ఎల్లారెడ్డి: అమ్మ ఒడి నుంచి బుడిబుడి అడుగులు వేస్తూ బడికి వచ్చే చిన్నారులను కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుంది. అమ్మ ఒడిలాగా చదువుల గుడి అయిన బడి కూడా భద్రంగా ఉంటుందన్న భరోసా.. లోకం తెలియని ఆ చిన్నారులకివ్వాల్సి ఉంటుంది. కానీ ఓ ప్రైవేటు పాఠశాల టీచర్ అల్లరి చేస్తున్నాడన్న నెపంతో నాలుగేళ్ల చిన్నారిపై ప్రతాపం చూపించాడు. వంటిపై వాతలు వచ్చేలా చితకబాదాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డిలో శనివారం జరిగింది. స్థానిక బ్రిలియంట్ మోడల్ స్కూల్‌లో శ్రీనిధికేతన్ ఎల్‌కేజీ చదువుతున్నాడు.
శనివారం పాఠశాల నుంచి తిరిగి వచ్చిన శ్రీనిధికేతన్ వంటిపై వాతలు ఉండడంతో.. తల్లి తులసి స్కూల్ మేనేజ్‌మెంట్ ప్రతినిధులను నిలదీసింది. అయితే, స్కూల్‌లో ఎవరూ కొట్టలేదని.. బయట ఆడుకుంటున్నప్పుడు దెబ్బలు తగిలి ఉంటాయని వారు చెప్పారు. దీంతో చిన్నారిని ఆస్పత్రికి వెళ్లగా.. ఇవి కర్రతో కొట్టిన దెబ్బలేనని వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న ఎంపీపీ నక్క గంగాధర్, ఎంపీటీసీ సభ్యుడు షెఖావత్, ఎంఈవో వెంకటేశం బాలుడి ఇంటికి వెళ్లి దెబ్బలు పరిశీలించారు. వారు సైతం పాఠశాల ప్రతినిధులను అడిగినా.. అదే సమాధానం చెప్తున్నారు.
నాలుగేళ్ల చిన్నారిపై టీచర్ ప్రతాపం!
Published Sat, Nov 28 2015 9:19 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement