఎన్టీపీసీ పవర్‌ప్లాంట్‌ నేపథ్యాన్ని పరిశీలిస్తే... 
    కేసీఆర్‌ కృషి ఫలితం కొత్తపల్లి–మనోహరాబాద్‌ లైన్‌ 
    కరీంనగర్‌–హైదరాబాద్‌లను కలిపే కొత్తపల్లి–మనోహరాబాద్‌ రైల్వేలైన్‌ మెదక్, వరంగల్, కరీంనగర్‌ జిల్లాల మీదుగా 151.36 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్‌ నుంచి సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ, బోయినపల్లి మీదుగా కొత్తపల్లి వరకు రైల్వేలైన్‌ వేస్తారు. కొత్తపల్లిలోని కరీంనగర్‌–జగిత్యాల లైనుకు ఇది కలుస్తుంది. వేములవాడ–జగిత్యాల మీదుగా ధర్మపురి, లక్సెట్టిపేట నుంచి మంచిర్యాల వరకు ఈ లైనును పొడగించాలని జగిత్యాల ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ఈ రైల్వేలైన్‌ కోసం మెదక్‌ జిల్లాలో 1260 ఎకరాలు, వరంగల్‌ జిల్లాలో 60 ఎకరాలు, కరీంనగర్‌ జిల్లాలో 900 ఎకరాల భూమిని సేకరించనున్నారు. మెదక్‌జిల్లాలో ఇప్పటికే 900 ఎకరాలు, వరంగల్‌ జిల్లాలోని 60 ఎకరాలు సేకరించి పెగ్‌ మార్కింగ్‌ చేపట్టారు. కరీంనగర్‌ జిల్లాలో భూమిని సేకరించాల్సి ఉంది. ఈ ఏడాది చివరి నాటికి భూసేకరణ పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. సీఎం కేసీఆర్‌ కరీంనగర్‌ ఎంపీగా ఉన్నపుడు జిల్లా కేంద్రం, రాజధానిలను కలిపేందుకు ఈ లైనును ప్రతిపాదించారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక ఈ లైనుకు అయ్యే వ్యయంలో మూడోవంతును రాష్ట్ర ప్రభుత్వం భరించడంతోపాటు ఉచితంగా భూమిని సేకరించి ఇచ్చేందుకు కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతోపాటు మొదటి ఐదు సంవత్సరాల్లో రైల్వే శాఖకు నష్టం వస్తే ఆ మొత్తాన్ని కూడా భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడంతోనే కేంద్రం ఈ లైనుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ విషయంలో ఎంపీ బి.వినోద్‌కుమార్‌ తీవ్రంగా కృషి చేశారు. త్వరలో సిరిసిల్లలో రైల్వేబ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్‌ప్రభుతో శంకుస్థాపన చేయించాలని కూడా ఆయన భావిస్తున్నారు. అదే సమయంలో వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, బాసర తదితర పుణ్యక్షేత్రాలను కలుపుతూ రైల్వే కారిడార్‌ నిర్మించేందుకు ఇప్పటికే ప్రణాళిక రూపొందించారు. 
     
    ఎన్‌డీఏ హయాంలోనే మూసివేత.. పునరుద్ధరణ 
    రామగుండం ఎరువుల కార్మాగారం గత ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో మూతపడగా... ప్రస్తుతం అదే ఎన్‌డీఏ సర్కారు హయాంలో పునరుద్ధరణకు నోచుకోవడం విశేషం. అయితే పునరుద్ధరణ ప్రతిపాదన యూపీఏ ప్రభుత్వం హయాంలో పురుడుపోసుకుంది. రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్‌ ఎంపీలు ఆనాడు కేంద్ర ప్రభుత్వంపై పలుమార్లు ఒత్తిడి తెచ్చి ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ ప్రతిపాదనను కొలిక్కి తీసుకొచ్చారు. ఇంతలో యూపీఏ ప్రభుత్వం గద్దెదిగి ఎన్డీయే సర్కారు రావడంతో పునరుద్ధరణ పనులకు మోక్షం కలిగింది. రామగుండం పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందిన క్రమంలో ఎరువుల కర్మాగారం గొప్పగా వర్ధిల్లింది. అన్నపూర్ణ పేరుతో ఎరువులను తెలంగాణ ప్రాంతానికి అందించింది. అయితే సాంకేతిక లోపాలు, అప్పుల ఊబిలో కూరుకుపోవడం