‘ప్రత్యేకహోదా విషయంలో సీఎం విచిత్ర వైఖరి’
అనంతపురం సెంట్రల్ : ప్రత్యేకహోదా విషయంలో సీఎం చంద్రబాబునాయుడు విచిత్రంగా వ్యవహరిస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి విమర్శించారు. గుత్తిరోడ్డులోని కేటీఆర్ కన్వెషన్‌హాలులో గురువారం కేంద్ర ప్రభుత్వ పథకాలు– వాటి అమలు అనే అంశంపై బీజేపీ కార్యకర్తలకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సీఎం చంద్రబాబునాయుడు ఓ సమావేశంలో 2017 తర్వాత దేశంలో ప్రత్యేక హోదా పొందుతున్న రాష్ట్రాలను తొలగిస్తారని చెప్పారని, రాష్ట్రం విషయానికొస్తే ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నారన్నారు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి అని పేర్కొన్నారు.
కేంద్రంలో ఉన్న బీజేపీ ఎన్నో పథకాలు పేదలకోసం తెచ్చిందన్నారు. కేవలం రూ. 121తో ప్రధానమంత్రి సురక్ష బీమా యోచన పథకం తెచ్చిన ఘనత బీజేపీదే అన్నారు. ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన పథకం ద్వారా సాగునీరు అభివృద్ధి కోసం 2015–16లో రూ. 800 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ పథకం కింద వచ్చిన నిధుల్ని ప్రభుత్వం పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి వినియోగిస్తోందని వివరించారు.
జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ద్వారా రాష్ట్రానికి రూ.6,500 కోట్లు నిధులను మంజూరు చేస్తోందని తెలిపారు. ఇందులో అమరావతిలో ఔటర్‌రింగ్ రోడ్లను నిర్మిస్తోందని వివరించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు అంకాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు విష్ణువర్దన్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీంద్రరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి, సుదర్శన్, పురందర్, అధికార ప్రతినిధి మల్లారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.