కారణంగా ఈ కర్మాగారంలో 1999 మార్చి 31న ఉత్పత్తిని నిలిపివేశారు. బీఐఎఫ్‌ఆర్‌కు వెళ్లిన ఈ కంపెనీకి రూ.10 వేల కోట్ల అప్పులను మాఫీ చేయడంతోపాటు గ్యాస్‌ ఆధారిత కర్మాగారంగా పునరుద్ధరించడానికి కేంద్రం ముందుకు వచ్చింది. ఇంజినీర్స్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈఐఎల్‌), నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎఫ్‌ఎల్‌), ఫెర్టిలైజర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎఫ్‌సీఐఎల్‌) జాయింట్‌ వెంచర్‌గా రూ.6 వేల కోట్ల అంచనా వ్యయంతో ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరిస్తున్నారు. రోజుకు 3,850 మెట్రిక్‌ టన్నులు యూరియా, 2,200 మెట్రిక్‌ టన్నుల అమోనియా ఈ కర్మాగారంలో ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. కాకినాడ నుంచి మల్లవరం వరకు వేసే పైపులైన్‌ నుంచి గ్యాస్‌ను తీసుకునేలా గుజరాత్‌ కంపెనీతో ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం రామగుండం ఎరువుల కర్మాగారం ఆవరణలోని పాత యంత్రాలు, విభాగాలను పూర్తిగా తొలగించి నేలను చదును చేశారు. యూరియా ప్రిల్లింగ్‌ టవర్, యూరియాను నిల్వ ఉంచే సైలో మినహా అన్నింటిని తొలగించారు. ఇందులో 500 మంది శాశ్వత ఉద్యోగులు, మరో వెయ్యి మంది ఒప్పంద కార్మికులకు ఉపాధి లభించనుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 11శాతం వాటా తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ విషయంపై నేడు ప్రధానితో ప్రకటన చేయించే అవకాశాలున్నాయి.
     
    విభజన హామీలో తొలి అడుగు.. తెలంగాణ స్టేజ్‌–1 
    తెలంగాణకు 4వేల మెగావాట్ల విద్యుత్‌ను కేటాయిస్తామని రాష్ట్ర విభజన చట్టంలో కేంద్రం పేర్కొంది. అందులో భాగంగా తెలంగాణ స్టేజ్‌–1 మొదటి దశ కింద 800 మెగావాట్ల చొప్పున రెండు యూనిట్లతో కూడిన ప్లాంట్‌ను నిర్మించేందుకు సిద్ధమైంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను పూర్తిగా తెలంగాణ అవసరాలకే వినియోగించనున్నారు. ఈ ప్లాంట్‌ పనులు జనవరి 29న ఆరంభమైనప్పటికీ ప్రధాని చేతుల మీదుగా లాంఛనంగా శంకుస్థాపన చేయించనున్నారు. బాయిలర్‌ కాంట్రాక్టు పొందిన బీహెచ్‌ఈఎల్‌ సంస్థ గ్రౌండ్‌ లెవల్, గ్రేడింగ్‌ పనులను వేగంగా పూర్తి చేసి బాయిలర్లు నెలకొల్పేందుకు అవసరమైన ఫౌండేషన్‌ను ఇప్పటికే సిద్ధం చేసింది. టర్బైన్‌ కాంట్రాక్టును దక్కించుకున్న ఆల్‌స్టాం సంస్థ మట్టి పరీక్ష పనులను పూర్తి చేసి పవర్‌హౌస్‌ స్థలాన్ని చదును చేసి స్ట్రక్చర్ల నిర్మాణానికి సిద్ధం చేసింది. దీనికి ఇప్పటికే రూ.10,500 కోట్లు మంజూరయ్యాయి. బాయిలర్, టర్బైన్‌ పనులు నడుస్తుండగా, మిగతా సివిల్‌ పనులకు సంబంధించి బీహెచ్‌ఈఎల్, ఆల్‌స్టాం సంస్థలు సబ్‌కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశాయి.  సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో నిర్మిస్తున్నందున ప్రాజెక్టు పూర్తి చేసేందుకు 42 నెలల సమయం పడుతుంది. రెండో దశలో మిగతా 800 మెగావాట్ల 3 యూనిట్లను (2400 మెగావాట్లు) ప్రస్తుత కొత్త ప్లాంట్‌ ప్రతిపాదిత స్థలంలోనే నిర్మించేందుకు ఎన్టీపీసీ కార్పొరేట్‌ ఇంజనీరింగ్‌ విభాగం నిర్ణయం తీసుకున్నది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement